మా ఏరియాల మాకే జాబులు

  • ప్రైవేటులో లోకలోళ్లకు కోటాపై దేశవ్యాప్త డిమాండ్‌‌
  • స్థానికులకు 75%పై ఏపీ అసెంబ్లీలో బిల్లు పాస్‌‌
  • మధ్యప్రదేశ్‌‌ సీఎం హామీ, మహారాష్ట్రలో ఎన్సీపీ కూడా
  • ఉద్యోగాల కోసమే కొట్లాడిన తెలంగాణలో ఊసే లేదు
  • పరిశ్రమలు, కంపెనీల్లో తెలంగాణేతరులకే జాబ్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: దేశంలో ప్రైవేటు రంగంలో లోకల్‌‌ రిజర్వేషన్ల డిమాండ్‌‌ ఊపందుకుంటోంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ అంతంతమాత్రంగా ఉండటం, ప్రైవేటులో అవకాశాలు ఎక్కువగా ఉండటంతో చాలా రాష్ట్రాల్లో డిమాండ్‌‌ వినిపిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టాలు చేయగా మరికొన్ని రాష్ట్రాల్లో ఇదే నినాదంతో పార్టీలు ఎన్నికలకు వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌లో ఇలాంటి బిల్లును ఈమధ్యే అసెంబ్లీ ఆమోదించగా.. ఉద్యోగాల కోసం ఉద్యమించి రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అటువైపు చూడటం లేదు.

ఏపీ అసెంబ్లీలో బిల్లు పాస్‌‌

ప్రైవేటు రంగంలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చేలా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌‌ అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు. ఆ బిల్లు ప్రకారం ఇక నుంచి రాబోయే అన్ని ప‌‌రిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికుల‌‌కే ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న ప‌‌రిశ్రమల్లోనూ రాబోయే మూడేళ్లలో స్థానికుల కోటాను 75 శాతానికి పెంచాలి. స్థానికంగా అర్హత ఉన్న వాళ్లు లేక‌‌‌‌పోతే ప్రభుత్వంతో స‌‌‌‌మ‌‌‌‌న్వయం చేసుకుని వారికి శిక్షణనిచ్చి ఉపాధి క‌‌‌‌ల్పించాలి. రాష్ట్రం, జిల్లా, జోన్ల వారీగా స్థానిక‌‌‌‌త‌‌‌‌ను నిర్ణయిస్తారు. మధ్యప్రదేశ్‌‌‌‌లో ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు 70 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకొస్తామని ఆ రాష్ట్ర సీఎం కమల్‌‌‌‌నాథ్‌‌‌‌ జులైలో హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనుండటంతో తాము అధికారంలోకి వస్తే ‘75 శాతం’ కోటా తీసుకొస్తామని ఎన్సీపీ హామీ ఇచ్చింది. తమిళనాడులో కూడా స్థానికులకు 80 శాతం రిజర్వేషన్‌‌‌‌పై పీఎంకే (పాట్టలి మక్కల్‌‌‌‌ కచ్చి) పార్టీ డిమాండ్‌‌‌‌ చేస్తోంది.

తెలంగాణలో ఊసేదీ?

రాష్ట్ర ఏర్పాటులో ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదానిది కీలక పాత్ర. కానీ ప్రైవేటు రంగంలో లోకల్స్‌‌‌‌ కోటాపై రాష్ట్రంలో ఎలాంటి ప్రయత్నం జరగడం లేదని తెలంగాణవాదులు అంటున్నారు. ఉద్యమమే ఉద్యోగాల కోసం జరిగిందని, అలాంటిది ఇక్కడి ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడంలేదని వాపోతున్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా ఏపీలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా బిల్లు తెచ్చారని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో చాలా పరిశ్రమలు ఉన్నాయని, ఇంకొన్ని వస్తున్నాయని, వీళ్లంతా ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగులను తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో పరిశ్రమలకు భూములిచ్చిన స్థానికుల్లో అసంతృప్తి పెరిగిపోతోందంటున్నారు. ఇక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లా ప్రైవేటులో స్థానికులకు రిజర్వేషన్‌‌‌‌ ఇవ్వాలని కోరుతున్నారు.

ప్రైవేటులో రిజర్వేషన్‌‌‌‌ అవసరం

గతంలో 15 శాతం ఉన్న ప్రైవేటు రంగం ఇప్పుడు 85 శాతానికి పెరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు, పరిశ్రమలు వస్తుండటంతో లక్షల కొద్దీ ఉద్యోగాలొచ్చే చాన్స్‌‌‌‌ ఉంది. కానీ కంపెనీలు స్థానికులకు ఉద్యోగాలివ్వకుండా ఇతర ప్రాంతాల నుంచి రప్పించుకుంటున్నాయి. దీంతో స్థానికుల్లో అసంతృప్తి పెరుగుతోంది. లోకల్స్‌‌‌‌కు రిజర్వేషన్‌‌‌‌ ఇవ్వడం అవసరం. – శ్రీరామ్‌‌‌‌ నాయక్‌‌‌‌, అధ్యక్షుడు, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌‌‌‌ సాధన సంఘం

రాష్ట్రం కోసం కొట్లాడిందెందుకు?

రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లయినా నిరుద్యోగ సమస్య మాత్రం తీవ్రంగా ఉంది. ప్రైవేటులో లోకల్స్‌‌‌‌కు రిజర్వేషన్‌‌‌‌ కోసం ఇతర రాష్ట్రాల్లో చట్టాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు. ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? – ప్రవీణ్‌‌‌‌రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు, ఏబీవీపీ

Latest Updates