రాష్ట్రంలో నిలిచిపోయిన డయాలసిస్ సేవలు!

  • రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిలిచిపోయిన సర్వీసులు
  • ఆరు నెలలుగా ఫండ్స్ ఇస్తలే.. ఆగిన ఎక్విప్​మెంట్ సరఫరా
  • జీతాలు ఇవ్వకపోవడంతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిరసన
  • పలు చోట్ల డయాలసిస్ సెంటర్ల మూత.. రోగుల ఇక్కట్లు
  • వేల రూపాయలు పోసి ప్రైవేట్​కు వెళ్లలేమంటున్న బాధితులు

సూర్యాపేట, వెలుగు: రాష్ట్రంలో పలు గవర్నమెంట్ హాస్పిటళ్లలో సోమవారం డయాలసిస్ సర్వీసులు నిలిచిపోయాయి. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఆందోళనలకు దిగారు. వెంటనే జీతాలు ఇవ్వాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తామని ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చారు. సిబ్బంది ఆందోళనలతో చాలా చోట్ల డయాలసిస్ సెంటర్లు మూతబడ్డాయి. దీంతో రెగ్యులర్​గా డయాలసిస్ చేయించుకునే రోగులు
అవస్థలు పడ్డారు.ఆరోగ్యశ్రీలో భాగంగా కిడ్నీ పేషెంట్లకు ఫ్రీగా డయాలసిస్ సేవలను అందించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 40 సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతలను డీమ్యాడ్, నిప్రో కంపెనీలకు అప్పగించింది. ఈ ఏజెన్సీలు ఒక్కో సెంటర్​లో ల్యాబ్ టెక్నీషియన్లు, హౌస్​కీపింగ్ స్టాఫ్, వార్డ్ ఇన్​చార్జి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కలిపి మొత్తం 10 నుంచి15 మంది దాకా నియమించుకున్నాయి. ఒక్కో సెంటర్​లో రోజుకు 20 నుంచి 25 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నాయి. ఇందుకుగాను ప్రభుత్వం ఒక్కో డయాలసిస్‍కు రూ.1,375 చొప్పున చెల్లించాలి. కానీ ఈ సెంటర్ల నిర్వహణ చూస్తున్న థర్డ్ పార్టీ ఏజెన్సీలకు గత ఆగస్టు నుంచి ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రెండు సెంటర్లకు ఇప్పటివరకు రూ.2 కోట్ల వరకు బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి.

ఎక్విప్ మెంట్ కరువు

ప్రభుత్వ రూల్స్ ప్రకారం డయాలైజర్, బ్లడ్ ట్యూబింగ్స్, ఏవీ ఫిస్తులా, ప్రొటెక్టర్లను ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. వీటిని ప్రభుత్వం కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా అందిస్తుంది. అయితే నెల రోజుల నుంచి ఇవి సప్లై కావడం లేదు. స్టాక్ ఉన్న సెంటర్ల నుంచి మిగతా వారు తెప్పించుకుని వాడుతున్నారు. డయాలసిస్ సెంటర్లలో గత 10 రోజులుగా స్టాక్ లేకపోవడంతో పేషెంట్లు బయట  కొనుక్కొని తెచ్చుకుంటున్నారు.

మూడు నెలలుగా..

సూర్యాపేట జిల్లాలోని రెండు సెంటర్లలో పని చేస్తున్న 18 మంది స్టాఫ్.. డయాలసిస్ సేవలు నిలిపివేశారు. పదేండ్ల నుంచి పని చేస్తున్నా.. ఏజెన్సీ రూ.10 వేల జీతం మాత్రమే ఇస్తోందని, అది కూడా టైమ్​కు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డయాలసిస్ సెంటర్లలో ఒక్క పర్మినెంట్ టెక్నీషియన్ కూడా లేడని, ఔట్ సౌర్సింగ్ ఎంప్లాయిస్​ను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మెరుపు సమ్మెతో రోజంతా డయాలసిస్ పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. ఆఫీసర్లు సర్దిచెప్పడంతో సాయంత్రం తిరిగి సేవలు ప్రారంభించారు.

గద్వాలలో స్టాఫ్ అరగంటపాటు నిరసనలు తెలిపారు. పేషెంట్ల ఇబ్బందులు చూడలేక తిరిగి డ్యూటీ చేశారు.

కరీంనగర్ డయాలసిస్ సెంటర్​ను నిర్వహిస్తున్న డీమెడ్ కంపెనీకి నాలుగు నెలలుగా బిల్లులు రాలేదు. తమకు దాదాపు రూ.48 లక్షలు బకాయిలు రావాల్సి ఉందని ఏజెన్సీ చెబుతోంది. సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. ఇక్కడ పని చేస్తున్న 12 మంది కూడా సమ్మెకు రెడీ అవుతున్నారు.

మంచిర్యాలలో 13 మంది పని చేస్తున్నారు. వీరికి రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదు. వచ్చేనెల కూడా జీతాలు రాకుంటే జాబ్స్ మానేస్తామని చెబుతున్నారు.

మహబూబ్​నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదు. వారికి నచ్చజెపుతూ పనులు చేయిస్తున్నామని ఆఫీసర్లు చెప్తున్నారు.

ఆదిలాబాద్​లోని రిమ్స్ డయాలిసిస్ సెంటర్ కు ప్రతి నెలా రూ.10 లక్షలు రావాలి. కానీ ఆరు నెలలుగా బడ్జెట్ రావడం లేదు. గత నెల నుంచి అత్యవసర పేషెంట్లకు మాత్రమే డయాలసిస్ చేస్తున్నారు. మరో పది రోజుల్లో బకాయిలు రాకుంటే మెయింటెనెన్స్ కష్టమని అంటున్నారు.

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోని డయాలసిస్ స్టాఫ్​కు రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదు. సోమవారం ఆందోళన చేపట్టిన స్టాఫ్ వెంటనే శాలరీలు ఇవ్వాలంటూ  ఆస్పత్రి సూపరింటెండెంట్‍కు వినతిపత్రం అందజేశారు.

సిద్దిపేట డయాలసిస్ సెంటర్ లో పని చేస్తున్న పది మంది సిబ్బందికి మూడు నెలలుగా శాలరీలు రావడంలేదు. వారు సోమవారం రెండు గంటలపాటు సేవలను నిలిపివేశారు. మెడికల్ ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో డయాలసిస్ ప్రారంభించారు.

రెంట్ కట్టలేకపోతున్నం

కరోనా టైమ్​లో రోజుకు 24 గంటలు డయాలసిస్ చేశాం. ప్రభుత్వం ఆరు నెలల నుంచి బిల్లులను రిలీజ్ చేయలేదని, మూడు నెలలుగా కంపెనీ జీతాలు ఇవ్వడం లేదు. చాలీచాలని జీతాలతో ఇంటి రెంట్ కట్టలేకపోతున్నాం. ప్రభుత్వం సమయానికి బిల్లులను ఇవ్వాలి.

భాను ప్రసాద్, డయాలసిస్ టెక్నీషియన్, సూర్యాపేట

40 కిలోమీటర్ల నుంచి వచ్చినం

ఒక్కరోజు డయాలసిస్ చేయకున్నా మాకు ప్రమాదమే. బయట చేయించుకునే స్థోమత లేదు. అవస్థలు పడుతూ 40 కిలోమీటర్ల నుంచి వచ్చాం. ఇట్లా సర్వీసులు బంద్​ చేస్తే ఎట్లా. ప్రభుత్వం పట్టించుకోవాలి.

వెంకన్న, తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా

For More News.

వ్యాక్సిన్​కు జనాలు ముందుకొస్తలే

కొడుకును తర్వాత సీఎం చేసుకో ముందు.. ఇచ్చిన హామీలు నెరవేర్చు

Latest Updates