ట్రంప్​కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు

ట్రంప్​ను దించేయాలి

క్యాపిటల్​ బిల్డింగ్​పై దాడితో పెరుగుతున్న డిమాండ్లు

సొంత పార్టీ నేతల నుంచే ట్రంప్​కు వ్యతిరేకత

క్యాపిటల్​లో విధ్వంసం చేసింది ప్రాంతీయ టెర్రరిస్టులు: బైడెన్

25వ సవరణ అమలు ద్వారా పదవి నుంచి తొలగించండి: స్పీకర్

క్యాపిటల్ బిల్డింగ్​పై దాడితో పదవీ కాలానికంటే ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ను దించేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన తన మద్దతుదారుల్ని రెచ్చగొట్టి పంపారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 25వ సవరణ ద్వారా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్.. ట్రంప్​ను పదవి నుంచి తొలగించాలని, లేదంటే తామే ఇంపీచ్​మెంట్ ప్రాసీడింగ్స్ ప్రారంభిస్తామని హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ హెచ్చరించారు. మరోవైపు సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్​కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

వాషింగ్టన్: పదవీ కాలానికన్నా ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ను దించేయాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. క్యాపిటల్ బిల్డింగ్​పై దాడికి ట్రంప్ తన మద్దతుదారులను రెచ్చగొట్టారన్న కారణంతో ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 25వ సవరణను అమలు చేయడం ద్వారా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్.. ట్రంప్​ను పదవి నుంచి తొలగించాలని, లేదంటే తామే ఇంపీచ్​మెంట్ ప్రొసీడింగ్స్ ప్రారంభిస్తామని హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇప్పటికే హెచ్చరించారు. మరోవైపు సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్​కు వ్యతిరేకంగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

ట్రంప్ పదవిలో ఉంటే డేంజర్: పెలోసీ

అమెరికాపై సాయుధ తిరుగుబాటును స్వయానా ప్రెసిడెంటే ప్రేరేపించారని స్పీకర్ నాన్సీ ఫైర్ అయ్యారు. అమెరికా రాజ్యాంగంలో 25వ సవరణ ప్రకారం ట్రంప్​ను పదవి నుంచి తొలగించాలని వైస్ ప్రెసిడెంట్​మైక్ పెన్స్, కేబినెట్​ను డిమాండ్ చేశారు. ఒక వేళ ఆ పని వాళ్లు చేయకుంటే.. ఇంపీచ్​మెంట్​ ముందుకు సాగడానికి సిద్ధంగా కాంగ్రెస్ ఉండవచ్చని కామెంట్ చేశారు. ‘‘(ట్రంప్ పదవీ కాలంలో)ఇంకా 13 రోజులే ఉన్నాయి. అయితే 13 రోజుల్లో ఏ రోజైనా భయానకమైన సంఘటనలు జరగొచ్చు” అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏంటీ 25వ సవరణ?

అమెరికా రాజ్యాంగంలోని25వ సవరణ అమలు చేయడం ద్వారా ట్రంప్​ను పదవి నుంచి దించేయాలని పెలోసీ సహా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ తన డ్యూటీ నిర్వహించలేని స్థితిలో ఉన్నప్పుడు.. వైస్ ప్రెసిడెంట్ కొంతకాలంపాటుయాక్టింగ్ ప్రెసిడెంట్‌‌గా బాధ్యతలు స్వీకరించడానికి ఈ సవరణ అనుమతిస్తుంది. దీన్ని అమలు చేయాలంటే కేబినెట్ మంత్రుల్లో మెజారిటీ సభ్యులు ‘ప్రెసిడెంట్ తన విధులు నిర్వహించే స్థితిలో లేరు’ అని అంగీకరించాలి. ఇందుకు సంబంధించిన లెటర్​ను సెనేట్‌‌, ప్రతినిధుల సభ స్పీకర్లకు ఇవ్వాలి. అలా జరిగినప్పుడు వైస్ ప్రెసిడెంట్ స్థానంలో ఉన్న మైక్ పెన్స్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తారు. దానిపై రాతపూర్వకంగా జవాబు ఇచ్చేందుకు ట్రంప్‌‌కు అవకాశం ఇస్తారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన సవాలు చేసినప్పుడు.. దానిపై అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రెసిడెంట్ ను తొలగించాలని తీర్మానం చేయాలంటే సెనేట్‌‌తో పాటు ప్రతినిధుల సభలో మూడింట రెండు వంతుల మద్దతు లభించాలి. మైక్ పెన్స్ కూడా 25వ సవరణ అమలుకు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం.

వాళ్లు మూల్యం చెల్లించుకుంటరు: ట్రంప్

క్యాపిటల్‌‌ బిల్డింగ్​లోకి చొరబడి అల్లర్లు సృష్టించిన వాళ్లు ‘చాలా స్పెషల్’ అని, ‘గొప్ప దేశభక్తులు’ అని ట్వీట్లు చేసిన డొనాల్డ్ ట్రంప్… ఒక్క రోజులోనే మాట మార్చారు. క్యాపిటల్ లోకి చొరబడిన నిరసనకారులు అమెరికా ప్రజాస్వామ్య స్థానాన్ని అపవిత్రం చేశారని కామెంట్ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. గురువారం (అక్కడి టైం ప్రకారం) ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్​లో వీడియో రిలీజ్ చేసిన ట్రంప్.. అందులో శాంతి వచనాలు పలికారు. ఎన్నికల తర్వాత ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. కోపం ఇప్పుడు చల్లబడాలని పిలుపునిచ్చారు. అధికార బదిలీకి సహకరిస్తానని, ఈనెల 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని చెప్పారు.

ప్రజాస్వామ్యంపై ఊహించని దాడి: బైడెన్

యూఎస్ క్యాపిటల్​బిల్డింగ్​పై ట్రంప్‌‌ సపోర్టర్లు జరిపిన దాడి.. అమెరికా చరిత్రలోనే చీకటి రోజుల్లో ఒకటని కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌‌ అన్నారు. అమెరికా ప్రజాస్వామ్యంపై ఊహించని దాడి అని చెప్పారు. ట్రంప్‌‌ ప్రజాస్వామ్య ధిక్కారానికి ఫలితమే హింసాత్మక ఘటనలకు కారణమని మండిపడ్డారు. క్యాపిటల్‌‌ బిల్డింగ్​లో జరిగినవి ఆందోళనలు, నిరసనలు కావని.. గందరగోళ పరిచే అల్లర్లేనని ఆరోపించారు. డెలావెర్‌‌లోని విల్మింగ్‌‌టన్ లో మీడియాతో బైడెన్ మాట్లాడారు. ‘‘క్యాపిటల్‌‌ బిల్డింగ్​పై దాడి చేసిన వాళ్లు అల్లరి మూకలు, తిరుగుబాటుదారులు, ప్రాంతీయ టెర్రరిస్టులు” అని మండిపడ్డారు.

రెండో ఇంపీచ్‌మెంట్‌

25వ సవరణ ప్రొసీజర్ ను  వైస్ ప్రెసిడెంట్ ప్రారంభించకపోతే.. కాంగ్రెస్​ను స్పీకర్ పెలోసీ సమావేశపరిచి ఇంపీచ్​మెంట్ ప్రొసీడింగ్స్​ను ప్రారంభించే చాన్స్ ఉంది. గతంలో ఒకసారి ట్రంప్ ఇంపీచ్ మెంట్ ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇది రెండోది అవుతుంది. అదే జరిగితే అమెరికా చరిత్రలో రెండు సార్లు ఇంపీచ్ మెంట్ఎదుర్కొన్న తొలి ప్రెసిడెంట్​గా ట్రంప్ నిలుస్తారు.

5కు చేరిన మృతులు

అల్లర్లలో గాయపడ్డ యూఎస్ క్యాపిటల్ పోలీస్ ఆఫీసర్ బ్రయన్ డి.సిక్​నిక్ చనిపోయాడు. ప్రొటెస్టర్లను అడ్డుకునే క్రమంలో గాయపడ్డ ఆయన ఆస్పత్రిలో చనిపోవడంతో క్యాపిటల్​పై దాడి ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది.

డెమొక్రసీపై దాడి

ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్​హిల్​లోకి దూసుకెళ్లడాన్ని ఇండియన్ అమెరికన్ గ్రూపులు ఖండించాయి. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నాయి. సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్, ఎడ్యుకేషన్ ఫండ్, హిందూ అమెరికన్ ఫౌండేషన్ సంఘాలు ప్రకటనలు రిలీజ్‌ చేశాయి.

కొనసాగిన రాజీనామాలు

ట్రంప్ అడ్మినిస్ర్టేషన్​లోని అధికారుల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా ట్రాన్స్​పోర్టేషన్ సెక్రెటరీ ఎలైన్, ఎడ్యుకేషన్ సెక్రెటరీ దేవోస్, నార్తర్న్ ఐర్లాండ్ స్పెషల్ ఎన్వాయ్ ముల్వనే రాజీనామా చేశారు. యూఎస్ క్యాపిటల్ పోలీస్ చీఫ్ స్టీవెన్ సండ్.. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

నిక్సన్‌ కూడా..

గతంలో క్షమాపణ పొందిన ఏకైక అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్. ప్రెసిడెంట్​గా నిక్సన్ దిగిపోయిన ఒక నెల తర్వాత.. పదవిలో ఉన్నప్పుడు ఆయన చేసిన అన్ని నేరాలను క్షమిస్తూ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్ నిర్ణయం తీసుకున్నారు. రిచర్డ్ నిక్సన్ హయాంలో వైస్ ప్రెసిడెంట్​గా ఫోర్డ్ పని చేశారు.

‘నన్ను నేనే క్షమించేసుకుంటే ఎట్లుంటది’

తనకు తాను క్షమాభిక్ష ప్రకటించుకునేందుకు ఉన్న అధికారాలపై వైట్ హౌస్ న్యాయ సలహాదారు పాట్ సిపొల్లోన్ సహా ఇతర సహాయకులు, లాయర్లతో అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ చర్చిస్తున్నారని మీడియా రిపోర్టులు వెల్లడించాయి. కొన్ని వారాల కిందట ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని పేర్కొన్నాయి. తనను తాను క్షమించుకునేందుకు సంబంధించి ‘ఎలక్షన్ డే’ నుంచి ట్రంప్ చర్చిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్ రిపోర్ట్ చేసింది. దీనిపై తనకున్న అధికారాలపై లీగల్ ఒపీనియన్​కూడా తీసుకున్నారని తెలిపింది. ‘సెల్ఫ్ పార్డన్ పవర్’ గురించి ట్రంప్ 2017 నుంచే ఆలోచిస్తున్నారు. తన సలహాదారులతో కూడా చర్చించారు.‘‘చాలా మంది లీగల్ స్కాలర్లు చెప్పినట్లుగా.. నన్ను నేను క్షమించుకునే హక్కు నాకు ఉంది. కానీ నేను ఏ తప్పు చేయనప్పుడు అలా ఎందుకు చేయాలి?’’ అని 2018లో ట్రంప్‌‌ ట్వీట్ చేశారు. అప్పట్లో ఈ కామెంట్లు దుమారం రేపాయి. మరోవైపు ఇవాంకా, కొడుకులు ఎరిక్, ట్రంప్ జూనియర్, జేరెడ్ కుష్నెర్ సహా చాలా మందికి క్షమాభిక్ష కల్పించేందుకు ట్రంప్‌‌ సిద్ధమవుతున్నారని సమాచారం.

For More News..

ట్రంప్‌కు ట్విట్టర్ షాక్.. అకౌంట్‌పై శాశ్వత నిషేధం

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది పిల్లలు మృతి

నాలుగేండ్లలో 5 వేల యాక్సిడెంట్లు

Latest Updates