రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ప్రభుత్వ ఆదాయానికి లోటు

కరోనా దెబ్బకు రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇప్పటికే భారీగా పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల కోట్లు సాధించాలనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.1461 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ల శాఖకు సెలవులు ప్రకటించడంతో ఆదాయం మరింత తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ ‌లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు టెక్నికల్ మార్పులు తీసుకొస్తున్నామని, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. సబ్‌రిజిస్ట్రార్‌, కార్యాలయాల్లో వీలునామా, వివాహాల నిర్వహణ, ఫ్రాంకింగ్‌ సేవలు యథావిధిగా కొనసాగుతాయని, మళ్లీ చెప్పే వరకు రిజిస్ట్రేషన్లు మాత్రం చేయొద్దని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు, ఈ-చలాన్‌ అమ్మకాలను నిలిపివేశారు. గతంలో స్టాంపులు కొనుగోలు చేసిన, చలాన్లు చెల్లించినవారికి మాత్రమే నిన్న(సోమవారం) రిజిస్ట్రేషన్లు చేశారు. అయితే కొత్త రెవెన్యూ చట్టం రూపొందాక మళ్లీ యధావిధిగా కార్యకలాపాలు సాగుతాయని, ఆదాయాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. న్యూ రెవెన్యూ చట్టాన్ని అనుసరించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సమూల మార్పులు  తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లు తెలుస్తోంది.

Latest Updates