అప్పుల ఊబిలో డీఎఫ్ హెచ్ ఎల్..ప్రొవిజినింగ్ లో రూ.38 వేల కోట్లు..!

న్యూఢిల్లీ:  అప్పుల ఊబిలో కూరుకుపోయిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్) బోర్డును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌‌ ఇండియా రద్దు చేయడం తెలిసిందే. చట్ట ప్రకారం కంపెనీపై దివాలా ప్రక్రియను త్వరలోనే ప్రారంభించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇక్కడితో కథ ముగిసిపోలేదు. దీనికి అప్పులు ఇచ్చిన బ్యాంకులకు అసలైన ప్రమాదం పొంచి ఉంది. లోన్లన్నింటినీ రైటాఫ్​ చేయాల్సిన ప్రమాదం ఏర్పడింది. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌కు ఇచ్చిన అప్పుల్లో మోసం(లోన్​ ఫ్రాడ్​) జరిగిందని తేలితే వాటికి ప్రొవిజన్‌‌ చేయాల్సిందిగా ఆర్‌‌బీఐ బ్యాంకులను ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. అంటే రూ.38 వేల కోట్లకు ప్రొవిజనింగ్‌‌ చేయాలి! అంతర్జాతీయ అకౌంటింగ్‌‌ కంపెనీ కేపీఎంజీ డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ లోన్లపై ఇచ్చే రిపోర్టు ఆధారంగా ఆర్‌‌బీఐ తదుపరి చర్యలు తీసుకోనుంది. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌లో అవకతవకలపై కేపీఎంజీ ఇది వరకే మధ్యంతర రిపోర్టు ఇచ్చింది. కంపెనీ ఫౌండర్‌‌ కంపెనీలకు డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ రూ.16,500 కోట్ల లోన్లు ఇవ్వడంతో అక్రమాలు జరిగాయని తెలిపింది. ఈ ఎన్‌‌బీఎఫ్‌‌సీ బ్యాంకుల నుంచి రూ.38 వేల కోట్ల లోన్లు తీసుకోగా, ప్రమోటర్​ కంపెనీలకే రూ.16 వేల కోట్లు ఇవ్వడం గమనార్హం. ‘‘డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ ఖాతాను ఫ్రాడ్‌‌ అకౌంట్‌‌గా ఆర్‌‌బీఐ గుర్తిస్తే బ్యాంకులకు సమస్యలు తప్పవు. వేల కోట్ల రూపాయలను ప్రొవిజనింగ్‌‌కు కేటాయించాలి. ఇదే జరిగితే బ్యాంకుల లాభాలు మరింత తగ్గుతాయి’’ అని కేర్‌‌ రేటింగ్స్ లిమిటెడ్‌‌ సీనియర్‌‌ ఆఫీసర్‌‌ మితుల్‌‌ బుధ్‌‌భట్టి అన్నారు.

మొండిబాకీలతో సతమతం

మనదేశంలోని బ్యాంకుల మొండిబాకీల విలువ 130 బిలియన్ డాలర్లు కాగా, డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ బాకీలను రద్దు చేస్తే ఇవి 135 బిలియన్‌‌ డాలర్లకు చేరుతాయి. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ అక్రమంగా లోన్లు ఇవ్వలేదని కేపీఎంజీ తేల్చితే మాత్రం బ్యాంకులపై కేవలం రూ.5,500 కోట్ల భారం పడుతుందని మితుల్‌‌ అన్నారు.  కంపెనీ ట్రాన్సాక్షన్లలో మోసాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో అప్పు పుట్టడం కష్టమై, డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ తన లోన్ల బకాయిలను చెల్లించలేకపోయింది. ఈ ఏడాదిలో ఈ కంపెనీ షేర్లు 90 శాతం పతనమయ్యాయి. అప్పులను పరిష్కరించే ప్లాన్‌‌పై చర్చించేందుకు యూనియన్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్ ఇండియా నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ కేసు దివాలా కోర్టుకు వెళ్లగానే, ఈ ప్లాన్‌‌ను రిజల్యూషన్‌‌ ప్రొఫెషనల్‌‌ పరిశీలిస్తాడు. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ తన నిధులన్నింటినీ షెల్‌‌ కంపెనీలకు తరలించిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో కోబ్రాపోస్టు వెబ్‌‌సైట్‌‌ ఆరోపించింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకులు, డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ లెక్కలను పరిశీలించే బాధ్యతను కేపీఎంజీకి అప్పగించాయి. ఈ కంపెనీ 2015 ఏప్రిల్‌‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు జారీ చేసిన లోన్లను పరిశీలించింది. పరస్పర సంబంధం ఉన్న కంపెనీలకు ఇది రూ.19,750 కోట్ల విలువైన లోన్లను, అడ్వాన్సులను ఇచ్చిందని వెల్లడించింది. వీటిలో ప్రమోటర్ల కంపెనీలే ఎక్కువని తెలిపింది. నిధుల కేటాయింపులను లోతుగా పరిశీలించడానికి అవసరమైన ట్రాకింగ్‌‌ మెకానిజాన్ని డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ తమకు అందించలేదని విమర్శించింది. లోన్లు తీసుకున్న ప్రమోటర్ల కంపెనీలు పెద్దగా వ్యాపారం ఏమీ చేయడం లేదని వెల్లడించింది. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ నిర్ణయాలు కంపెనీ చట్టం ప్రకారమే తీసుకున్నారా లేదా అనే విషయాన్ని తేల్చడానికి మరింత లోతుగా దర్యాప్తు చేయడం అవసరమని స్పష్టం చేసింది. అయితే మొత్తం లోన్లకు కాకుండా, మోసపూరిత ఖాతాలని తేలిన వాటికి మాత్రమే ప్రొవిజనింగ్‌‌ చేసేలా మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులు ఆర్‌‌బీఐని కోరే అవకాశాలు ఉన్నాయి.

Latest Updates