డీహెచ్‌ఎఫ్‌ఎల్ అయాన్ క్యాప్ చేతికి?

న్యూఢిల్లీ :  డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అప్పుల చెల్లింపులో మార్పుల ప్లాన్ గురించి వాటాదారుల అనుమతి కోసం చూస్తుండగానే… మరోవైపు ప్రమోటర్లు కూడా తమ వాటాలను బల్క్‌‌గా అమ్మేందుకు డీల్స్ కుదుర్చుకుంటున్నారు. కంపెనీ నియంత్రణను ప్రమోటర్లు వదులుకునేందుకు సిద్ధమయ్యారని లేటెస్ట్ రిపోర్ట్‌‌లు చెబుతున్నాయి. ప్రత్యేక పరిస్థితుల కింద  అయాన్ క్యాపిటల్‌‌తో డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్ డీల్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ డీల్ ప్రకారం మెజార్టీ వాటాలను అయాన్ క్యాపిటల్ చేజిక్కించుకుని రూ.8వేల కోట్లను కంపెనీలో ఇన్వెస్ట్ చేయనుంది. అయాన్ క్యాపిటల్ అనేది అపోలో పీఈ, ఐసీఐసీఐ వెంచర్స్ కలసి ఏర్పాటు చేసిన సంస్థ. డీల్ అనంతరం అయాన్ క్యాపిటల్‌‌, డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ కంపెనీలో 51 శాతం వాటాలను  పొందనుంది. ప్రస్తుత ప్రమోటర్ కపిల్‌‌ వాధ్వాన్ వాటా 9.6 శాతానికి పడిపోనుంది. బ్యాంక్‌‌లు, ఇతర లెండర్స్ వాటాలు 26 శాతంగా ఉండనున్నాయి. ఈ డీల్ కింద అయాన్ క్యాపిటల్‌‌కు కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు. ఈ నెల 31 కంటే ముందే ఈ డీల్ ప్రకటన వెలువడే అవకాశముంది.

ఆడిటెడ్‌‌ ఫలితాలు సోమవారం ఫైలింగ్…

ఎంతో కాలంగా వాయిదా పడుతూ వచ్చిన మార్చి క్వార్టర్ ఆడిటెడ్ ఫలితాలను కంపెనీ సోమవారం ఫైల్ చేసింది. ఈ ఫలితాలపై ఆడిటర్లు పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు.  ఈనెల 13న వెల్లడించిన​అన్‌‌ఆడిటడ్ నికర నష్టాలకు అనుగుణంగానే డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్ ఆడిట్ ఫలితాలు వచ్చాయి.  అవసరమైన ఆడిట్ సాక్ష్యాధారాలను  పొందలేకపోయామని డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్ ఆడిటర్స్ డెలాయిట్ హాస్కిన్ అండ్ సెల్స్, ముంబైకి చెందిన చతుర్వేది అండ్ షా రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో చెప్పాయి. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్ అన్‌‌సెక్యూర్డ్ రుణాల జారీ విషయంలో చాలా లోపాలున్నాయని పేర్కొన్నాయి. పలు రుణాల జారీ విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని రాయిటర్స్ కూడా రిపోర్ట్ చేసింది. వీటి విషయాల్లో సరియైన సమాచారం లేదా వివరణ ఇవ్వడంలో డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్ విఫలమైందని ఆడిటర్లు తెలిపారు. దేశంలో అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌కు లక్ష కోట్ల రూపాయల రుణం ఉంది. ఐఎల్‌‌ అండ్ ఎఫ్‌‌ఎస్ సంక్షోభం వెలుగులోకి రావడంతో, పెద్ద పెద్ద ఎన్‌‌బీఎఫ్‌‌సీలు తీవ్ర లిక్విడిటీ కొరతను ఎదుర్కొంటున్నాయి.

Latest Updates