ప్రొ కబడ్డీ లీగ్‌‌ : ఈ సారి కొత్త చాంపియన్‌

తొలిసారి ఫైనల్‌‌కు ఢిల్లీ, బెంగాల్‌‌  
సెమీస్‌‌లో బుల్స్‌‌, ముంబా ఓటమి

అహ్మదాబాద్‌‌: ప్రొ కబడ్డీ లీగ్‌‌లో కొత్త చాంపియన్‌‌ అవతరించనుంది. సెమీఫైనల్‌‌లో మాజీ చాంపియన్లకు షాకిస్తూ దబాంగ్‌‌ ఢిల్లీ, బెంగాల్‌‌ వారియర్స్‌‌ జట్లు ఏడో సీజన్‌‌లో ఫైనల్‌‌ బెర్త్‌‌లు ఖరారు చేసుకున్నాయి. ఢిల్లీ, బెంగాల్‌‌ జట్లు పీకేఎల్‌‌ ఫైనల్‌‌ చేరడం ఇదే తొలిసారి. బుధవారం జరిగిన తొలి సెమీస్‌‌లో ఢిల్లీ 44–38తో డిఫెండింగ్‌‌ చాంప్‌‌ బెంగళూరు బుల్స్‌‌ను టోర్నీ నుంచి నాకౌట్‌‌ చేసింది. ఢిల్లీ జట్టులో నవీన్‌‌ కుమార్‌‌(15 పాయింట్లు) సూపర్‌‌ టెన్‌‌తో అదరగొట్టగా, అనిల్‌‌ కుమార్‌‌(4 పాయింట్లు) ట్యాకిలింగ్‌‌లో సత్తా చాటాడు. నవీన్‌‌ దూకుడుగా ఆడడంతో మ్యాచ్‌‌ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే  బుల్స్‌‌ ఆలౌటైంది. పవన్‌‌ కుమార్‌‌ షెరావత్‌‌(18 పాయింట్లు) మ్యాచ్‌‌లో టాప్‌‌ స్కోరర్‌‌గా నిలిచినా బుల్స్‌‌ను గెలిపించలేకపోయాడు. ఫస్టాఫ్‌‌ ముగిసే సరికి  26–18తో లీడ్‌‌లో నిలిచిన ఢిల్లీ చివరిదాకా ఆధిక్యం కొనసాగించి విజేతగా నిలిచింది.

చివరి నిమిషం దాకా ఉత్కంఠరేపిన మరో సెమీఫైనల్‌‌లో బెంగాల్‌‌ వారియర్స్‌‌ 37–35తో యు ముంబాపై విజయం సాధించింది. బెంగాల్‌‌ రైడర్లు సుఖేశ్‌‌ హెగ్డే(8 పాయింట్లు), మహ్మద్‌‌ నబిభక్ష్‌‌(5 పాయింట్లు) సత్తా చాటారు.  ముంబా స్టార్‌‌ సందీప్‌‌ నర్వాల్‌‌(5 పాయింట్లు) నిరాశపరచగా అభిషేక్‌‌ సింగ్‌‌(11 పాయింట్లు) సూపర్‌‌ టెన్‌‌ సాధించినా ఫలితం లేకపోయింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌‌లో ఫస్టాఫ్‌‌ ముగిసే సరికి 18–12తో స్వల్ప ఆధిక్యంలో నిలిచిన బెంగాల్‌‌ చివరి దాకా లీడ్‌‌ నిలబెట్టుకుంది. అయితే చివరి ఐదు నిమిషాల్లో చకచకా పాయింట్లు రాబట్టిన ముంబా ప్లేయర్లు స్కోరును 36–35 చేశారు. కానీ చివరి నిమిషంలో ముంబా రైడర్‌‌ అర్జున్‌‌ దేశ్వాల్‌‌ను బల్‌‌దేవ్‌‌ సింగ్‌‌ ట్యాకిల్‌‌ చేయడంతో బెంగాల్‌‌ విజయం సాధించి ఫైనల్‌‌ బెర్త్‌‌ ఖాయం చేసుకుంది.  బెంగాల్‌‌, ఢిల్లీ మధ్య ఫైనల్‌‌ శనివారం జరగనుంది.

Latest Updates