చీరలో వచ్చిన వారికి అనుమతి లేదన్న రెస్టారెంట్ మూత

చీరలో వచ్చిన వారికి అనుమతి లేదన్న రెస్టారెంట్ మూత

తమ రెస్టారెంట్ లోకి వచ్చేవారు..ముఖ్యంగా మహిళలు చీర ధరించి రాకూడదని నిబంధన విధించింది. అంతేకాదు..అర్హత నిబంధనల్లో చీర వస్త్రధారణను నిషేధించి వివాదంలో చిక్కుకుంది ఢిల్లీలోని ఓ ఖరీదైన రెస్టారెంట్‌. ఇప్పుడా రెస్టారెంట్ మూతపడింది. రెస్టారెంట్‌ సరైన వ్యాపార అనుమతులు పొందలేదని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిందంటూ ఈ నెల 24న దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నోటీసులు జారీ చేసింది. అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఆ రెస్టారెంట్‌ నడుస్తోందని ప్రజారోగ్య విభాగ ఇన్‌స్పెక్టర్‌ మూసివేత తాఖీదులో తెలిపారు.

ఈ క్రమంలో తాము రెస్టారెంట్‌ను ఈ నెల 27 నుంచి మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. వ్యాపార అనుమతులు పొందే వరకూ రెస్టారెంట్‌ను ప్రారంభించబోమని స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో ద్వారా రెస్టారెంట్‌లో తనకు అవమానం జరిగిందంటూ ఓ మహిళ ఆరోపించారు.