బోర్డర్​ దాటాలంటే రూ.18 వేల కోట్లు కట్టాలి

ఆర్థిక ఇబ్బందులతో మూతబడ్డ జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ ఫౌండర్‌‌ నరేశ్‌‌ గోయల్‌‌ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. తనకు వ్యతిరేకంగా లుకౌట్‌‌ నోటీసు జారీ చేయడాన్ని సవాల్‌‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌‌పై కేంద్రం వివరణ కోరింది. విదేశానికి వెళ్లాలనుకుంటే రూ.18 వేల కోట్లు డిపాజిట్‌‌ చేయాలని న్యాయమూర్తి సురేశ్‌‌ కైత్‌‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది మే 25న దుబాయ్‌‌ వెళ్లేందుకు గోయల్‌‌ దంపతులు ముంబై ఎయిర్‌‌పోర్టుకు చేరుకోగా అధికారులు అడ్డుకున్నారు. తనపై ఎఫ్‌‌ఐఆర్‌‌ కూడా నమోదు కానప్పటికీ లుకౌట్‌‌ నోటీసులు ఇచ్చారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు.

జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ లావాదేవీల్లో పలు అవకతవకలు జరిగినట్టు కార్పొరేట్‌‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇది వరకే సర్కులర్‌‌ జారీ చేసింది. నిర్వహణకు కూడా డబ్బుల్లేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌‌ 17న జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌ను మూసివేశారు. బ్యాంకర్లు ఈ కంపెనీ వాటాలను విక్రయించేందుకు వీలుగా చైర్మన్‌‌ పదవి నుంచి గోయల్‌‌ మార్చిలోనే తప్పుకున్నారు. అయితే బ్యాంకుల కన్సార్షియం బిడ్డింగ్‌‌కు స్పందన రాలేదు. జెట్‌‌లో మైనారిటీ షేర్‌‌ హోల్డర్‌‌ ఎతిహాద్‌‌ పరిమిత వాటా కొనేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు అది విధించిన షరతులు లెండర్లకు నచ్చకపోవడంతో చివరికి జెట్‌‌ కేసును ఎన్సీఎల్టీకి అప్పగించిన విషయం తెలిసిందే.

Latest Updates