హైదరాబాద్ లో కిరాయి బైకులకు మస్తు గిరాకీ

  •  హైదరాబాద్‌‌లో పెరుగుతున్న ఆదరణ
  •  కిలోమీటరుకు రూ.3 నుంచి రేట్లు స్టార్ట్‌‌
  • త్వరలో వరంగల్‌‌, కరీంనగర్‌‌ లాంటి నగరాలకు

హైదరాబాద్‌‌లో రెంటల్‌‌ బైకులకు డిమాండ్‌‌ పెరుగుతోంది. తక్కువ ధరకు అందుబాటులో ఉండటం, టైం కలిసి రావడంతో నగరవాసులు బాగా ఆసక్తి చూపుతున్నారు. రకరకాల బ్రాండ్ల బండ్లు కూడా దొరుకుతుండటంతో యువత ఎక్కువగా తీసుకుంటున్నారు.

రోజూ వేలల్లో..

నగరంలో 2018లో రెంటల్‌‌ బైకులు అందుబాటులోకి వచ్చాయి. తొలుత మెట్రో స్టేషన్లలో స్టార్ట్‌‌ చేశారు. తర్వాత రెంటల్‌‌ సంస్థలు వచ్చాయి. ప్రస్తుతం ఒగో, రాయల్‌‌ బ్రదర్స్‌‌, రోడ్‌‌పాండా, బైక్‌‌ ఫర్‌‌ రెంట్‌‌, బౌన్స్‌‌, యూలూ, సాబ్‌‌ రెంట్‌‌ కరో, వీల్‌‌స్ట్రీట్‌‌, బ్లూ డ్రైవ్‌‌ లాంటి సంస్థలు బైకులను రెంట్‌‌కు ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఎలక్ట్రిక్‌‌ బైకులనూ ఇస్తున్నాయి. రోజుకు వేల సంఖ్యలో బైక్‌‌లు రెంట్‌‌కు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

యాప్‌‌ డౌన్‌‌లోడ్‌‌ చేసుకొని..

బైకు అద్దెకు తీసుకోవాలంటే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. డ్యామేజ్‌‌, ప్రమాదాలు, స్క్రాచ్‌‌లు, ట్రాఫిక్‌‌ నిబంధనలు ఉల్లంఘిస్తే రెంట్‌‌కు తీసుకున్న వాళ్లదే బాధ్యత. బైకు తీసుకోడానికి ముందు మొబైల్‌‌లో సంస్థ యాప్‌‌ డౌన్‌‌లోడ్‌‌ చేసుకోని వివరాలివ్వాలి. బైకుతోపాటు రెండు హెల్మెట్లూ ఇస్తారు.

కిలోమీటర్‌‌కు రూ. 3 నుంచి..

కొన్ని సంస్థలు కిలోమీటరుకు రూ. 3 నుంచి రూ. 8 వరకు తీసుకుంటున్నాయి. మరికొన్ని గంటలు, రోజుల లెక్కన ఇస్తున్నాయి. బైకును బట్టి రోజుకు రూ.300 నుంచి రూ.500 కిరాయి ఉంటుంది. బైకు తిరిగి ఇచ్చేందుకు గంట అదనపు టైం ఇస్తారు. తిరిగి ఇచ్చేటపుడు ట్రాఫిక్ ఉల్లంఘనలనూ చెక్‌‌ చేస్తారు. హర్లీ డేవిడ్‌‌సన్‌‌, రాయల్‌‌ ఎన్‌‌ఫీల్డ్‌‌ బుల్లెట్‌‌, బజాజ్‌‌ ఎక్స్‌‌ఫ్లోజర్‌‌ లాంటి బైకులూ అందుబాటులో ఉన్నాయి.

త్వరలో టైర్‌‌ టూ సిటీలకు!

ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్‌‌, ముంబై లాంటి నగరాల్లోనే రెంటల్‌‌ బైకులు ఉన్నాయి. తాజాగా టైర్‌‌ 2 సిటీలకూ విస్తరించాలని కొన్ని సంస్థలు ఆలోచిస్తున్నాయి. వరంగల్‌‌, కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌లలో స్టార్ట్‌‌ చేయాలని భావిస్తున్నాయి.

Latest Updates