చినుకులే.. పెద్ద వానలు పడ్తలేవు

deficiency-rainfall-record-in-telangana

హైదరాబాద్‌‌, వెలుగుజులై నెల ముగుస్తున్నా రాష్ట్రంలో ఇంకా వానలు పడ్తలేవు. రైతన్న ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా వరుణుడు కరుణించడంలేదు. ఇప్పటిదాకా తేలికపాటి జల్లులు మినహా ఎక్కడా పెద్దగా వానలు కురవలేదు. దీంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. వానలు పడాలని పల్లెల్లో పూజలు, హోమాలు చేస్తున్నారు. దేవుళ్లను జలాలతో అభిషేకిస్తున్నారు. గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బిందెలతో ఊరేగిస్తున్నారు.

లోటు.. కొనసాగుతోంది

ఈ సీజన్‌‌ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో వర్షపాతం లోటు కొనసాగుతూనే ఉంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం, ద్రోణులు, అల్పపీడనాలు, ఆవర్తనాలు ఏర్పడకపోవడంతో రాష్ట్రమంతా వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సీజన్‌‌లో రాష్ట్రంలో 37 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటిదాకా 317.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 200.2మి.మీ. మాత్రమే రికార్డయ్యింది. ఐదు జిల్లాలు మినహా రాష్ట్రమంతా లోటు వర్షపాతమే. కామారెడ్డి, మహబూబ్‌‌నగర్‌‌, వనపర్తి, నాగర్‌‌కర్నూల్‌‌, నారాయణపేట జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఖమ్మంలో అత్యధికంగా 60 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. మంచిర్యాలలో 58 శాతం, సూర్యాపేటలో 55, మహబూబాబాద్‌‌లో 54, కొత్తగూడెంలో 53 శాతం తక్కువ నమోదైంది.

ఆగస్టు వరకు వెయిటింగే

ఈనెల మొత్తం వర్షాలు పెద్దగా పడవని, ఇప్పుడున్న పరిస్థితే ఉంటుందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌‌ రాజారావు తెలిపారు. ఇటీవల ఒక ఆవర్తనం ఏర్పడినా అదీ అనుకూలంగా లేదని స్పష్టం చేశారు. ఆవర్తనం మధ్యలో ఉందని, భూమి దగ్గరకు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి మాత్రం వర్షాలు విస్తారంగా పడతాయని తెలిపారు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో మాత్రం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడొచ్చని చెప్పింది.

లోటు ఎక్కువగా ఉన్న జిల్లాలు

జిల్లా                 లోటు (శాతాల్లో)

ఖమ్మం                     60

మంచిర్యాల               58

సూర్యాపేట                55

మహబూబాబాద్‌‌        54

భద్రాద్రి కొత్తగూడెం       53

ములుగు                 48

వరంగల్‌‌ రూరల్‌‌         48

నిర్మల్‌‌                     48

Latest Updates