జామియా అల్లర్ల ట్వీట్​ కేసులో డిప్యూటీ సీఎంకు క్లీన్​చిట్​

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఊరట లభించింది. గత డిసెంబర్‌‌లో ఢిల్లీలోని జామియా ఇస్లామియా వర్శిటీలో చెలరేగిన హింస సందర్భంగా ప్రభుత్వ బస్సులకు  పోలీసులే నిప్పు పెట్టారని ఆరోపిస్తూ మనీశ్ ట్వీట్ చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విచారణలో సిసోడియా ట్వీట్లలో గుర్తించదగిన తప్పు ఏమీ లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు. టీవీ చానళ్లలో వచ్చిన న్యూస్ ను చూసిన మనీశ్.. తన అభిప్రాయాన్నిమాత్రమే వ్యక్తం చేశారని ఢిల్లీ పోలీసులు తమ నివేదికలో తెలిపారు.

దక్షిణ ఢిల్లీలో డిసెంబర్‌‌లో జరిగిన  CAA వ్యతిరేక ఆందోళనల్లో ఆందోళనకారులు ఢిల్లీ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన మూడు బస్సులను తగులబెట్టారు. ఆ సమయంలో కొంత మంది పోలీసులు బస్సులపై కొన్ని ద్రవాలు చల్లుతున్నట్టు ఫొటోలు బయటికి వచ్చాయి.  దీంతో…  బస్సులకు  పోలీసులే నిప్పుపెట్టారని సిసోడియా ట్వీట్ చేశారు. అయితే, ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులపై నింద మోపిన మనీశ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు లాయర్ అలోక్ శ్రీవాస్తవ్ కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే… తాను ఎలాంటి తప్పు చేయలేదని విచారణలో తేలడంతో సిసోడియాకు ఉపశమనం లభించింది.

Latest Updates