వీడియో: తనపై దాడికి యత్నించిన ఎంపీలకు టీ అందించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కొంతమంది ఎంపీలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై దాడికి ప్రయత్నించారు. బిల్లులను చింపి ఆయనపై విసిరారు. దాంతో డిప్యూటీ చైర్మన్‌పై దాడికి పాల్పడిన వారిని చైర్మన్ వెంకయ్యనాయుడు సోమవారం సస్పెండ్ చేశారు. అయితే సస్పెండయిన ఎనిమిది మంది ఎంపీలు.. సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రాత్రంతా రాజ్యసభ ఆవరణలోనే ధర్నాకు దిగారు. వారికి హరివంశ్ మంగళవారం ఉదయం స్వయంగా టీ మరియు స్నాక్స్ తీసుకెళ్లి ఇచ్చారు. అయితే ఎంపీలంతా హరివంశ్ నుంచి టీ తీసుకోవడానికి నిరాకరించారు.

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డెరెక్ ఓబ్రెయిన్, ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్, కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ సతవ్, రిపున్ బోరా, సయ్యద్ నాసిర్ హుస్సేన్, సీపీఎంకు చెందిన కేకే రాగేశ్, ఎలమారామ్ కరీమ్‌, టిఎంసీకి చెందిన డోలా సేన్‌లు తమ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా సోమవారం రాత్రి పార్లమెంటు పచ్చిక బయళ్లలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర పడుకున్నారు. అక్కడ వారు ప్లకార్డులు కూడా ఏర్పాటుచేశారు. ఎంపీ రిపున్ బోరా మాట్లాడుతూ.. ‘హరివంశ్ మమ్మల్ని సహోద్యోగిగా కలుసుకున్నారు కానీ.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా కాదు. ఆయన మా కోసం టీ మరియు స్నాక్స్ కూడా తీసుకువచ్చారు. మా సస్పెన్షన్‌కు నిరసనగా సోమవారం మధ్యాహ్నం 12 నుండి నిరసన తెలుపుతున్నాము’ అని ఆయన అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘మేము ఇక్కడ ధర్నా చేస్తున్నది టీ కోసం కాదు. మేమంతా డిప్యూటీ చైర్మన్‌ను గౌరవిస్తాము. ధర్నా తరువాత మేమంతా ఆయనను టీ కోసం ఆహ్వానిస్తాము’ అని అన్నారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌తో “వికృత ప్రవర్తన” కోసం ఎంపీఎస్‌ను రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు అంతకుముందు సస్పెండ్ చేశారు. వ్యవసాయ బిల్లులను వాయిస్ ఓటు ద్వారా ఆమోదించారు.

కాగా.. సస్పెండైన ఎంపీలకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరీవంశ్ తానే స్వయంగా టీ తీసుకెళ్లి అందించడాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. తనపై దాడికి ప్రయత్నించిన వారికి టీ సర్వ్ చేయడం హరీవంశ్ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. ‘శతాబ్ధాలుగా బీహార్… ప్రజాస్వామ్య విలువలను బోధిస్తోంది. దానికి అనుగుణంగానే విపక్ష ఎంపీలతో హరీవంశ్ ప్రవర్తించిన తీరు స్పూర్తి దాయకంగా నిలుస్తోంది. ఈ ఘటన ప్రతి ప్రజాస్వామ్య ప్రేమికుడు గర్వించేలా చేస్తుంది. ఈ సందర్భంగా హరీవంశ్‌కు అభినందనలు తెలుపుతున్నాను’ అంటూ మోడీ ట్వీట్ చేశారు.

For More News..

తెలంగాణలో మరో 2,166 కరోనా కేసులు

ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా పదిసార్లు ఎవరెస్ట్ ఎక్కిన ఆంగ్ రీటా మృతి

మద్దతు ధర పెంచిన కేంద్రం.. ఏ పంటకు ఎంతంటే..

Latest Updates