ఆలయాలు, ప్రార్ధనా మందిరాల‌ వద్ద సీసీ కెమెరాలు పెట్టాలి

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్, సర్కిల్ ఆఫీస్, సబ్ డివిజన్, యూనిట్ రేంజ్ అధికారులతో ఇవాళ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం మీడియా మీట్ నిర్వహించిన వివరాలు వెల్లడించారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాల దగ్గర భద్రత చర్యలపై డీజీపీ సమీక్ష నిర్వహించారు.

ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఆలయాల జియో ట్యాగింగ్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. నేరచరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా పెట్టాలి. నిర్వాహకులు పోలీసులు సూచనలు పాటిస్తూ.. జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక పోలీసులు అక్కడ ఏర్పాట్లను పరిశీలించి, నిబంధనలు పాటించేలా చూడాలి. ఆలయ కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలి. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలి. ప్రజలు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి దేవాలయం దగ్గర పాయిట్‌ బుక్‌ ఏర్పాటు చేయాలి. పరిసరాల్లో అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు ఉండేలా చూడాలని పోలీసులకు సూచించారు డీజీపీ గౌతమ్ సవాంగ్.

Latest Updates