ఇంటర్నెట్ యూజర్లలో ఢిల్లీ టాప్

మన దేశంలో ఇంటర్నెట్ వాడకం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందో తెలుసా? రాజధాని ఢిల్లీ నగరమేనంట. ఢిల్లీ  మొత్తం జనాభాలో 69 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారంట. ఇక ఢిల్లీ తర్వాత కేరళ ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచింది. కేరళలోని మొత్తం జనాభాలో 54 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారట. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్​ఇండియా (ఐఏఎంఏఐ) సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. ఐఏఎంఏఐ సర్వే నివేదిక ‘ఇండియా ఇంటర్నెట్ 2019’ ప్రకారం, ఇంటర్నెట్ పెనెంట్రేషన్ రేట్ (మొత్తం జనాభాలో ఇంటర్నెట్ వాడుతున్నవారి శాతం) విషయంలో ఢిల్లీ, కేరళ తర్వాత ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ మూడో స్థానంలో నిలవడం విశేషం. ఈ రాష్ట్రంలో 49 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారని వెల్లడైంది.

అట్టడుగున ఒడిశా..

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఈ సర్వేలో అడుగుకు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఇంటర్నెట్ పెనెంట్రేషన్ రేట్31 శాతంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక ఒడిశా 25 శాతంతో అన్ని రాష్ట్రాల కంటే దిగువన ఉండిపోయింది. ఒడిశా కంటే జార్ఖండ్ (26%), బిహార్ (28%), బెంగాల్ (29%) కాస్త మెరుగైన స్థానంలో ఉన్నాయి.  అలాగే, ఇంటర్నెట్ యూజర్లలో మహిళల శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచాయి.

ఇక అన్ని టెలికం సర్వీసులు కలిపి చూస్తే.. ప్రతి100 మంది జనాభాకు ఇంటర్నెట్ సబ్ స్క్రిప్షన్ల విషయంలో ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీలో 158, హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లో 73, పంజాబ్‌‌‌‌లో 75, కేరళలో 70 సబ్ స్క్రిప్షన్లు ఉన్నట్టు ట్రాయ్ జూన్ నెలలో వెల్లడించింది. ఇందులో బీహార్ (29 సబ్ స్క్రిప్షన్లు), ఉత్తర ప్రదేశ్ (34) అట్టడుగున నిలిచాయి. అయితే, కేరళ, ఢిల్లీ, హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌లలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఇంటర్నెట్ వాడకంలో పెద్ద అంతరం ఉందని నివేదిక పేర్కొంది.

కేరళలో ఇంటర్నెట్ ఇక ప్రాథమిక హక్కు

కూడు, నీళ్లు, గూడు, చదువు.. ఇవి మనిషికి బేసిక్ అవసరాలు. కానీ కేరళలో వీటితో పాటు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా ఇకపై ప్రాథమిక హక్కుగానే పరిగణించనున్నారు! ఇప్పటికే ఎడ్యుకేషన్‌‌‌‌లో నెంబర్ వన్‌‌‌‌గా ఉన్న కేరళలో ప్రతి బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన) కుటుంబానికీ ఫ్రీగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ‘కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌‌‌‌వర్క్’ ప్రాజెక్ట్‌‌‌‌ను అమలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఇసాక్ గురువారం ట్వీట్ చేశారు. రూ. 1548 కోట్ల ఖర్చుతో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని 20 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఫ్రీగా ఇంటర్నెట్ అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు.

Latest Updates