ఢిల్లీలో 50 వేలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కేసుల సంఖ్య నాలుగు లక్షలకు, మరణాలు 13 వేలకు చేరువలోకి వచ్చాయి. శుక్రవారం ఒక్కరోజే 12 వేలకుపైగా కొత్త కేసులు వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య 50 వేలు, మరణాల సంఖ్య రెండు వేలు దాటింది. అటు మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 3,827 కేసులురాగా, 142 మంది చనిపోయారు. మొత్తం కేసులు లక్షా 24 వేలుదాటగా, మరణాలు ఆరు వేలకు సమీపంలోకి చేరాయి. తమిళనాడులోనూ కేసుల సంఖ్య 54,449కి, మరణాలు 666కు చేరాయి. యూపీ, గుజరాత్, హర్యానా, వెస్ట్​ బెంగాల్ లలోనూ కేసుల వేగంగా పెరుగుతున్నాయి. యూపీలో ఒక్కరోజే 809 కేసులు, గుజరాత్, హర్యానాల్లో 500కుపైగా నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 86 లక్షలు దాటాయి. మృతుల సంఖ్య 4 లక్షల 60 వేలు దాటింది. కొద్దిరోజులుగా రోజూ లక్షా 40 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. బ్రెజిల్​లో పాజిటివ్​ కేసులు పది లక్షలు దాటాయి. మరణాలు 50 వేలకు చేరువయ్యాయి. ఈ దేశంలో రోజూ 20 వేలకుపైగా కేసులు, వెయ్యివరకు మరణాలు నమోదవుతున్నాయి. ఈ దేశానికి సమీపంలో ఉన్న చిలీ, పెరూ దేశాల్లో కూడా రోజూ 200 మందికిపైగా చనిపోతున్నారు. అమెరికాలో కేసులు 23 లక్షలకు చేరువయ్యాయి. మెక్సికోలో కూడా కొద్దిరోజులుగా రోజూ ఆరేడు వందల మందికిపైగా చనిపోతున్నారు. ఇటీవలి దాకా గడగడా వణికిన ఇటలీ, ఫ్రాన్స్​ వంటి దేశాల్లో పరిస్థితి అదుపులోకి రాగా.. కొత్తగా పలు దేశాల్లో వ్యాప్తి పెరుగుతోంది. 22 దేశాల్లో రోజూ వెయ్యికిపైగా, మరో 20 దేశాల్లో రోజూ 500కుపైగా కేసులు నమోదవుతున్నాయి.

ఢిల్లీ హెల్త్​ మినిస్టర్..సత్యేంద్ర​కు సీరియస్

న్యూఢిల్లీ: కరోనా బారినపడ్డ ఢిల్లీ హెల్త్​ మినిస్టర్​ సత్యేంద్ర జైన్​ ఆరోగ్య పరిస్థితి శుక్రవారం మరింత సీరియస్ అయిందని డాక్టర్లు చెప్పారు. ఊపరిపీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఆయనకు ఆక్సిజన్​ సపోర్ట్​ ఇచ్చినట్లు తెలిపారు. ఆయనకు ప్లాస్మా థెరపీ అందించాలని నిర్ణయించి, సాకెత్​లోని మాక్స్ హాస్పిటల్​కు తరలించినట్లు వివరించారు. ఎక్కువ జ్వరంతో బాధపడుతున్న జైన్​కు డాక్టర్లు మంగళవారం కరోనా టెస్టులు చేశారు. ఈ పరీక్షల్లో పాజిటివ్​ రావడంతో ఆయనను రాజీవ్​ గాంధీ హాస్పిటల్లో చేర్చారు. బుధవారం నుంచి ట్రీట్​మెంట్​ ఇస్తుండగా.. శుక్రవారం ఆరోగ్యం మరింత దెబ్బతిన్నది. సత్యేంద్ర కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ట్వీట్​ చేశారు.

Latest Updates