డిగ్రీ ఫీజులు రాష్ట్రమంతా ఒకే తీరు!

ప్రస్తుతం ఒక్కో యూనివర్సిటీ పరిధిలో ఒక్కోలా వసూలు
కోర్సుల వారీగా కామన్​ఫీజు నిర్ణయించే యోచనలో సర్కారు
రీయింబర్స్ మెంట్​విడుదల, ఇతర సమస్యలకు చెక్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీల్లో ఒకే రకమైన ఫీజులను వసూలు చేయాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. అన్ని ప్రైవేటు కాలేజీల్లో కూడా ఒక కోర్సుకు ఒకే ఫీజు ఉండేలా కసరత్తు జరుగుతోందని విద్యా శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో వర్సిటీ పరిధిలో ఒక్కో రకమైన ఫీజు ఉంది. కొన్ని వర్సిటీల పరిధిలో ఫీజు బాగా తక్కువగా ఉండగా మరోదానిలో ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫీజు రీయింబర్స్​మెంటు చెల్లింపులో సమస్య తలెత్తి స్టూడెంట్లకు నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కామన్​ ఫీజు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

900కిపైగా ప్రైవేటు కాలేజీల్లో..

రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీ పరిధిలో మొత్తం1,049 డిగ్రీ కాలేజీలు, సుమారు 900కు పైగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. ప్రధానంగా బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నా.. సీబీసీఎస్ విధానం అమల్లోకి వచ్చాక ఒక్కో గ్రూపులో పదుల సంఖ్యలో సబ్​ గ్రూపులు వచ్చాయి. వాటిల్లోనూ స్టూడెంట్స్​పెద్దసంఖ్యలో చేరుతున్నారు. డిగ్రీ ఆన్​లైన్ ​అడ్మిషన్ల (దోస్త్) ప్రక్రియ ద్వారా సీట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టూడెంట్లకు సర్కారు ట్యూషన్​ ఫీజు చెల్లిస్తోంది. కానీ ఆయా యూనివర్సిటీలు నిర్ణయించిన మొత్తం ఫీజులను రీయింబర్స్​ చేయడం లేదు. వివిధ కోర్సులకు ఒక్కో వర్సిటీ పరిధిలో ఒక్కో రకమైన ఫీజులు దీనికి ప్రధాన కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి. దీంతో కొన్ని వర్సిటీల పరిధిలోని ప్రైవేటు కాలేజీల్లో చదివే స్టూడెంట్లు నష్టపోతున్నారని అంటున్నాయి.

చాలా రోజుల నుంచీ డిమాండ్

అన్ని వర్సిటీల పరిధిలో కామన్​ఫీజు ఉండాలని కాలేజీల మేనేజ్మెంట్లు, స్టూడెంట్ల నుంచి డిమాండ్​ ఉంది. మెట్రోపాలిటిన్ సిటీగా పేరున్న హైదరాబాద్​లోని కాలేజీలకు ఫీజులు తక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటంపై విమర్శలూ వచ్చాయి. ఐదేండ్లుగా ఫీజులు పెంచడం లేదంటూ కాలేజీల మేనేజ్​మెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు ఒకే కోర్సుకు వేర్వేరు ఫీజులు ఉండటంతో సంక్షేమ శాఖ అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. రీయింబర్స్​ చేయడం తలనొప్పిగా మారుతోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వర్సిటీ రిజిస్ట్రార్లతో సంక్షేమశాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్టు తెలిసింది. కామన్​ ఫీజు పెడితే బాగుంటుందని ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం.

ఫీజులు రివైజ్ చేయాలె..

హైదరాబాద్ ​లాంటిచోట జీతాలు, కిరాయిలు ఎక్కువ. గ్రామీణ ప్రాంత వర్సిటీల పరిధిలో తక్కువ. అయినా ఓయూ పరిధిలోని కాలేజీల్లోనే ఫీజులు తక్కువగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా సీబీసీఎస్ విధానం ఉంది. రాష్ట్రంలో ఒకే దగ్గరి నుంచి అడ్మిషన్స్​ జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఒకే ఫీజు పెడితే తప్పేంటి? వెంటనే ఫీజులు రీవైజ్​ చేసి, కామన్ విధానాన్ని అమలుచేయాలె.       – గౌరీసతీశ్, డిగ్రీ మేనేజ్​మెంట్ల ప్రతినిధి

మేనేజ్మెంట్లు కోరుతున్నయి

ఒక్కో వర్సిటీ  ఒక్కో రకమైన ఫీజులు నిజమే. చాలా ఏండ్ల నుంచి ప్రైవేటు డిగ్రీ కాలేజీల మేనేజ్​మెంట్లు కామన్​ ఫీజు  అమలు చేయాలని కోరుతున్నాయి. ప్రస్తుతం వర్సిటీ నిర్ణయించిన ఫీజుల్లోనూ కొంత గవర్నమెంట్​ ఇస్తుంది. కాలేజీల్లో ఫీజులు పెంచినా రీయింబర్స్​మెంట్ పెరగదు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.                                               – టి.పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్

Latest Updates