గద్వాల, వెలుగు: మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. దాసంగాలు పెట్టి, కల్లు సాకపోసి, మేకలు, కోళ్లను బలిచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. జములమ్మ అమ్మవారు, పరుశురాముడిని దర్శించుకునేందుకు రెండు గంటలకు పైగా క్యూలైన్ లో వేచి చూడాల్సి వచ్చింది. రాత్రి పెద్ద జాతర సందర్భంగా చెన్నకేశవ స్వామి రథోత్సవాన్ని నిర్వహించారు.
