వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తున్న ధోనీ

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మరోసారి నిర్మాతగా అవతారం ఎత్తనున్నాడు. గతేడాది ఓ డాక్యుమెంటరీని నిర్మించి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతను ఈసారి వెబ్‌ సిరీస్‌ను ఎంచుకున్నాడు. ‘పౌరాణిక సైన్స్‌ ఫిక్షన్‌’ కథతో సాగే ఈ సిరీస్‌లో అఘోరిల రహస్య జీవితం గురించి ఉంటుంది. ఇంతవరకు ప్రచురితం కాని ఓ పుస్తకం ఆధారంగా దీనిని నిర్మిస్తున్నామని ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌, మీడియా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాక్షి ధోనీ వెల్లడించింది. ఈ సిరీస్‌ మొత్తం థ్రిల్లింగ్‌ అడ్వెంచర్‌గా ఉంటుందని చెప్పింది. ‘ఈ బుక్‌ కంప్లీట్‌గా పౌరాణిక సైన్స్‌ ఫిక్షన్‌తో ఉంది.

హైటెక్‌ ఫెసిలిటీల మధ్య పట్టుబడిన ఓ అఘోరి అంతుచిక్కని జీవిత రహస్యాలు ఇందులో ఉంటాయి. ఈ అఘోరి వెల్లడించే రహస్యాలు.. పురాతన పురాణాలను, ఇప్పటికే ఉన్న, రాబోయే రోజుల్లోని నమ్మకాలను మార్చగలవు.  విశ్వంలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రతి పాత్రను చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఇది సినిమా కంటే వెబ్‌ సిరీస్‌గానే బాగుంటుంది’ అని సాక్షి పేర్కొంది. ఈ సిరీస్‌కు సంబంధించిన కాస్ట్‌, లొకేషన్‌ను ఎంపిక చేసే పనిని నిర్వాహకులు ఇప్పటికే మొదలుపెట్టారు. 2019లో కబీర్‌ ఖాన్‌ డైరెక్షన్‌లో ‘రోర్‌ ఆఫ్‌ ద లయన్‌’ పేరుతో మహీ డాక్యుమెంటరీ నిర్మించాడు.

Latest Updates