రిజర్వాయర్ రద్దు… భూములు తిరిగి ఇవ్వాలని రైతుల డిమాండ్

‘ప్రాజెక్టు కడుతమంటే నీళ్లు వస్తయని, తమలాంటి రైతులు బాగుపడ్తరని, సర్కారుకు పచ్చని పంట భూములిచ్చినం.. కానీ ఉన్నట్టుండి  ప్రాజెక్టు క్యాన్సిల్​ చేసి, ఏదో ఫ్యాక్టరీ కడుతమంటన్రు.. ఇందుకు మేం ఒప్పుకోం.. అప్పట్ల ఎకరాకు కేవలం రూ.2.10 లక్షల పరిహారమే ఇచ్చి చేతులు దులుపుకొన్నరు.. భూములు కోల్పోయి మా బతుకులు ఆగమైనయ్.. ప్రాజెక్టు కట్టనందున మా భూములు మాకిస్తే ఎవుసం చేసుకుంటం..’ అని తోటపల్లి రిజర్వాయర్​ కింద భూములు కోల్పోయిన రైతులు స్పష్టం చేస్తున్నారు.

2007లో శంకుస్థాపన

పాత కరీంనగర్​ జిల్లా బెజ్జంకి మండల పరిధిలో  0.959 టీఎంసీ సామర్థ్యంతో  తోటపల్లి బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​ నిర్మాణానికి 2007లో అప్పటి సీఎం వైఎస్‌‌ ‌‌రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రిజర్వాయర్​ ద్వారా ఈ ప్రాంతంలోని 49 వేల ఎకరాలకు సాగు నీరందించాలని భావించారు. ఇందుకోసం బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌‌‌‌, తోటపల్లి, కోహెడ మండలం రాంచంద్రాపూర్‌‌‌‌, చిగురుమామిడి మండలం  వరికోలు, నారాయణపూర్‌‌.. మొత్తంగా ఐదు గ్రామాల్లోని సుమారు 500 మంది రైతుల నుంచి 1,603 ఎకరాల భూములు సేకరించారు. అప్పట్లో ఎకరాకు రూ. 2.10 లక్షలు పరిహారంగా అందజేశారు. కానీ వివిధ కారణాల వల్ల పనులు నిలిచిపోయాయి. 2014లో  టీఆర్ఎస్‌‌  ‌‌ప్రభుత్వం ఏర్పడ్డాక తోటపల్లి  ప్రాజక్టు‌‌ను అఫీషియల్​గా రద్దు చేసి, ఆ స్థానంలో  గౌరవెల్లి ప్రాజెక్టు చేపట్టింది. అంతకుముందున్న తోటపల్లి చెరువునే బ్యాలెన్సింగ్​రిజర్వాయర్​గా మార్చారు. దీంతో ప్రాజెక్టు కోసం గతంలో సేకరించిన భూములన్నీ ఖాళీగా ఉండిపోయాయి.  సుమారు 100 ఎకరాల్లో మిడ్​మానేరు లింకు కెనాల్స్​నిర్మించగా, మిగిలిన 1,503 ఎకరాలు రైతులకు తిరిగిస్తామని  గతంలో ప్రభుత్వం  ప్రకటించింది. తర్వాత జిల్లాల పునర్విభజన జరగడంతో బెజ్జంకి, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలోకి రాగా, చిగురుమామిడి మండలం కరీంనగర్‌‌‌‌ జిల్లాలో ఉండిపోయింది.

ఫుడ్​ప్రాసెసింగ్​ఇండస్ట్రీకి భూములు?

తోటపల్లి ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో ఫుడ్ ​ప్రాసెసింగ్​ఇండస్ట్రీస్ నిర్మిస్తారనే ప్రచారంతో  ఆయా గ్రామాల్లో అలజడి మొదలైంది. అదీగాక ప్రభుత్వం సేకరించగా రైతుల వద్ద మిగిలిన చాలా భూములకు పట్టాదారు పాస్​బుక్​లను జారీ చేయలేదు. దీంతో రైతుబంధు, పంట రుణాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయమై తరచూ ఆఫీసర్లను నిలదీస్తున్నారు.

ఆందోళన బాటలో..

తోటపల్లి రిజర్వాయర్‌‌‌‌ కోసం భూములిచ్చిన రైతులంతా ఒక్కటవుతున్నారు. ప్రాజెక్టు రద్దు కావడంతో సేకరించిన  భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్​చేస్తున్నారు.  ఇటీవలి కాలంలో భూముల విలువలు పెరగడంతో తాము నష్టపోయామనే భావనలో మెజారిటీ రైతులున్నారు. అదీగాక భూములు కోల్పోయిన తర్వాత ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

రెండెకరాలు ఇచ్చా

తోటపల్లి ప్రాజెక్టు కోసం నేను రెండెకరాల భూమి ఇచ్చా. రూ.2.10 లక్షలు  మాత్రమే పరిహారం కింద చెల్లించారు.  ప్రాజెక్టు వస్తే నీళ్లొచ్చి మా బతుకులు బాగుపడతయనే ఆశతో  భూములిచ్చాం. ఇప్పుడు పరిస్థితులు బాగా లేనందున ప్రభుత్వం మా భూములను మాకు ఉచితంగా వెనక్కి ఇవ్వాలి.

‑ బద్దం శ్రీనివాస్ రెడ్డి, రైతు, గాగిల్లపూర్

 

ఫ్యాక్టరీ కట్టనికి ఒప్పుకోం

తోటపల్లి ప్రాజెక్టు  కడతమంటే నీళ్లొస్తయని  భూములిచ్చినం.  నేను 2 .2 ఎకరాల భూమి ఇచ్చిన. ఇప్పుడేమో ప్రాజెక్టు రద్దయింది. తీసుకున్న భూముల్లో ఫ్యాక్టరీ కడ్తమంటే ఎట్ల ఒప్పుకుంటం.  ప్రాజెక్టు కట్టలేదు కాబట్టి ప్రభుత్వం మా భూములను మాకే ఇవ్వాలి.

 ‑ భీనవేని లక్ష్మణ్‌‌‌‌, రైతు, రాంచంద్రాపూర్‌‌‌‌

 

సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

 

తోటపల్లి రిజర్వాయర్‌‌ ‌‌రద్దు కావడంతో  భూములు తిరిగివ్వాలనే రైతుల డిమాండ్‌‌‌‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. తోటపల్లి రిజర్వాయర్ కోసం సేకరించిన భూముల్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారనే విషయం నా దృష్టికి రాలేదు.  ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకే నడుచుకుంటాం.   ఇప్పటివరకైతే ఎలాంటి ఆదేశాలు రాలేదు.

  ‑ రుక్మిణి రెడ్డి‌‌, తహసీల్దార్‌‌, కోహెడ

Latest Updates