- మెదడులో జరిగే కెమికల్ రియాక్షన్స్ తో ఆల్కహాల్ అడిక్షన్
- ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల స్టడీలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఆల్కహాల్ అలవాటు క్రమంగా అడిక్షన్‌గా మారడానికి మానవ మెదడులో జరిగే కెమికల్ రియాక్షన్సే కారణమని ఢిల్లీ ఎయిమ్స్ సైకియాట్రి విభాగం ప్రొఫెసర్లు తేల్చారు. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సహకారంతో 8 మంది ప్రొఫెసర్ల బృందం చేసిన స్టడీ రిపోర్ట్‌ను ఏసియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రి విడుదల చేసింది. ఆల్కహాల్ తాగిన కొద్దీ ఇంకా తాగాలని అనిపించడానికి కారణాలను రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆల్కహాల్ అలవాటు మితంగా ఉన్నా, సుదీర్ఘ కాలం పాటు దాన్ని కొనసాగించడం వల్ల మెదడుపై ప్రభావం పడుతుందని గుర్తించారు.
ఈ ఎఫెక్ట్ మెదడులోని సెరోటోనిన్, డోపమైన్ తదితర పదార్థాల మీద పడి క్రమంగా మందు తాగాలనే కోరికను పెంచుతాయని తెలిపారు. మందుకు బానిసలు కావడానికి జనటికల్, పరిసరాల ప్రభావం కూడా కారణాలని గుర్తించారు. పేరెంట్స్‌కు మందు అలవాటు ఉంటే, వారి పిల్లలకు కూడా ఆ అలవాటు వచ్చే అవకాశం 50 నుంచి 60 శాతం ఉంటుందని పేర్కొన్నారు. మందుకు బానిసలై, ప్రస్తుతం డీఅడిక్షన్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వంద మందిని, మందు అలవాటు లేని మరో వంద మందిని ఎంపిక చేసి ఈ స్టడీ చేసినట్టుగా రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
