గీతం వర్సిటీకి చెందిన కట్టడాలు కూల్చివేత

విశాఖపట్టణం: గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలను జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామునే జేసీబీలు, బుల్ డోజర్లతో యూనివర్సీటికి చేరుకున్న సిబ్బంది గీతం వర్సిటీ ప్రధాన ద్వారాన్ని, ప్రహరీ గోడ కొంతభాగం, సెక్యూరిటీ వారుండే గదులను కూల్చివేశారు. కూల్చివేతకు ముందు బీచ్ రోడ్డులో గీతం వర్సిటీకి వెళ్లే మార్గంలో రెండు వైపులా రోడ్లు మూసేశారు. తెలుగుదేశం పార్టీ అనుచరులు పెద్ద ఎత్తున తరలించే అవకాశం ఉందని వర్సిటీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించారని.. అందుకే మార్కింగ్ చేసి కూల్చేశామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. అయితే నోటీసులు ఇవ్వకుండానే ఎలా కూల్చివేస్తారని గీతం వర్సిటీ ప్రశ్నిస్తోంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం దురదృష్టకరమని గీతం వర్సిటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఆక్రమణలు ఎంత మేర జరిగాయో ముందే  మార్కింగ్ చేశామని.. జీవీఎంసీ సిబ్బంది చెబుతున్నారు. వాగ్వాదాల నేపధ్యంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది.

Latest Updates