రావయ్య కేటీఆర్..సీఎం కావాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేల కోరస్

  • ప్రగతిభవన్  డైరెక్షన్​లోనే స్టేట్​మెంట్లు!
  • మకర సంక్రమణ టైమ్​లో ఫామ్​హౌస్​లో హోమం
  • ఆ తర్వాతే కాళేశ్వరంలో సీఎం దంపతుల ప్రత్యేక పూజలు
  • కేటీఆర్​ను సీఎం చేసేందుకే హోమం జరిపినట్లు టాక్​

హైదరాబాద్, వెలుగుటీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్  ఆ పార్టీలో ఊపందుకుంది. ఈ విషయంపై ఇన్నాళ్లూ ఇంటర్నల్  మీటింగ్ లో మాట్లాడుకునే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఓపెన్ గా  ఒకరెనుక ఒకరు స్టేట్​మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇది తమ అభిప్రాయం మాత్రమే కాదని, పార్టీలోని చాలా మంది ఇట్లనే కోరుకుంటున్నారని చెప్తున్నారు. అధికార మార్పిడిపై కొందరు పరోక్షంగా డెడ్ లైన్లు కూడా పెడ్తున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి కేటీఆర్​ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. మార్చిలోపు  బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్​ను కోరుతున్నారు. ప్రగతిభవన్​ నుంచి వచ్చే  డైరెక్షన్లతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా వరుస స్టేట్​మెంట్లు ఇస్తున్నట్లు టీఆర్​ఎస్​ లీడర్లలో చర్చ నడుస్తోంది.  తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ మనసెరిగిన మంత్రి ఈటల రాజేందర్  కూడా రెండు రోజుల కింద సీఎం మార్పుపై ఓపెన్ అయ్యారు. సీఎం మార్పు ఉంటే ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ రూరల్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బోధన్​ ఎమ్మెల్యే షకీల్, వికారాబాద్​ ఎమ్మెల్యే ఆనంద్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్​,  నకిరేకల్​ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా కేటీఆర్ సీఎం కావాలని మీడియాతో అన్నారు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని, విజన్​ ఉన్ననాయకుడని చెప్పారు. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేల స్టేట్​మెంట్లతో త్వరలోనే కేటీఆర్​కు సీఎం పదవి అప్పగించవచ్చని పార్టీ లీడర్లు భావిస్తున్నారు.

టీఆర్ఎస్  పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడానికి కుదరదు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలన్నా.. ప్రగతిభవన్ వర్గాలు చెప్పిన లీడర్లు మాత్రమే మీడియా ముందుకు రావాలి.  ప్రగతిభవన్​ వర్గాలు చెప్పిన విషయాలు మాత్రమే వారు మాట్లాడాలి. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కేటీఆర్​ సీఎం కావాలని కోరుకోవడం వెనుక  ప్రగతిభవన్​ వర్గాల డైరెక్షన్స్​ ఉండొచ్చని టీఆర్​ఎస్​ లీడర్లు అంటున్నారు. ప్రతి విషయంలో ఆచితూచి మాట్లాడుతారనే ముద్ర ఉన్న మంత్రి ఈటల రాజేందర్  కూడా  కేటీఆర్​ సీఎం అవుతారని సిగ్నల్​ ఇస్తూ మాట్లడటం వెనుక కూడా ప్రగతిభవన్​ డైరెక్షన్​ ఉంటుందని వారు భావిస్తున్నారు. అదేవిధంగా వరుసగా మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, షకీల్, మెతుకు ఆనంద్, రాములు నాయక్​ మాట్లాడం వెనుక ఖచ్చితంగా పైనుంచి ఆదేశాలు ఉండే ఉంటాయని వారు అంటున్నారు.

కేటీఆర్ సీఎం అయితే మరింత అభివృద్ధి: బాజిరెడ్డి గోవర్ధన్

కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందని నిజామాబాద్  రూరల్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్  అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ‘‘కేసీఆర్ కనుసన్నల్లోనే కేటీఆర్ సీఎంగా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. పెద్దలు కేసీఆర్  ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాం’’ అని చెప్పారు.

కేటీఆర్‌‌కు అన్ని అర్హతలు ఉన్నయ్:  మెతుకు ఆనంద్

సీఎం అయ్యేందుకు కేటీఆర్‌‌‌‌కు అన్ని అర్హతలు ఉన్నాయని వికారాబాద్​ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​ అన్నారు.  సీఎంగా ఎవరుండాలనేది తమ పార్టీ వ్యవహారమని, సరైన టైమ్ లో నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు.

 కేటీఆర్ సీఎంగా వచ్చే అసెంబ్లీ సమావేశాలు: షకీల్

వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ ముఖ్యమంత్రిగా జరగాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్  అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ‘‘వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్  సభా నాయకుడిగా  జరగాలి. కేటీఆర్ ను సీఎం చేయాలని రాష్ట్రంలోని యువత కోరుకుంటోంది. కేటీఆర్ సీఎం అయితే పార్టీలోని యువతకు పదవులు వస్తాయి. కేటీఆర్  సీఎం అయ్యేలా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం ఇవ్వాలి’’ అని షకీల్​ అన్నారు.

కేటీఆర్ సీఎం కాబోతున్నారు: రాములు నాయక్​

రాష్ట్రానికి కేటీఆర్ సీఎం కాబోతున్నారని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్  అన్నారు. త్వరలోనే ఈ వార్త వింటామని చెప్పారు.

విజన్‌ ఉన్న లీడర్‌ కేటీఆర్‌: లింగయ్య

ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని నకిరేకల్​ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల అన్నారు.  పరిపాలనా దక్షత, ప్రజా సమస్యలపై స్పందించే తీరు అద్భుతమని, ప్రజల్లో క్రేజ్, విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేది ఎప్పటికైనా కల్వకుంట్ల కుటుంబమేనని, ఆ కుటుంబం సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. కేసీఆర్  ఆశీస్సులతో ఎప్పుడైనా కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వొచ్చని చెప్పారు.

ఫామ్ హౌస్​లో హోమం!

మకరం సంక్రమించే సమయంలో సీఎం కేసీఆర్  ఫామ్ హౌస్​లో హోమం జరిగిందనే ప్రచారం నడుస్తోంది. భోగి, సంక్రాంతి రోజు తంతు పూర్తి చేసేందుకు 15 మంది రుత్వికులు వచ్చినట్టు టీఆర్​ఎస్​ లీడర్లు మాట్లాడుకుంటున్నారు. ఆ హోమం తర్వాతే కేసీఆర్ దంపతులు కాళేశ్వరం వెళ్లినట్లు చెప్తున్నారు. కేసీఆర్​కు కొత్త కార్యక్రమం ప్రారంభించే ముందు హోమం చేయడం అలవాటు. ఇదే క్రమంలో కొడుకును సీఎం చైర్ లో కూర్చోపెట్టే  ముందు ప్రత్యేక పూజలు చేసిఉంటారని సీనియర్ లీడర్లు చర్చించుకుంటున్నారు.

కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి?: తలసాని

కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. బుధవారం ఓ సమావేశానికి హాజరైన మంత్రి తలసాని మీడియా తో మాట్లాడారు. కేటీఆర్ సీఎం అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజమేనా అని మీడియా ప్రతినిధులు మంత్రిని  ప్రశ్నించారు. ‘‘సీఎంగా కేటీఆర్ అయితే తప్పేంటి? ఇప్పుడైతే సీఎం కేసీఆర్ అంతా బాగానే చేస్తున్నారు. ఏ విషయమైనా సరైన టైంలో కేసీఆరే నిర్ణయం తీసుకుంటారు’’ అని తలసాని చెప్పారు.

వరుస ఓటముల తర్వాత ప్రచార జోరు

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్  పార్టీకి షాక్ తగిలిన తర్వాత నుంచి కేటీఆర్​కు ముఖ్యమంత్రి సీటు  అప్పగిస్తారన్న ప్రచారం జోరందుకుంది. కేటీఆర్​ను సీఎం చేసేందుకు సీఎం కేసీఆర్  డిసెంబర్​లో ఏకంగా 15 రోజుల పాటు ఫామ్ హౌస్​లో ఉండి వ్యూహరచన చేసినట్లు టీఆర్​ఎస్​ లీడర్లు చెప్తున్నారు. దీనిపై డిసెంబర్ 25న ‘వెలుగు’లో ‘‘ సీఎం సీట్లోకి కేటీఆర్?’’ అనే శీర్షికతో న్యూస్ పబ్లిష్ అయింది. అప్పట్నించి టీఆర్ఎస్​లో డిస్కషన్  మరింత  జోరందుకుంది. ఏ ఇద్దరు లీడర్లు కలిసినా ‘‘కేటీఆర్  ముఖ్యమంత్రి ఎప్పుడవుతారు? ముహూర్తం ఎప్పుడు ఉండొచ్చు?’’ అని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ దంపతులు కాళేశ్వరం టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేయడం కూడా అందుకే  అయి ఉండొచ్చని అంటున్నారు. పైగా వరుసబెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్​ను సీఎం చేయాలని స్టేట్​మెంట్లు ఇస్తుండటంతో.. త్వరలోనే ముహూర్తం ఉంటుందనే  టాక్​ నడుస్తోంది.

యాదాద్రి ప్రారంభం తర్వాత..

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు చివరిదశలో ఉన్నాయి. సీఎం చెప్పినట్లుగా ఈ నెలాఖరు వరకు అన్ని పనులు పూర్తవుతాయని ఆఫీసర్లు అంటున్నారు. ఫిబ్రవరి  రెండో వారంలో ఆలయ ప్రారంభానికి ముహూర్తం ఉండొచ్చని భావిస్తున్నారు. ముహూర్తం తేదీపై సీఎం కేసీఆర్ త్వరలో చిన్న జీయర్​స్వామిని కలిసే చాన్స్ ఉందని చెప్తున్నారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవ సమయంలో ప్రత్యేక యాగాలు నిర్వహించి, ఆ తర్వాత కేటీఆర్​ను సీఎం కుర్చీలో కూర్చోబెట్ట వచ్చని అంచనాకు వస్తున్నారు

Latest Updates