ధోనీకి చాన్సుండదని ముందే ఊహించా : గంగూలీ

న్యూఢిల్లీ : సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ధోనీని ఎంపిక చేయరని తాను ముందే ఊహించానని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. రిషబ్‌ పంత్‌కు మరిన్ని అవకాశాలిచ్చి రాటుదేల్చాల్సిన అవసరముందన్నాడు. ధోనీ యువకుడుగా ఉన్నప్పుడు జట్టు అతని నుంచి ఏం ఆశించిందో ఇప్పుడు పంత్‌ నుంచి కూడా అదే కోరుకుంటుందని చెప్పాడు. ధోనీకి ప్లేస్‌ విషయంలో కోహ్లీ పాత్ర కీలకమన్నాడు. తన నుంచి ఏం ఆశిస్తున్నామో ధోనీకి చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్‌పైనే ఉందన్నాడు.

రిటైర్మెంట్‌ నిర్ణయంలో ఏ అథ్లెట్​కైనా ఇబ్బందులు తప్పవన్న దాదా.. ఈ విషయంలో సచిన్‌, మారడోనా, ధోనీ ఎవరైనా ఒకటే అన్నాడు. ఒక వేళ జట్టు కోరుకుంటే ధోనీ ఆడతాడని, అందుకు సెలెక్టర్ల అండ కూడా ఉండాలన్నాడు. ధోనీని పంత్‌ను ఎట్టి పరిస్థితుల్లో పోల్చలేమని,  ఇండియన్‌ క్రికెట్‌లో మహీ చాలా స్పెషల్‌ అని గంగూలీ చెప్పాడు. 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సాధించిన తర్వాత ధోనీ ఒక బ్రాండ్‌ అయ్యాడని తెలిపాడు. వయసు సంగతి ఎలా ఉన్నా సాహా అవకాశం కోసం మరికొంత కాలం ఎదురుచూడక తప్పదన్నాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ విషయంలో తప్ప కెప్టెన్‌గా కోహ్లీ రోజురోజుకి పరిణితి సాధిస్తున్నాడని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

Latest Updates