గద్దెలపై నుంచి తల్లీబిడ్డలు దీవించిన్రు

మేడారం జాతర మూడో రోజు లక్షల్లో తరలివచ్చిన భక్తులు
వీవీఐపీల రాకతో ట్రాఫిక్​ జామ్​.. నేడు సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం

తల్లీబిడ్డలు సమ్మక్క, సారలమ్మ గద్దెలనెక్కి సల్లంగ చూస్తుండగా, దీవెనలు అందిస్తుండగా.. మేడారం పులకించింది. వనమంతా భక్తిభావంతో పరవశించింది. మేడారం మహాజాతర  మూడో రోజు శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తల్లులను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. చీరెసారెలు పెట్టి, ఒడిబియ్యం పోశారు. వనదేవతల వీరగాథను యాదికితెచ్చుకొని పాటలు పాడారు. నిలువెత్తు బంగారం (బెల్లం) ముట్టజెప్పారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. శుక్రవారం ఒక్కరోజే గద్దెల వద్ద తల్లులను 20లక్షల మంది దర్శించుకున్నారు. గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ, సీఎం కేసీఆర్​ సహా పలువురు ప్రముఖులు జాతరకు వచ్చారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో రావడంతో తాడ్వాయి రూట్‌‌‌‌లో రెండు గంటల పాటు ట్రాఫిక్‌‌‌‌ జామైంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. మహాజాతర చివరి రోజైన శనివారం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం చేయనున్నారు.

మేడారం, వెలుగుఒక వైపు సమ్మక్క.. మరోవైపు సారలమ్మ. ధీరత్వం నిండిన తల్లులు. కోరిన కోర్కెలు తీర్చే మహిమాన్వితం కలిగిన అమ్మలు.. రెండేళ్ల తర్వాత గద్దెలపై దర్శనమిచ్చారు. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరారు. ఇద్దరు అమ్మల రాకతో కోరిన కోర్కెలు తీర్చాలని భక్తులు కానుకలు, మొక్కులు చెల్లించారు. కొందరు భక్తులు నిలువు దోపిడీ ఇచ్చేశారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతర భక్తులు అమ్మవార్ల దర్శనానికి విచ్చేశారు. చీరెసారెలు పెట్టి, పసుపు, కుంకుమలు చల్లి, ఒడిబియ్యం పోసి వన దేవతలను కొలిచారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తుల రాకతో మేడారం పరిసరాలు కిటకిటలాడాయి. దర్శనానికి వచ్చిన లక్షలాది మంది భక్తులతో గద్దెల ప్రాంగణం జనసంద్రంగా మారింది. గద్దెలపై ఉన్న అమ్మవార్లను దర్శించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌, తెలంగాణ, హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌రాష్ట్ర గవర్నర్లు తమిళి సై, బండారు దత్తాత్రేయలు విచ్చేశారు. సారెతో అమ్మవారికి మొక్కులు సమర్పించారు. వీరితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం అమ్మవార్లకు మొక్కుకున్నారు.

5 కి.మీ. వరకు ట్రాఫిక్‌‌ ‌‌జామ్​

ఆర్టీసీ వాహనాలు, వీఐపీ, వీవీఐపీలు వచ్చే తాడ్వాయి రూట్‌‌‌‌లో శుక్రవారం రెండు గంటల పాటు ట్రాఫిక్‌‌‌‌ జామై 5 కి.మీ దూరం వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌‌‌‌ను క్లియర్‌‌ ‌‌చేయడానికి పోలీసులు కూడా లేరు. మొత్తం సీఎం బందోబస్తు కోసం మేడారం గద్దెల దగ్గరికి వెళ్లిపోయారు. దీంతో ఆర్టీసీ ప్రయాణికులు నడుచుకుంటూ మేడారం చేరుకున్నారు.

భక్తులకు తీవ్ర ఇక్కట్లు

వీఐపీ, వీవీఐపీ వాహనాల కోసం మేడారంలో రెండు వేర్వేరు పార్కింగ్‌‌‌‌ప్లేస్‌‌‌‌లు ఏర్పాటు చేశారు. అయినా శుక్రవారం చాలా వాహనాలు గద్దెల వరకు వచ్చాయి. అమ్మవార్లను దర్శించుకోవడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌‌‌‌పర్సన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఎక్కువ మంది వచ్చారు. వీరు ప్రయాణించే వాహనాలను పోలీసులు పార్కింగ్‌‌‌‌ప్లేస్‌‌‌‌లకు పంపించాలి. కానీ ఆ వాహనాలను అలా పంపకపోవడంతో గద్దెల వరకు వచ్చేశాయి. స్థానిక ఐటీడీఏ గెస్ట్‌‌హౌజ్‌‌‌‌లో పార్కింగ్‌‌‌‌ చేశారు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. అసలే దర్శనానికి ఆలస్యం అవుతుందని నెత్తిన బంగారం పెట్టుకొని వేగిరంగా వెళుతున్న భక్తులకు వాహనాలు అడ్డంగా వచ్చి చిరాకు పరిచాయి. అటు, ఇటు కదలకుండా గంటల కొద్ది రోడ్లపైనే ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఎటూ వెళ్లలేని స్థితిలో అరగంట నుంచి గంటపాటు నరకయాతన పడ్డారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సాధారణ భక్తులతో ఆడుకుంటున్నారంటూ వాహనాలపైనే తమ చిన్నారులను కూర్చోబెట్టారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న మహిళను తీసుకువస్తున్న 108అంబులెన్స్​జనం మధ్యలో ఇరుక్కుపోయింది. పోలీసులు తీవ్రంగా శ్రమించి ట్రాఫిక్​ క్లియర్​ చేశారు.

Latest Updates