సుప్రీంకోర్టు తాజా ప్రకటనతో శబరిమలలో పూర్వవైభవం…

శరణు ఘోషతో శబరిమల అయ్యప్ప ఆలయం మార్మోగుతోంది. మండల పూజ కోసం ఆలయాన్ని నిన్న సాయంత్రం తెరిచారు. వేల మంది భక్తులు శబరిమలకు వస్తున్నారు. దీక్షలు స్వీకరించిన స్వాములు పంబా బేస్ క్యాంప్ నుంచి శబరి కొండకు కాలి నడక మార్గంలో వెళ్తున్నారు. దీక్ష విరమణల సమయం కావడంతో… శబరి కొండపై ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు.

సుప్రీంకోర్టు తాజా ప్రకటనతో శబరిమల ఆలయంలో పూర్వస్థితిని కొనసాగిస్తున్నట్టు చెప్పారు కేరళ న్యాయ శాఖ మంత్రి ఏకే బాలన్. కేసు విస్తృత బెంచ్ కు బదిలీ కావడంతో… గతేడాది సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పుపై కొంత సందిగ్ధత ఏర్పడిందన్నారు. స్పష్టత వచ్చేవరకు.. తమ ప్రభుత్వం పూర్వ సంప్రదాయాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని పోలీసులు అమలుచేస్తున్నారు. 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలను పంబా నుంచే తిప్పి పంపిస్తున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయం వచ్చే ఏడాది జనవరి 20 వరకు తెరిచే ఉంటుంది. మధ్యలో డిసెంబర్ చివరి వారంలో  2 రోజులు మాత్రం మూసి ఉంచుతారు.

Latest Updates