ప్రాణమే గానమనుకున్న గొంతు మూగబోయిన వేళ..

హాలాహలాన్ని గొంతులో దాచుకున్న వాణ్ని శివుడు అన్నారు.అమృతాన్ని గొంతులో నింపుకున్నవాణ్నిఏమనాలి? బాలు అనాలి.అవును. ఆయన గొంతు విప్పితే  అమృతమే పొంగి పొర్లింది.అది ప్రవాహమై పరవళ్లు తొక్కుతూ ప్రపంచమంతా పాకింది. ప్రతి మనసునూ తాకింది. ప్రతి గుండెనూ మీటింది.ఇప్పుడా గొంతు మూగబోయింది. అందుకే.. పాట చిన్నబోయింది. ఆయన పాటను ప్రేమించిన ప్రతి మనసూ కరిగి నీరవుతోంది.

‘బాలు’డిగా ఉన్నప్పుడే..

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం పాటతోనే పుట్టారు, పాటతోనే పెరిగారు. 1946, జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు బాలు. ఆయన తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి హరికథలు చెప్పేవారు. గాత్ర శుద్ధి తండ్రి నుండే అబ్బింది బాలుకి. తల్లి శకుంతలమ్మ ప్రోత్సాహం కూడా చాలా ఉంది. ఇంజినీర్ అవ్వాలనే పట్టుదలతో చదువుపై దృష్టి పెట్టారు తప్ప ప్రత్యేకంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు బాలు. రాగతాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండడంతో శాస్త్రీయ సంగీతానికి ప్రాధాన్యత గల చిత్రాల్లోనూ అవలీలగా పాటలు పాడారు. ఘంటసాల గానం రాజ్యమేలుతున్న సమయంలో ఒక ఫ్రెష్‌‌ వాయిస్‌‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు బాలు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా..  ప్రతి మ్యూజిక్‌‌ డైరెక్టర్‌‌ నుంచి ఎంతో నేర్చుకొంటూ త్వరత్వరగా ఎదిగారు. అతితక్కువ కాలంలోనే తెలుసు సినీ సంగీత ప్రపంచంలో తన ముద్ర వేయగలిగారు.  1966  డిసెంబర్  15న కోదండపాణి సంగీత సారథ్యంలో ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రంతో బాలు పాటల ప్రస్థానం మొదలైంది. ‘ఏమి ఈ వింత మోహం’ అనే పాటను పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, కె.రఘురామయ్యలతో కలిసి పాడారు. శోభన్‌‌ బాబు పాత్రకి బాలు గానం వినొచ్చు. ఫస్ట్ సాంగ్ రికార్డైన ఎనిమిది రోజులకే ‘నక్కరె అదే స్వర్గ’ అనే కన్నడ సినిమాలోనూ పాట పాడటం విశేషం. తెలుగులో బాలుకి రెండో అవకాశం ఇవ్వడమే కాక డబ్బింగ్

చిత్రం ‘కాలచక్రం’లో అన్ని పాటలు బాలు చేత పాడించారు ఎం.ఎస్‌‌.రెడ్డి. ఆ తర్వాత ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంది. భాషతో పని లేదు. పాటతోనే పని. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. కాలంతో పాటు సినిమా పాట ఎలాగైతే మారుతూ వచ్చిందో.. ఆ ధోరణులన్నీ అవపోసన పట్టి, ట్రెండ్‌‌కి తగ్గట్టుగా పాడటం ఆయనకే చెల్లింది.  శాస్త్రీయ సంగీతం నుంచి జానపదాల వరకూ, లలిత సంగీతం నుంచి రాక్‌‌ వంటి వాటి వరకు దేనినైనా ఆయనలా
పర్‌‌‌‌ఫెక్ట్‌‌గా పాడగలిగేవారు మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు.

అన్నింటా మేటి

పాట పాడటం ఒకెత్తు. పాటను స్వరపరచడం ఒకెత్తు. పాట ట్యూన్‌‌ చేసినవాళ్లంతా దాన్ని పాడగలరేమో కానీ, ప్రతి గాయకుడూ పాటను కంపోజ్‌‌ చేయలేడు. కానీ సింగర్‌‌‌‌గా బాలు ఎంత గొప్పవారో.. కంపోజర్‌‌‌‌గా కూడా అంతే గొప్పవారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో నలభై అయిదు సినిమాలకు సంగీతాన్ని అందించారాయన.  మరోపక్క మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు. ఆదిత్య369, భామనే సత్యభామనే చిత్ర నిర్మాణంలో ఆయనకు భాగస్వామ్యం ఉంది. ‘శుభసంకల్పం’ మూవీకి తానే నిర్మాతగా వ్యవహరించి బెస్ట్ ప్రొడ్యూసర్‌‌‌‌ అంటూ ప్రశంసలు అందుకున్నారాయన. మరోపక్క నటుడిగానూ సత్తా చాటారు. సింగర్స్ సాధారణంగా మ్యూజిక్ ఆల్బమ్స్​లో నటిస్తారు. అవసరం అనుకుంటే సినిమాల్లో ఒకటీ రెండు సీన్లలోనూ కనిపిస్తుంటారు. కానీ బాలు అలా కాదు. నటుడిగానూ మెప్పించారు. గెస్ట్ రోల్స్ దగ్గర్నుంచి విలన్ పాత్రల వరకు చేసి తన టాలెంట్‌‌ చూపించారు. కామెడీ టైమింగ్‌‌లోనూ సూపర్ అనిపించిన సందర్భాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా జంధ్యాల దర్శకత్వంలో  ‘మల్లెపందిరి’ మూవీలో నవ్వులు పూయించిన ఎస్పీబీ.. ‘పక్కింటి అమ్మాయి’ సినిమాలో బాలరాజుగా కథను మలుపుతిప్పే కీలక పాత్రలో కనిపించారు. అక్కడి నుంచి వివాహ భోజనంబు, ప్రేమ, పర్వతాలు పానకాలు, రాజహంస, చిరుజల్లు, పవిత్రబంధం, ఆరోప్రాణం, ప్రేమదేశం, ప్రేమికుడు లాంటి ఎన్నో సినిమాల్లో తన నటనతో అలరించారు. కమర్షియల్ సినిమాలే కాకుండా దేవస్థానం, మిథునం లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ‘మిథునం’ సినిమాలోని పాత్ర తనకెంతో తృప్తినిచ్చిందని ఓ సందర్భంలో చెప్పారు బాలు. చిన్నది, పెద్దది అనే తేడా లేకుండా వైవిధ్యమైన పాత్రలు వస్తే చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పేవారు.

బాలు మరణించడమంటే ఓ మనిషి దూరమవడం కాదు. ఓ చరిత్ర ముగిసిపోవడం. బాలు లేకపోవడమంటే ఒక స్వరం ఆగిపోవడం కాదు.. సంగీతమే మూగబోవడం. ఇంత గొప్ప చరిత్రను రాయడం అంత తేలిక కాదు. అంత గొప్ప గాత్రాన్ని వినడం ఇక సాధ్యం కాదు. అందుకే ఆ గానగంధర్వుడు వదిలివెళ్లిన స్థానం ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది. ఇండస్ట్రీలోనే కాదు.. జనాల గుండెల్లో కూడా!

అందరివాడు

పాటతోనే కాదు.. వ్యక్తిత్వంతోనూ అందరినీ ఆకట్టుకోవడంలో బాలు తర్వాతే ఎవరైనా. అందుకే ఆయన్ని అందరూ మనవాడు అంటారు. అందరివాడు అని పొగడుతారు. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండటం.. ఎవరినీ పల్లెత్తు మాట అనకపోవడం.. ఎంత చిన్నవాడినైనా గౌరవించడం.. ఎంత కష్టమొచ్చినా చిరునవ్వు నవ్వడం.. ఇవన్నీ ఆయన్ని చూసే నేర్చుకోవాలి. మేరు పర్వతంలాంటి కీర్తి ఆయనది. కానీ చిన్న గడ్డిపోచని కూడా గుర్తించి ప్రోత్సహించే గుణం ఉంది. అందుకే ఆయన అందరికీ కావలసిన వ్యక్తి. అందరూ కోరుకునే ప్రేమమూర్తి. పాటతో పరవశింపజేయడమే కాదు.. కష్టంలో ఆదుకోవడం కూడా ఆయనకి తెలుసు. తన తండ్రి పేరుతో ట్రస్ట్ పెట్టి ఎందరికో సాయం చేశారు. తన స్వస్థలమైన నెల్లూరులోని తిప్పరాజువారి వీధిలో ఉన్న గృహాన్ని వేద పాఠశాల నిర్వహణకు విరాళంగా ఇచ్చేశారు. మంచి పనులకి విరాళాలు సేకరించడానికి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చేవారు. కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి కూడా నడుం కట్టారు. శ్రోతలు కోరిన పాటలు పాడి విరాళాలు సేకరించారు. కానీ దురదృష్టం.. ఆ కరోనా మహమ్మారికి ఆయనే బలైపోయారు.

మనసులోమణిపూస

బాలు భార్య పేరు సావిత్రి. వీరికి ఇద్దరు సంతానం. తన ఆరోప్రాణమైన పాటలోని పల్లవి, చరణాలనే తన పిల్లల పేర్లుగా నిర్ణయించారు బాలు. చరణ్ కూడా తండ్రి బాటలోనే సింగర్‌‌గా, నిర్మాతగా కొనసాగుతున్నాడు. బాలు చెల్లెలు శైలజ కూడా సింగర్. నటుడు శుభలేఖ సుధాకర్ ఆమె భర్త. ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్, నటుడు చంద్రమోహన్‌ బాలుకి దూరపు బంధువులు. కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితులు ఆయన్ని ‘మణి’ అని పిలుస్తారు. సినిమా ఇండస్ట్రీలో చక్రవర్తి, మహదేవన్ మాత్రమే అలా పిలిచేవారు. అనుబంధానికి ఎంతో విలువిస్తారని, ముద్దుపేరుకు తగ్గట్టుగానే మణిపూస లాంటి మనసున్న మనిషని ఆయన గురించి సన్నిహితులు గొప్పగా చెబుతారు. హీరోలందరిలోకీ కమల్‌ హాసన్‌తో బాలుకి ఎక్కువ అనుబంధం ఉంది. వాళ్లిద్దరిదీ అన్నదమ్ముల మైత్రి అంటుంటారంతా.

అదే గొప్ప అవార్డు

‘శంకరాభరణం’ సినిమాలోని ఓంకార నాదాను అనే పాటకి తొలి జాతీయ అవార్డును అందుకున్నారు బాలు. శాస్త్రీయ సంగీతంలో ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ లేకున్నా ఆయన ఈ పాట పాడిన విధానం అమోఘం. 1981లో ‘ఏక్‌ దూజే కే లియే’ మూవీలో ‘తేరే మేరే బీచ్ మే’, 1983లో సాగర సంగమంలోని ‘తకిట తదిమి’ పాటకి, 1988లో రుద్రవీణలోని ‘చెప్పాలని ఉంది’, 1995లో కన్నడ చిత్రం ‘గనయోగ పంచాక్షర గవయి’లోని ‘ఉమండు గుమండు’, 1996లో తమిళ చిత్రం మిన్సార కనవు (మెరుపు కలలు)లోని తంగ తామరై మగలే పాటలకి కూడా జాతీయ అవార్డులు వరించాయి. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్​ అవార్డులతో కేంద్రం ఘనంగా ఆయన్ని సత్కరించింది. 2016లో కేంద్ర సమాచార ప్రసార శాఖ నుండి ‘శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం’ అందుకున్నారు. 1999లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, 2009లో ఆంధ్ర యూనివర్సిటీ, అదే ఏడాది తమిళనాడు సత్యభామ యూనివర్సిటీ, 2011లో అనంతపురం జెఎన్‌టియు ఆయనకు గౌరవ డాక్టరేట్స్​ని ప్రదానం చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి 25 స్టేట్ అవార్డ్స్, తమిళనాడు నుండి మూడు స్టేట్ అవార్డ్స్, కర్ణాటక నుండి మూడు స్టేట్ అవార్డ్స్ ఆయన కీర్తి కిరీటంలో ఒదిగాయి. సింగర్​గానే కాదు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘మయూరి’ సినిమాకి.. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ‘పవిత్రబంధం’ సినిమాకి ఏపీ స్టేట్ అవార్డుని అందుకున్నారు. 1981లో కళైమామణి పురస్కారంతో తమిళనాడు ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది.

ఒంటరిగా వదిలేసి..

పాటలో సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో గాత్రానికీ అంతే. ఆ రెండింటిదీ అవినాభావ సంబంధం.  బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజాలది కూడా అలాంటి బంధమే. ఆ బంధం వయసు యాభయ్యేళ్లు. మరో వందేళ్లు వినిపించే అద్భుతమైన పాటలు ఇద్దరి కలయికలో వచ్చాయి. ఇళయరాజా సంగీత ప్రయాణంలో బాలు పాత్ర కూడా కీలకం. బాలు ఎక్కువ పాటలు పాడింది కూడా ఇళయరాజా సంగీతంలోనే. రాజాని తన సోదరుడిగానే భావిస్తానని బాలు చెబుతుండేవారు. బాలు అంటే రాజాకీ అంతే అభిమానం. కానీ ఆమధ్య రాయల్టీ విషయంలో వీరిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. తాను సంగీతం అందించిన పాటలను తన అనుమతి లేకుండా స్టేజ్‌పై పాడటానికి వీల్లేదంటూ ఇళయరాజా లీగల్ నోటీసులు ఇవ్వడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. తాను పాడిన పాటలు తిరిగి పాడే హక్కు తనకు ఉందంటూ కొద్దికాలం ఇళయరాజా పాటల్ని బాలు పాడలేదు. కానీ ఇలాంటి వివాదాలు స్నేహబంధాన్ని విడదీయలేవని ప్రూవ్ అయ్యింది. ఇద్దరూ మళ్లీ ఒకటయ్యారు. ఇళయరాజా సంగీతంలో బాలు పాటలు కూడా పాడారు. బాలు కరోనాతో హాస్పిటల్‌లో చేరినప్పుడు రాజా తట్టుకోలేకపోయారు. ‘త్వ‌ర‌గా లేచి రా బాలూ.. నీ కోసం నేను వేచి చూస్తున్నా’ అంటూ ఎమోషనల్‌ అయ్యారు. కానీ బాలు రాలేదు. రాజాకి కన్నీరు ఆగట్లేదు.ఎయిటీస్​లో ఆయన ఎంత బిజీగా ఉండేవారంటే.. ఒకే రోజులో 17 కన్నడ పాటలు పాడారు. ఒక్క రోజులో తెలుగు, తమిళ భాషల్లో 19 పాటలు, హిందీలో 16 పాటలు పాడిన సందర్బాలు ఉన్నాయి.

హిందీ చిత్రసీమను కూడా చాలా యేళ్లపాటు ఏలారు బాలు. ‘మరో చరిత్ర’ హిందీ రీమేక్‌ ‘ఏక్‌ దూజే కే లియే’ బాలు ఫస్ట్ హిందీ మూవీ. దక్షిణాది సింగర్స్ హిందీ పాటకి న్యాయం చేయలేరంటూ లక్ష్మీకాంత్-ప్యారేలాల్ బాలుతో పాడించడానికి ఒప్పుకోలేదు. కానీ తన సినిమాలో హీరో  సౌతిండియన్ కనుక బాలు వాయిస్ కరెక్ట్ అంటూ పట్టుబట్టి పాడించారు బాలచందర్. ఆ సినిమాలోని ‘తేరే మేరే బీచ్‌ మే’ పాటతో నేషనల్ అవార్డు అందుకోవడంతో బాలీవుడ్‌లోనూ బాలు పేరు మారుమోగింది. ఆ తర్వాత హిందీలో దాదాపు 700 పాటలు పాడారు.

ఎంతోమంది హీరోలకి బాలు పాటలు పాడారు. అయితే ఓ సందర్భంలో బాలు పాత్రకి కన్నడ స్టార్ రాజ్‌కుమార్ పాట పాడారు. ‘ముద్దిన మావ’ (తెలుగులో మామగారు)లో హీరో పాత్రకి బాలు పాటలు పాడితే.. మామగారి పాత్రలో ఆయన పోషించిన పాత్రకి రాజ్‌కుమార్ పాడటం విశేషం.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్​తో సహా తెలుగు అగ్రహీరోలందరూ ఒకానొక సమయంలో రామకృష్ణ చేత ఎక్కువ పాటలు పాడిస్తుండడంతో బాలుకి కొంత అవకాశాలు తగ్గాయి. ఆ సమయంలో కృష్ణగారు అవకాశాలు ఇచ్చి తననెంతో ప్రోత్సహించారని బాలు చెప్పేవారు. అయితే ఓ చిన్న అభిప్రాయ భేదంతో ఇద్దరూ కొన్నేళ్లపాటు కలిసి వర్క్ చేయలేదు. ఆ తర్వాత వేటూరి చొరవతో కృష్ణ గారిని బాలు కలవడంతో వివాదం సమసిపోయి, తిరిగి కృష్ణకి కూడా పాడటం మొదలుపెట్టారు.

‘మన్మథలీల’ తెలుగు వెర్షన్‌కి డబ్బింగ్ చెప్పి యాక్సిడెంటల్‌గా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు బాలు. ఆ తర్వాత కమల్​తో పాటు రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, జెమినీ గణేషన్​​​, సల్మాన్ ఖాన్, విష్ణువర్థన్, అర్జున్, భాగ్యరాజా, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, కార్తీక్, రఘువరన్ లాంటి పలువురికి బాలు డబ్బింగ్ చెప్పారు. ‘అన్నమయ్య’ సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్రకి చెప్పిన డబ్బింగ్‌తో నంది అవార్డు కూడా అందుకున్నారు

Latest Updates