కేసీఆర్ గారి ఒక్క సంతకం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాం

తెలంగాణ వచ్చి ఏడేండ్లు కావస్తున్నా.. త‌మ‌ సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదని వాపోయారు ఆంధ్రాలో ప‌నిచేస్తున్న‌ తెలంగాణ ఉద్యోగులు. బంగారు తెలంగాణలో భాగస్వాములం అవ్వాలని అనుకున్నాం, కానీ బందీలం అయ్యామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎవరి పాలన అయితే వద్దు అనుకున్నామో, ఎవరితో అయితే పోరాడి స్వరాష్ట్రం తెచుకున్నామో…వారితోనే కలిసి పని చేయడం మా దురదృష్ట‌మ‌ని అన్నారు. అంతర్ రాష్ట్ర ఉద్యోగ బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ…సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ / ఆంధ్ర ఉద్యోగుల ఉమ్మడి సమావేశం జ‌రిగింది. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

స‌మావేశంలో త‌మ‌ను స్వరాష్ట్రానికి బదిలీ చేయాల‌ని తెలంగాణ ఉద్యోగులు అన్నారు. తాము ఆంధ్రలో, త‌మ‌ కుటుంబాలు తెలంగాణలో ఉంటున్నాయ‌ని, ఆంధ్రలో పని చేయడం వలన కుటుంబాలకు దూరం అవుతున్నామ‌ని అన్నారు. కొత్త రాష్ట్రంలో ఉద్యోగం చేయాలనీ ఎన్నో కల‌లు కన్నామ‌ని, ఇంకా ఆంధ్రాలోనే పని చేయడానికి త‌మ మనసు ఒప్పుకోవట్లేదని అన్నారు. త‌మ‌ లాగే, ఇక్కడ పని చేసే ఆంధ్రకు చెందిన ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారని…వారిని ఆంధ్రకు పంపాల‌ని అన్నారు. ఏపి నుండి తెలంగాణకు రావాల్సిన ఉద్యోగులు 120 మంది…తెలంగాణ నుండి ఏపీ కి వెళ్లాల్సిన ఉద్యోగులు దాదాపు 1200 మంది ఉన్నార‌ని తెలిపారు.

సీఎం…కేసీఆర్ ఎన్నోసార్లు మా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ మరిచి పోయారని అన్నారు. ప్రభుత్వం వెంటనే త‌మ‌ బధిలీల పైన చొరవ చూపాలని…త‌మ‌ని స్వరాష్ట్రానికి రప్పించాలన్నారు. సీఎం కేసీఆర్ గారి ఒక్క సంతకం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నామ‌ని అన్నారు. మనిషి ఆంధ్రలో – మనసు తెలంగాణ‌లో అన్న‌ట్లు త‌మ బతుకు అయిపోయింద‌ని ఎంతో మేధావిని, ఎన్నో పుస్తకాలు చదివాను అని చెప్పుకునే కేసీఆర్ కి మా సమస్య అర్థం కావట్లేదా… అని ప్ర‌శ్నించారు.

స‌మావేశంలో ఆర్. క్రిష్ణ‌య్య మాట్లాడుతూ.. జార్ఖండ్ , ఛత్తీస్ ఘఢ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఉద్యోగుల సమస్యలు ఏడాది లోపే పరిస్కారం అయ్యాయని, మన దగ్గర మాత్రం 6 ఏండ్లు అయిపోయిన కూడా పరిష్కారం కావట్లేదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు కూర్చొని సమస్య పరిస్కారం చూపాలన్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే చొరవ చూపి, తక్షణమే యుద్ధ ప్రతిపాదికన అంతర్ రాష్ట్ర ఉద్యోగుల బదిలీలు చేపట్టాలన్నారు.

ఉద్యోగ బదిలీలు న్యాయమైన డిమాండ్ అని సమావేశానికి హాజరైన ప్రో.నాగేశ్వర్ రావు అన్నారు. ప్రభుత్వానికి.. స్వరాష్ట్రానికి వస్తాం అనే ఉద్యోగస్తుల‌ను తీసుకునే స్పిరిట్ ఉండాలని, వేరే రాష్ట్రానికి చెందిన ఉద్యోగులను పంపించే ఔదార్యం ఉండాలన్నారు. విభ‌జ‌న త‌ర్వాత రాజ్యసభ సభ్యులను పంచుకున్నారు కానీ.. ఉద్యోగులను మరిచిపోయారన్నారు. బదిలీలు చేయడం వలన ప్రభుత్వానికి ఏం నష్టం జ‌రుగుతుంద‌ని, ఎందుకు ఈ నిబంధనలు? ఎందుకు ఈ వివక్ష..? అని ప్ర‌శ్నించారు.

Latest Updates