ఢిల్లీ సిక్సర్‌..ఆరో విక్టరీతో మళ్లీ టాప్ ప్లేస్ కు

వరుసగా నాలుగు ఓటముల తర్వాత గత మ్యాచ్‌‌లో సన్‌‌రైజర్స్‌‌పై సూపర్‌‌ విక్టరీతో గెలుపు బాట పట్టిన రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ మళ్లీ నిరాశ పరిచింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను తక్కువ స్కోరుకే నిలువరించినా.. ఛేజింగ్‌‌లో బెన్‌‌ స్టోక్స్‌‌ మెరుపు ఆరంభం ఇచ్చినా.. మిడిలార్డర్‌‌ ఫెయిల్యూర్‌‌తో ఐదో ఓటమి మూటగట్టుకుంది.  36 బంతుల్లో 47 పరుగులు అవసరమైన టైమ్‌‌లో చేతిలో ఐదు వికెట్లున్నా చేజేతులా ఓడింది. ఫించ్‌‌ హిట్టర్‌‌ రాహుల్‌‌ తెవాటియా లాస్ట్‌‌ బాల్‌‌ వరకూ క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. మరోవైపు  శిఖర్‌‌ ధవన్‌‌ (33బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57), శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53) హాఫ్‌‌ సెంచరీలతో చెలరేగినా ప్రత్యర్థి ముందు నార్మల్‌‌ టార్గెట్‌‌ మాత్రమే ఉంచిన ఢిల్లీ డెత్‌‌ ఓవర్లలో సూపర్‌‌ బౌలింగ్‌‌తో దాన్ని కాపాడుకుంది. లీగ్‌‌లో ఆరో విక్టరీతో మళ్లీ టాప్‌‌ ప్లేస్‌‌కు వచ్చేసింది.

దుబాయ్‌‌:  గత మ్యాచ్‌‌లో ముంబై ఇండియన్స్‌‌ చేతిలో ఓటమి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌‌ వెంటనే పుంజుకుంది. ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో  మెప్పించిన ఆ జట్టు బుధవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో  13 పరుగుల తేడాతో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌పై ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఛేజింగ్‌‌లో  రాజస్తాన్‌‌  ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 148 పరుగులే చేసి ఓడిపోయింది. బెన్‌‌ స్టోక్స్‌‌ (35 బంతుల్లో 6 ఫోర్లతో 41), రాబిన్‌‌ ఊతప్ప (27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 32) రాణించినా ఫలితం లేకపోయింది. మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద  మ్యాచ్‌‌ అన్రిచ్‌‌ నోకియా (2/33), అరంగేట్రం పేసర్‌‌ తుషార్‌‌ దేశ్‌‌పాండే (2/37)  చెరో రెండు వికెట్లు తీయగా, స్పిన్నర్‌‌ అశ్విన్‌‌ (1/17) పొదుపుగా బౌలింగ్‌‌ చేశాడు.

ధవన్‌‌, అయ్యర్‌‌ హాఫ్​ సెంచరీలు

ఢిల్లీ ఇన్నింగ్స్‌‌లో ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌, కెప్టెన్‌‌ శ్రేయస్‌‌ అయ్యర్‌‌ ఇద్దరూ హాఫ్‌‌ సెంచరీలు చేసినా ఆ జట్టు ఆశించిన స్కోరు సాధించలేకపోయింది.  టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీకి పేసర్‌‌ జోఫ్రా ఆర్చర్‌‌ (3/19) స్టార్టింగ్‌‌లోనే డబుల్‌‌ షాక్‌‌ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కే  ఓపెనర్‌‌ పృథ్వీ షా (0)ను గోల్డెన్‌‌ డకౌట్‌‌ చేసిన అతను తన తర్వాతి ఓవర్లోనే , అజింక్యా రహానె (2)ను పెవిలియన్‌‌ చేర్చి రాజస్తాన్‌‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు.10/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌‌ను శిఖర్‌‌ ధవన్‌‌, అయ్యర్‌‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయ్యర్‌‌ స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేసే బాధ్యత తీసుకోగా ధవన్‌‌ స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. కార్తీక్‌‌ త్యాగి (1/30)వేసిన నాలుగో ఓవర్లో ఫైన్‌‌ లెగ్‌‌ మీదుగా సిక్సర్‌‌తో ఊపులోకి వచ్చిన అతను.. స్టోక్స్‌‌ (0/24)ఓవర్లో బౌండ్రీ కొట్టాడు. ఆపై, త్యాగి బౌలింగ్‌‌లో రెండు ఫోర్లు రాబట్టడంతో పవర్‌‌ ప్లేలో 47 రన్స్‌‌ వచ్చాయి. ఆ తర్వాత కూడా శిఖర్‌‌ అదే జోరు కొనసాగించాడు.  తన మార్కు షాట్లతో 30 బాల్స్‌‌లోనే  ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  స్పిన్నర్‌‌ గోపాల్‌‌ (1/31) బౌలింగ్‌‌లో స్లాగ్‌‌ స్వీప్‌‌ షాట్‌‌తో సిక్సర్‌‌ బాది భారీ ఇన్నింగ్స్‌‌ ఆడేలా కనిపించాడు. కానీ, అదే ఓవర్లో రివర్స్‌‌ హిట్ ఆడి షార్డ్‌‌ థర్డ్‌‌ మ్యాన్‌‌ వద్ద త్యాగికి క్యాచ్‌‌ ఇవ్వడంతో  థర్డ్‌‌ వికెట్‌‌కు 85 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయింది. అయితే, అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన అయ్యర్‌‌ ఒక్కసారిగా గేరు మార్చాడు.  తెవాటియా (0/23) బౌలింగ్‌‌లో ఫోర్‌‌ కొట్టిన అతను.. ఉనాద్కట్‌‌  (2/32) వేసిన 15వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో విజృంభించి 40 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికి 129/3తో నిలిచిన ఢిల్లీ భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, స్లాగ్‌‌ ఓవర్లలో రాయల్స్‌‌ బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. ఊపు మీదున్న అయ్యర్‌‌ను ఔట్‌‌ చేసిన త్యాగి 16వ ఓవర్లో మూడే పరుగులిచ్చాడు.  అలెక్స్‌‌ క్యారీ (14)వచ్చీరాగానే ఆర్చర్‌‌ బౌలింగ్‌‌లో భారీ సిక్సర్‌‌ కొట్టినా తర్వాత నెమ్మదించాడు. మరో ఎండ్‌‌లో స్టోయినిస్‌‌ (19 బంతుల్లో 18) సింగిల్స్‌‌కే పరిమితం అయ్యాడు. 18వ ఓవర్లో కార్తీక్‌‌ 5 రన్స్‌‌ ఇవ్వగా, తర్వాత స్టోయినిస్‌‌ను ఔట్‌‌ చేసిన ఆర్చర్‌‌ కూడా ఐదు పరుగులే ఇచ్చాడు. లాస్ట్‌‌ ఓవర్లో క్యారీ, అక్షర్‌‌ పటేల్‌‌ (7) వికెట్లు తీసిన ఉనాద్కట్‌‌ 8 రన్స్‌‌ ఇవ్వడంతో ఢిల్లీ నార్మల్‌‌ స్కోరుకే పరిమితమైంది. ఓవరాల్‌‌గా చివరి ఐదు ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్‌‌ 32 పరుగులే సాధించింది.

స్టోక్స్‌‌ మెరుపులు

సాధారణ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో రాజస్తాన్‌‌కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్‌‌ బెన్‌‌స్టోక్స్‌‌ తన ఇంగ్లండ్‌‌ టీమ్‌‌మేట్‌‌ బట్లర్‌‌ (9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 22)తో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 3 ఓవర్లలోనే 37 రన్స్‌‌ అందించాడు. అన్రిచ్‌‌ నోకియా బౌలింగ్‌‌లో బట్లర్‌‌ 6, 4, 4తో రెచ్చిపోయాడు. కానీ, తర్వాతి బాల్‌‌కే మరో షాట్‌‌ ఆడబోయి అతను బౌల్డ్‌‌ అవడంతో ఢిల్లీకి ఫస్ట్‌‌ బ్రేక్‌‌ వచ్చింది. తర్వాతి ఓవర్లోనే స్లో బాల్‌‌తో కెప్టెన్‌‌ స్మిత్‌‌ (1)ను రిటర్న్‌‌ క్యాచ్‌‌తో ఔట్‌‌ చేసిన అశ్విన్‌‌ రాయల్స్‌‌కు డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. కానీ, శాంసన్‌‌ (18 బంతుల్లో 2 సిక్సర్లతో 25)తో కలిసి స్టోక్స్‌‌ ధాటిగా బ్యాటింగ్‌‌ చేయడంతో పవర్‌‌ ప్లేలో 50 రన్స్‌‌ వచ్చాయి. స్పిన్నర్‌‌ అక్షర్‌‌ పటేల్‌‌ (1/32)ఓవర్లలో శాంసన్​ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. మరో ఎండ్‌‌లో స్ట్రోక్స్‌‌ కూడా స్వేచ్ఛగా షాట్లు బాదేయడంతో పది ఓవర్లకు రాయల్స్‌‌ 85/2తో నిలిచింది. కానీ, తర్వాతి ఓవర్లో  ఓ స్లో బాల్‌‌తో స్టోక్స్‌‌ను ఔట్‌‌ చేసిన తుషార్‌‌ ఆటను మలుపు తిప్పాడు. దాంతో, థర్డ్‌‌ వికెట్‌‌కు 46 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయింది. కాసేపటికే ఓ స్ట్రెయిట్‌‌ బాల్‌‌తో శాంసన్‌‌ను బౌల్డ్‌‌ చేసిన అక్షర్​ తన తర్వాతి ఓవర్లోనే పర్‌‌ఫెక్ట్‌‌  త్రో కొట్టి పరాగ్‌‌ను రనౌట్‌‌ చేయడంతో రాయల్స్‌‌ 110/5తో డీలా పడిపోయింది.

ఢిల్లీ సూపర్‌‌ బౌలింగ్‌‌

చివరి ఆరు ఓవర్లలో రాజస్తాన్‌‌కు 47 రన్స్‌‌ అసవరం అయ్యాయి. ఊతప్పతో పాటు లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో జట్టును గెలిపించిన తెవాటియా  (18 బంతుల్లో 1 ఫోర్‌‌తో 18 నాటౌట్‌‌) ఉండడంతో ఆ జట్టు ఆశలు కోల్పోలేదు. కానీ, డెత్‌‌ ఓవర్లో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌‌ చేశారు. అన్రిచ్​ క్యాచ్​ డ్రాప్​ చేయడంతో సున్నా పరుగే వద్దే లైఫ్​ దక్కించుకున్న తెవాటియా ప్రభావం చూపలేకపోయాడు. 16వ ఓవర్లో అశ్విన్‌‌ రెండే పరుగులివ్వడంతో రాయల్స్‌‌పై ఒత్తిడి పెరిగింది. ఆపై, రబాడ (1/28) వేసిన 17వ ఓవర్లో తెవాటియా ఓ బౌండ్రీ కొట్టగా 8 రన్స్‌‌ వచ్చాయి. కానీ, తర్వాతి ఓవర్లో పర్‌‌ఫెక్ట్ యార్కర్‌‌తో ఊతప్పను బౌల్డ్‌‌ చేసిన అన్రిచ్‌‌ 4  పరుగులే ఇవ్వడంతో  సమీకరణం 12 బాల్స్‌‌లో 25   ర న్స్‌‌గా మారింది.  కానీ, 19వ ఓవర్లో ఆర్చర్‌‌ వికెట్‌‌ తీసిన రబాడ 3 రన్సే ఇచ్చాడు.  తుషార్‌‌ వేసిన చివరి ఓవర్లో  22 రన్స్‌‌ అవసరం కాగా.. ఫస్ట్‌‌ బాల్‌‌కే తెవాటియా సిక్సర్‌‌కు ట్రై చేశాడు. బౌండ్రీ లైన్‌‌ వద్ద రహానె మెరుపు ఫీల్డింగ్‌‌తో దాన్ని అడ్డుకున్నాడు. తర్వాతి మూడు బాల్స్‌‌కు రెండు పరుగులిచ్చి ఢిల్లీ విజయం ఖాయం చేసిన తుషార్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు శ్రేయస్‌‌ గోపాల్‌‌ (6)ను ఔట్‌‌ చేశాడు.

Latest Updates