టెస్టు క్రికెట్ అంటేనే రొమాన్స్..

ముంబై: ‘డైపర్‌‌ అయినా, ఐదు రోజుల టెస్టునైనా.. ఇక పనికిరావు అన్నప్పుడే మార్చాలి..  పున్నమి చంద్రుడు నాలుగు రోజులు ఉంటాడు కానీ టెస్ట్‌‌ మ్యాచ్‌‌ ఉండదు.. నీళ్లలో ఉన్నంతసేపే చేప బతికి ఉంటుంది. బయటకు తీస్తే చచ్చిపోతుంది’  ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్ట్‌‌లను ఉద్దేశించి టీమిండియా మాజీ ఓపెనర్‌‌ వీరేంద్ర సెహ్వాగ్‌‌ చేసిన వ్యాఖ్యలివి. విషయం ఏదైనా సరే తన మార్కు వ్యంగ్యంతో అభిప్రాయాన్ని వెల్లడించడం సెహ్వాగ్‌‌కు అలవాటు. ఆదివారం జరిగిన బీసీసీఐ అవార్డ్స్‌‌ కార్యక్రమంలో  మన్సూర్‌‌ అలీ ఖాన్‌‌ పటౌడీ  స్మారక ఉపన్యాసం చేసిన వీరూ నాలుగు రోజుల టెస్ట్‌‌లపై వ్యంగ్యాస్త్రాలు వేశాడు.

‘టెస్ట్‌‌ క్రికెట్‌‌ను చందమామ దగ్గరకు తీసుకెళ్లాలి. అందుకే మనకు డే నైట్‌‌ టెస్టులున్నాయి. డే నైట్‌‌ టెస్ట్‌‌ ఉంటే ఆఫీసులయ్యాక చాలా మంది అభిమానులు స్టేడియంకు వచ్చే చాన్సుంది.  నేనెప్పుడూ మార్పును స్వాగతిస్తాను. అలాగని ఆటను నాలుగు రోజులకు కుదించడం కరెక్టు కాదు.  ఐదు రోజుల ఆటలో ఓ రొమాన్స్‌‌ ఉంటుంది. బ్యాట్స్‌‌మన్‌‌ను బుట్టలో వేసుకునేందుకు  ఫీల్డర్లను సెట్‌‌ చేసి బౌలర్‌‌ చాలా ట్రై చేస్తాడు. భారీ ఇన్నింగ్స్‌‌ ఆడి బ్యాట్స్‌‌మన్‌‌ పైచేయి కోసం ప్రయత్నిస్తాడు. ప్రేయసి అంగీకారం కోసం ఎదురుచూసే ప్రియుడిలా.. స్లిప్‌‌ ఫీల్డర్‌‌ క్యాచ్‌‌ కోసం గంటల తరబడి ఎదురుచూస్తుంటాడు.  జెర్సీలపై నంబర్‌‌లు లాంటి మార్పులైతే ఓకే. కానీ ఇక ఉపయోగం లేదు అనేదాకా డైపర్‌‌ను, ఐదు రోజుల ఫార్మాట్‌‌ను మార్చకూడదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న ఫార్మాట్‌‌ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు.  ఫార్మాట్‌‌ వయస్సు 142 ఏళ్లు అయినప్పటికీ,  అది ప్రస్తుత టీమిండియా అంత బలంగా ఉంది. టెస్ట్‌‌ క్రికెట్‌‌కు ఓ ఆత్మ ఉంది. దాని వయసును ఎప్పటికీ తగ్గించకూడదు.  గత ఐదేళ్లలో 223 టెస్టులు జరిగితే అందులో 31 మ్యాచ్‌‌లు డ్రా అయ్యాయి. అంటే 13 శాతం. ఇది మన జీడీపీ కంటే ఎక్కువ’ అని సెహ్వాగ్‌‌ చెప్పుకొచ్చాడు.  స్టంప్‌‌ మైక్‌‌లను తీసేయాలని పలువురు ప్లేయర్లు చేస్తున్న డిమాండ్‌‌ సరికాదని  వీరూ అన్నాడు.  అసభ్య పదజాలం లేకుండా కవ్వింపు ఉంటేనే టెస్ట్‌‌ క్రికెట్‌‌లో ఆసక్తి ఉంటుందని చెప్పాడు.

భారతంలో శ్రీకృష్ణుడు.. పటౌడీ

మన్సూర్‌‌ అలీఖాన్‌‌ పటౌడీ మహాభారతంలో శ్రీకృష్ణుడి లాంటి వాడని సెహ్వాగ్‌‌ అన్నాడు.‘సాధారణంగా నేను ఎవ్వరి నుంచి సలహాలు తీసుకోను. కానీ 2005–06లో  ఫస్ట్‌‌ టైమ్‌‌ పటౌడీని కలిసినప్పుడు నా ఆటను ఎలా మెరుగుపర్చుకోవాలో అడిగా. ఆయనిచ్చిన సలహాతోనే టెస్ట్‌‌ల్లో చాలా రన్స్​ చేశా. పటౌడీని ఎవరితోనైనా పోల్చమంటే.. భారతంలో శ్రీకృష్ణుడు అని చెబుతా. కృష్ణుడు లేకపోతే పాండవులు గెలిచేవారు కాదు. పటౌడీ కెప్టెన్సీలోని ఇండియా ఫారిన్​లో తొలి మ్యాచ్‌‌ గెలవడం వల్లే.. టెస్టు ఆడే విధానం మారింది’ అని అన్నాడు.

Latest Updates