ఒకప్పుడు గుట్టలు.. ఇప్పుడు బిల్డింగులు

హైదరాబాద్, వెలుగు:  ఐటీ కారిడార్ చుట్టే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తిరుగుతోంది. హైటెక్ సిటీకి చేరువలో ఉందంటే చాలు బుకింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంత డిమాండ్ అంటే… వర్కింగ్ ప్లేస్ కు దగ్గరలోనే నివాస సదుపాయాలను కలిగి ఉంటే… సిటీలో ట్రాఫిక్ తిప్పలను కాస్తయినా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఖాజాగూడ ఒకటి.  సిటీలో నిర్మాణ రంగం విపరీతంగా దూసుకుపోతున్న క్రమంలో ఐటీ కారిడార్ చుట్టూ ఉన్న ప్రాజెక్టులకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరువలో, విశాలమైన ఓపెన్ ల్యాండ్ ఉండటం, ట్రాఫిక్, పర్యావరణ పరంగా అనుకూలంగా ఉండే అంశాలతో హైదరాబాద్ లోని ఖాజాగూడ రియల్ ఖాజాగా ఆకట్టుకుంటోంది.

ఒకప్పుడు గుట్టలు.. ఇప్పుడు ఎక్కడ చూసినా అపార్ట్ మెంట్లు

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీకి 10 కి.మీ.లో దూరంలో ఉండే ప్రాంతం ఖాజాగూడ. ఒకప్పుడు పల్లెటూరు వాతావరణం, అభివృద్ధికి దూరంగా, గుట్టలు, పుట్టలతో నిండిన ఈ ఏరియా ఇప్పుడు రియల్ రంగానికి కేంద్రంగా మారింది. ముఖ్యంగా హైటెక్ సిటీ, ఐటీ కంపెనీల విస్తరణతో ఆ చుట్టూ ఉండే ప్రాంతాలకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఓఆర్ఆర్ కు చేరువలో ఉండటంతో ఖాజాగూడ పెద్ద పెద్ద భవన నిర్మాణాలకు నిలయంగా మారింది. ఈ క్రమంలోనే అటు డెవలపర్లు కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతుండగా,  అన్ని వసతులు పుష్కలంగా ఉండటంతో… వినియోగదారులు కూడా ఆసక్తి చూపుతున్నారు.

 ట్రిపుల్ బెడ్రూంలకు ఫుల్ డిమాండ్

పదుల సంఖ్యలో వచ్చే కొత్త అపార్టుమెంట్లతో నిత్యం రెడీ టు మూవ్, నిర్మాణ దశలో ఉన్న భవనాలకు లెక్కకు మించే ఉన్నాయి. ఈ ప్రాంతం డబుల్, ట్రిపుల్, క్వాడ్రపుల్ బెడ్రూం ఫ్లాట్ల నిర్మాణం జోరుగా సాగుతుండగా… ఇందులో ట్రిపుల్ బెడ్రూం ఇళ్లకు భారీ డిమాండ్ ఉంది. ఇటీవల విడుదలైన మ్యాజిక్ బ్రిక్స్ డాటా ప్రకారం… ట్రిపుల్ బెడ్రూం ఇళ్లకు 73శాతం ఉండగా, 4 బీహెచ్ కే 14శాతం ప్రతి కొత్త ప్రాజెక్టులో నిర్మాణాలే ఉండగా… తక్కువ మొత్తంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు మొగ్గుచూపుతున్నారు. మల్టీ స్టోర్డ్ భవనాలు, కమర్షియల్ బిల్డింగులతో పాటు, అపార్టుమెంట్ల నిర్మాణం కూడా జోరుగానే సాగుతోంది.

ఆకట్టుకుంటున్న ఖాజాగూడ లేక్ బ్యూటిఫికేషన్

ఒకప్పుడు విపరీతంగా చేరిన వ్యర్థాలు, చెత్తచెదారంతో  ఖాజాగూడ చెరువు ఆ ప్రాంతంపై కొంత మేర ప్రభావం చూపింది. ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ చెరువుల సుందరీకరణపై దృష్టిపెట్టడంతో… ప్రస్తుతం ఈ చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతోపాటు విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించేలా, భవిష్యత్తు వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలివేటెడ్ కారిడార్ ను తీర్చిదిద్దేలా సన్నాహాలు చేస్తోంది. దీంతో మాదాపూర్, ఖాజాగూడ, రాయదుర్గం పరిసర ప్రాంతాలన్నింటికీ డిమాండ్ వస్తోంది.

ఈజీ ట్రావెల్… లిటిల్ డిస్టెన్స్…

ఓఆర్ఆర్ మాత్రమే కాకుండా, సిటీ పరిసర ప్రాంతాలకు చేరువయ్యేందుకు ఖాజాగూడ అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కనెక్టివిటీ, మెరుగైన సోషల్ ఇన్ ఫ్రా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గనుక… మణికొండ, హైటెక్ సిటీ, మాదాపూర్, నానక్ రాంగూడ,  రాయదుర్గం పరిసర ప్రాంతాలకు చేరువలో ఉండటంతో… ఖాజాగూడ రియల్ రంగానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతోపాటు ఐటీ కారిడార్ కు, ఐటీ హబ్ కు దగ్గరలో ఉండటంతో… సాఫ్ట్ వేర్ ఉద్యోగులను మరింత ఆట్రాక్ట్ చేస్తోందనీ రియల్ రంగ నిపుణులు  చెబుతున్నారు.  మెరుగైన రవాణా సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తే, ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు అనువుగా ఉండటంతో… ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న ఇంటర్నేషనల్​ ఎడ్యుకేషనల్ స్కూళ్లతో మరింత డిమాండ్ వస్తుందనీ, ఐటీ కారిడార్ లో పనిచేస్తూ సొంతింటిని నిర్మించుకునేవారికి ఖాజాగూడ చక్కని వేదిక అవుతుందనీ రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

Latest Updates