కడక్ నాథ్ కోళ్ల బిజినెస్ పెట్టనున్న ధోని

రాంచీ: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన క్రికెటర్ ధోని..  బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నాడు. తనకిష్టమైన వ్యవసాయంతోపాటు.. ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను పెట్టబోతున్నట్లు సమాచారం. తన 40 ఎకరాల ఫామ్ హౌస్ లో 2 వేలకు పైగా కడఖ్ నాథ్ కోళ్లను పెంచేందుకు ఏర్పాట్లు చేశాడని సమాచారం. తాండ్లకు చెందిన ఓ రైతుకు 2 వేల కడక్ నాథ్ కోడి పిల్లలు కావాలని ఆర్డర్ ఇవ్వడంతో థోనీ అప్ కమింగ్ బిజినెస్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. రాంచీలో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. తీరిక దొరికినప్పుడల్లా ఫామ్ హౌస్ లోనే కుటుంబంతో గడిపే ధోని.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఐపీఎల్ లో  చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేలోపు..  తనకిష్టమైన వ్యాపకాలతోనే బిజీగా ఉండేందుకు ఇప్పటికే ఫామ్ హౌస్ లో చేపలు.. బాతులు పెంచుతున్నాడు. వీటితోపాటు మంచి పోషక విలువలుండే ఖరీదైన కడక్ నాథ్ కోళ్లను పెంచడంపై దృష్టి సారించారు.

జాబువాలోని కడక్ నాథ్ ముర్గా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఐఎస్ తోమర్ ను ధోనీ సంప్రదించగా ఆయన చేతులెత్తేశాడు. ఒక్కసారి రెండు వేల కడక్ నాథ్ కోడి పిల్లలు.. లేదా కోళ్లు దొరకడం ఇప్పుడు కష్టంగా ఉందని చెప్పాడు. అయితే తనకు తెలిసిన ఓ రైతు ఫోన్ నెంబర్ ఇవ్వడంతో.. తండ్లాలోని రైతును ధోనీ సంప్రదించాడు. కడక్ నాథ్ కోళ్లకు మంచి గిరాకీ ఉండడంతో ఫుల్ డిమాండ్ ఉంది. అడిగింది మన క్రికెటర్ కావడంతో నెలాఖరులోగా ధోనీకి 2 వేల కడక్ నాథ్ కోడి పిల్లలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు సదరు రైతు.

నల్లగా ఉండే కడక్ నాథ్ కోడిలో ఔషధ గుణాలెక్కువ. ఎక్కువ ప్రొటీన్ తోపాటు.. తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందట. అందుకే ధర చాలా ఎక్కువ. కిలో 700 నుండి 1500 వరకు పలుకుతుంది. కరోనా ప్రభావంతో బలవర్ధకమైన ఆహారంతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్న అవగాహన ప్రజల్లో పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కడక్ నాథ్ కోళ్లకు మంచి డిమాండ్ ఉంటుందని ధోనీ ఆర్గానిక్ పౌల్ట్రీని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Latest Updates