తండ్రీ, కొడుకు, బిడ్డ బాగుపడితే చాలా?

నిజామాబాద్, వెలుగు: బంగారు తెలంగాణ పేరుమీద ఒక కుటుంబంలోని తండ్రి, కొడుకు, బిడ్డ బాగుపడితే చాలా.. మనందరం కోరుకున్న తెలంగాణ ఇదేనా అని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) అన్నా రు. సీఎం కేసీఆర్​కు దమ్ముంటే తనపై యాక్షన్​ తీసుకోవాలని, పార్టీలోంచి పంపేయాలని సవాల్​ చేశారు. మంత్రి ప్రశాంత్​రెడ్డి తనపై విమర్శలు చేయడం సరికాదని, తన జోలికొస్తే వదిలి పెట్టబోనని హెచ్చరించారు.

మంత్రి విమర్శలతో..

కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, లీడర్లు డీఎస్​ను సస్పెండ్ చేయాలంటూ జిల్లా విభాగంలో తీర్మానం చేసి..హైకమాండ్ కు పంపారు. దానిపై చర్యలేమీ తీసుకోలేదు. అప్పటి నుంచీ ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా రు. అయితే తాజాగా మున్సిపల్​ ఎలక్షన్ల ప్రచారంలో డీఎస్​పై మంత్రి ప్రశాంత్​రెడ్డి విమర్శలు గుప్పించారు. 40 ఏండ్లుగా నిజామాబాద్ కు ఏం చేశారంటూ కామెంట్​ చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్​ సోమవారం నిజామాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ ను వీడటం పెద్ద తప్పిదం

తన రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పిదం కాంగ్రెస్ పార్టీని వీడటమని డీఎస్  అన్నా రు.‘‘తెలంగాణ ఇచ్చేందుకు సోనియా గాంధీని ఒప్పించడంలో నేను కీలక పాత్ర పోషించిన. సీఎం కేసీఆర్​ చాలాసార్లు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అప్పట్లో సుష్మా స్వరాజ్ కూడా సహకరించారు. దిగ్విజయ్ తో  విభేదాలతో కాంగ్రెస్​ను వీడా. నన్ను రాజకీయంగా దెబ్బతీయాలని సోనియాకు దిగ్వి జయ్ తప్పుడు రిపోర్టు ఇచ్చారు. రాజకీయాలను స్వార్థానికి ఉపయోగించే నైజం నాది కాదు. కేసీఆర్​ ఇంట్లో ప్రశాంత్​రెడ్డి కుక్కలా పడి ఉంటారు. నా గురించి ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు. తల తిక్కమాటలు మానుకోవాలి. నేనెవరినీ తిట్టను . నా జోలికొస్తే వదిలి పెట్టను ..” అని డీఎస్​ చెప్పారు.

జనాన్ని మభ్యపెడ్తున్నరు

మనం కోరుకున్న బంగారు తెలంగాణ ఇదేనా అని డీఎస్​ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బంగారు తెలంగాణ పేరు మీద ఒక కుటుంబంలోని తండ్రి, కొ డుకు, బిడ్డ బాగుపడితే చాలా? అసలేం జరుగుతోంది, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నా రో తెలియడం లే దు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు జరుగుతున్నాయి. నా తల్లి చనిపోతే కూడా కనీసం ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదు. అప్పట్లో నాకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రికి కంపట్​ చేయించిన్రు. నామీద యాక్షన్​ తీసుకోవాలని తీర్మానం చేశారు. ఆ రోజునే సీఎంకు, టీఆర్ఎస్​ పార్టీకి నేను చాలెంజ్ చేసిన. మీకు దమ్ముంటే నామీద యాక్షన్​ తీసుకొండి. లేకుంటే తీర్మానం విత్​డ్రా చేసుకోండి అని చెప్పిన. కానీ యాక్షన్​ తీసుకోలేదు. విత్​డ్రా చేసుకోలేదు. నేను ఈ రోజు కూడా చెప్తున్నా . అట్లా పెండింగ్​లో పెట్టడం కంటే .. ఇప్పటికైనా చర్యతీసుకోండి. నేను పొరపాటు చేశారని, నాతో లాభం లేకుండా ఉంటే ఎందుకు పార్టీలో ఉంచుకున్నా రు.తీసి పారేయండి పార్టీలోంచి బయటికి.. అంతే తప్ప చీప్​గా మాట్లాడటం సరికాదు.” అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates