డాన్‌కు ప్రణీత్‌ చెక్‌

    డెన్మార్క్‌‌ఓపెన్‌‌లో

    సాయి, సింధు బోణీ

    సాత్విక్‌‌-చిరాగ్‌‌ జోడీ కూడా

     కశ్యప్‌‌, సౌరభ్‌‌ వర్మ ఔట్‌‌

వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో కాంస్యం నెగ్గి ఫామ్‌‌లోకొచ్చిన తెలుగు షట్లర్‌‌ సాయి ప్రణీత్‌‌ కెరీర్‌‌లో మరో కీలక విజయం సాధించాడు. చైనా గ్రేట్‌‌ ప్లేయర్‌‌ లిన్‌‌ డాన్‌‌కు అతను చెక్‌‌ పెట్టాడు. డెన్మార్క్‌‌ ఓపెన్‌‌ ఫస్ట్‌‌ రౌండ్‌‌లో అదిరే ఆటతో లిన్‌‌ డాన్‌‌పై తొలిసారి గెలిచిన సాయి సెకండ్‌‌ రౌండ్‌‌లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్‌‌లో టైటిల్‌‌ ఫేవరెట్‌‌ పీవీ సింధు బోణీ కొట్టింది. యువ జంట సాత్విక్‌‌ సాయిరాజ్‌‌-చిరాగ్‌‌ షెట్టి కూడా ముందంజ వేసింది. కానీ, కొరియా ఓపెన్‌‌లో సెమీస్‌‌ చేరి ఆకట్టుకున్న వెటరన్‌‌ పారుపల్లి కశ్యప్‌‌, యంగ్‌‌స్టర్‌‌ సౌరభ్‌‌ వర్మ ఫస్ట్‌‌ రౌండ్‌‌లోనే ఓడి టోర్నీ నుంచి వైదొలిగారు.

తెలుగు షట్లర్‌‌ భమిడిపాటి సాయి ప్రణీత్‌‌ డెన్మార్క్‌‌ ఓపెన్‌‌ను అద్భుత విజయంతో ప్రారంభించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో ప్రణీత్‌‌ 21–14, 21–17తో మాజీ వరల్డ్‌‌, ఒలింపిక్‌‌ చాంపియన్ లిన్‌‌ డాన్‌‌ను ఓడించి ఔరా అనిపించాడు. డాన్‌‌తో గతంలో తలపడ్డ రెండు సార్లు పరాజయం పాలైన సాయి ఈ సారి మాత్రం అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేశాడు. వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో కాంస్య పతకం గెలిచి జోరు మీదున్న ఈ హైదరాబాదీ మ్యాచ్‌‌ అసాంతం ఆధిపత్యం చెలాయించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సాయి పదునైన స్మాష్‌‌లతో పాయింట్లు రాబడుతూ 5–2తో లీడ్‌‌లోకి వచ్చాడు. 7–9తో డాన్‌‌ తనను అందుకునే ప్రయత్నం చేసినా మంచి డ్రాప్‌‌ షాట్‌‌తో ప్రణీత్‌‌ బ్రేక్‌‌ టైమ్‌‌కు 11–8తో నిలిచాడు. విరామం తర్వాత లిన్‌‌ పవర్‌‌ఫుల్‌‌ షాట్లు ఆడడంతో మ్యాచ్‌‌ హోరాహోరీగా సాగేలా కనిపించింది. కానీ, తెలివిగా ఆడుతూ ఆధిక్యం కాపాడుకున్న హైదరాబాదీ.. 17–12తో ముందంజ వేశాడు. ఈ టైమ్‌‌లో డాన్‌‌ రెండు పాయింట్లు గెలిచినా.. వరుసగా మూడు పాయింట్లు రాబట్టిన ప్రణీత్‌‌ గేమ్‌‌ గెలిచాడు. రెండో గేమ్‌‌లో ఇద్దరు షట్లర్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. ఆరంభంలో చెరో పాయింట్‌‌ నెగ్గుతూ వెళ్లడంతో గేమ్‌‌ ఉత్కంఠగా సాగింది. 11–8తో బ్రేక్‌‌కు వెళ్లొచ్చిన తర్వాత సాయి గేరు మార్చాడు. డాన్‌‌ తప్పిదాలను సద్వినియోగం చేసుకొని 17–11తో ముందంజ వేశాడు. అదే జోరుతో 20–14తో మ్యాచ్‌‌ పాయింట్‌‌పై నిలిచాడు. ఈ దశలో లిన్‌‌ మూడు మ్యాచ్‌‌ పాయింట్లు కాపాడుకోవడంతో ఉత్కంఠ రేగింది. కానీ, ప్రణీత్‌‌ డ్రాప్‌‌ షాట్‌‌ను రిటర్న్‌‌ చేసే ప్రయత్నంలో అతను షటిల్‌‌ను నెట్‌‌కు కొట్టి మ్యాచ్‌‌ కోల్పోయాడు. సెకండ్‌‌ రౌండ్‌‌లో వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌ కెంటా మొమోటాతో ప్రణీత్‌‌కు సవాల్‌‌ ఎదురయ్యే చాన్సుంది. కాగా, ఇతర మ్యాచ్‌‌ల్లో పారుపల్లి కశ్యప్‌‌ 13–21, 12–21తో సితికోమ్‌‌ తమాసిన్‌‌ (థాయ్‌‌లాండ్‌‌) చేతిలో ఓడిపోయాడు. యువ ప్లేయర్‌‌ సౌరభ్‌‌ వర్మ 21–19, 11–21, 17–21తో మార్క్‌‌ కల్జౌ (నెదర్లాండ్‌‌) చేతిలో మూడు గేమ్‌‌ల పాటు పోరాడి పరాజయం పాలయ్యాడు. అయితే, డబుల్స్‌‌లో సాత్విక్‌‌-–చిరాగ్‌‌ జంట 24–22, 21–11తో కొరియా జోడీ కిమ్‌‌ జి జుంగ్‌‌—–లీ యాంగ్‌‌ పై గెలిచింది.

సింధు కాస్త కష్టంగా..

గత నెలలో కొరియా ఓపెన్‌‌ తొలి రౌండ్‌‌లోనే నిష్క్రమించిన వరల్డ్‌‌ చాంపి యన్‌‌ సింధు మహిళల సింగిల్స్‌‌ ఆరంభ మ్యాచ్‌‌లో కష్టపడాల్సి వచ్చింది. ఐదో సీడ్‌‌ సింధు 22–20, 21–18తో మాజీ వరల్డ్‌‌ జూనియర్‌‌ చాంపియన్‌‌ గ్రెగోరియా మరిస్కా టున్‌‌జుంగ్‌‌ (ఇండోనేసియా)పై 38 నిమిషాల పాటు పోరాడి గెలిచింది. ఏ టోర్నీలో అయినా ఒకటి రెండు రౌండ్లలో జోరందుకునే సింధు ఈ మ్యాచ్‌‌ ప్రారంభంలో కాస్త తడబడింది. ఫస్ట్‌‌ గేమ్‌‌లో ఓ దశలో 13–16తో వెనుకబడింది. అయితే, 19–20తో నిలిచిన దశలో ఒక గేమ్‌‌ పాయింట్‌‌ కాపాడుకున్న తెలుగమ్మాయి తనదైన శైలిలో పుంజుకుంది. వరుసగా మూడు పాయింట్లతో గేమ్‌‌ గెలిచింది. సెకండ్‌‌ గేమ్‌‌లోనూ గ్రెగోరియా నుంచి సింధుకు సవాల్‌‌ ఎదురైంది. ఆరంభంలోనే 9–6తో లీడ్‌‌ సాధించిన ఆమె తర్వాత 17–16తో వడివడిగా గేమ్‌‌ దిశగా సాగింది. కానీ, ఈ టైమ్‌‌లో ఒక్కసారిగా విజృంభించిన సింధు వరుసగా పాయింట్లు రాబట్టింది. గేమ్‌‌తో పాటు మ్యాచ్‌‌ ఖాతాలో వేసుకుంది. సెకండ్‌‌ రౌండ్‌‌లో 19వ ర్యాంకర్‌‌ అన్‌‌ సె యంగ్‌‌ (సౌత్‌‌ కొరియా)తో ఆరో ర్యాంకర్‌‌ సింధు తలపడనుంది. డబుల్స్​లో అశ్విని–సిక్కిరెడ్డి జంట 23–25, 18–21తో టాప్​ మయు మొత్సమొటో–నగాహర (జపాన్​) ద్వయం చేతిలో ఓడిపోయింది.

Latest Updates