టీనేజర్ల చేతుల్లో సిగరెట్ కనిపించిందా.. అయితే ఏం చేయాలంటే..

విషపు పడగ నీడ

ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ డ్రగ్స్. బాలీవుడ్ నటులంతా దాదాపు ఈ వలలో ఉన్నారని చెబుతున్నారు. ఓ మూడేళ్ల కింద టాలీవుడ్ లోనూ ఇదే కలకలం రేగింది. అయితే డ్రగ్స్ అనగానే అదేదో మనకు సంబంధించని వ్యవహారం అనీ మన పిల్లలదాకా అది చేరదు అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే.

సిగరెట్ ఒక టీనేజర్ చేతిలో ఉంటేనే బాధపడే మనం చాలా సింపుల్ గా అతని చేతిలోకి వీడ్ దట్టించిన సిగరెట్ చేరుతోంది అని తెలుసుకుంటే మాత్రం కాస్త భయపడాల్సిందే. ఒక్కసారి మనం సేఫ్ గానే ఉన్నాం అన్న భ్రమల్లోంచి బయటికి వస్తే గంజాయి అనే మత్తు మందు పిల్లల చేతుల్లోకి కూడా వస్తోందన్న చేదు నిజాన్ని అంగీకరించక తప్పదు.

డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా చైతన్యం కలిగిస్తున్నా మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయి భూతం యువతను పట్టి పీడిస్తోంది. స్టూడెంట్లు జీవితాలను మత్తులో ముంచేస్తోంది. తెలుగు రాష్ట్రాలలోని అడవి ప్రాంతాలు, అంతర రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో గంజాయి మాఫియా బలంగానే ఉంది.  మెట్రో పాలిటన్ సిటీస్ వరకే పరిమితమైందనుకున్న డ్రగ్స్ మాఫియా  ఇప్పుడు తన వికృత వ్యాపారాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ఆ మాఫియానో, డ్రగ్స్ దందానో మనం ఆపలేం కానీ. మన పిల్లలని కాపాడుకోవటంలో మాత్రం శ్రద్ద తీసుకోవాల్సింది మనమే.

నిర్లక్ష్యం వద్దు…

‘మన పిల్లలు అలా కాదులే’ అని నిర్లక్ష్యం వద్దు. అలా అని వాళ్లకి అర్థమయ్యేంతగా ఏదో నిఘా కూడా పెట్టొద్దు కానీ. పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులని మాత్రం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని చెబుతున్నారు. చుట్టూ ఉన్న సొసైటీ ప్రభావం కావచ్చు, ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, ‘ఒక్కసారి ట్రైచేసి చూద్దాం’ అన్న సరదా కావచ్చు, వాళ్లలో ఉండే ఒత్తిడి కావచ్చు కారణం ఏదైనా పిల్లలు మాత్రం గంజాయి అమ్మే ముఠాలకు టార్గెట్ అవుతున్నారు. అందుకే పిల్లల్లో వచ్చే చిన్న మార్పులని గమనిస్తూ ఉండాలి. మామూలుగా ఇలాంటి అలవాట్లలో ఉన్న టీనేజర్లని వాళ్ల బిహేవియర్ లో వచ్చిన కొన్ని మార్పులని బట్టి తెలుసుకోవచ్చు…

ఎలా మానిపించాలి?

నిజానికి చాలామంది టీనేజర్స్, జాబ్స్ లో ఉన్న వ్యక్తులూ అది చెడ్డ అలవాటు అన్న అవగాహనతోనే ఉంటారు. లోపల మానేయాలని ఉన్నా ఎలా మానేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోతారు.అందుకే అలాంటి లక్షణాలని గమనిస్తే వాళ్లమీద అరవటం, కోప్పడటం కాకుండా ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. మత్తు పదార్థాలకి బానిస కావటం అనేది కూడా ఒక మానసిక సమస్య అని అర్థం చేసుకోవాలి. వాళ్లని నేరస్తులుగా కాకుండా బాధితులుగానే చూడాలి. గంజాయి, కొకైన్వంటి మత్తుపదార్థాలను సైకో ట్రోఫిక్డ్రగ్స్అని పిలుస్తారు. వీటి వాడకంతో మైండ్లో ఒక రకమైన కిక్వస్తుంది. బ్రెయిన్పై ఈ డ్రగ్స్ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీడ్ కి అలవాటు పడ్డ వారు త్వరగా మానుకోలేరు.

అలవాటుగా మారితే సిగరెట్, ఆల్కహాల్లాగా చిట్కాలతో మానిపించడం సాధ్యం కాని పని అని దాక్టర్లు చెప్తున్న మాట. కౌన్సెలింగ్ సెంటర్ కి తీసుకుపోవటం తప్ప ఇప్పటికైతే ఇంకో మార్గం లేదు.

ఇలా తెలుసుకోవచ్చు

వీడ్ (గంజాయి)తో సాధారణంగా ఈ అలవాటు మొదలవుతుంది. దీనికి అలవాటు పడ్డవాళ్ల కళ్లు కాస్త ఎరుపురంగులో కనిపిస్తూ ఉంటాయి.

ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు.

గంటల తరబడి ఒంటరిగా ఉండడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవటం ఉంటుంది.

ఏ పనిలోనూ యాక్టివ్ గా ఉండరు.

మాట్లాడే మాటలలో తేడాగా, కాస్తంత తడబడుతూ ఉంటారు. శుభ్రతను ఎక్కువగా పట్టించుకోక మాసిన దుస్తులతో తిరుగుతుంటారు.

ఉన్నట్టుండీ ఖర్చులు పెరిగిపోతాయి. డబ్బులు కోసం పదేపదే అడుగుతుంటారు తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తుంటారు. ఏదో ఒక అబద్దం చెప్పి ఎలాగైనా ఇప్పటికిప్పుడు డబ్బు కావాలి అన్నట్టు ప్రవర్తిస్తారు.

అనవసరంగా కోపం తెచ్చుకుంటూ అసహనంగా ఉంటారు. రెగ్యులర్ గా ఇంటికి లేట్ గా రావటం, వచ్చిన వెంటనే ఎవ్వరితోనూ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి నిద్రపోవటం చేస్తారు.

ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేస్తారు. అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్తారు.

ఇప్పుడు మళ్ళీ అంతా ఓకే

కాలేజ్ లో ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి ట్రై చేసాను. తర్వాత ముట్టుకోవాలంటే భయం ఉండేది. జాబ్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి కొట్టేవాడ్ని. 2010 లో జాబ్ లో ఇబ్బందులు, లైఫ్ లో కొద్దిగా ఒత్తిడి వల్ల. అలవాటైపోయింది. మూడేళ్లపాటు రోజుకి నాలుగు అయిదు సార్లు సిగరెట్లో కలిపి పీల్చేవాడిని. తర్వాత భయమేసింది. చాలా కష్టపడ్దాను. డాక్టర్ని కలిసాను. మొత్తానికి సంవత్సరం కష్టపడితేగానీ దాన్ని మానుకోలేక పోయాను. ఇప్పుడు మళ్ళీ అంతా ఓకే అయ్యింది. జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను.– రమేష్(పేరు మార్చాం), సినిమాటోగ్రాఫర్.

నాకు నేను గానే మానెయ్యగలిగాను

మందూ సిగరెట్ వేరు. వాటిని మానెయ్యకపోయినా అంత త్వరగా వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు కానీ. ఇది అలా కాదు. హోలీ, కృష్ణాష్టమి లాంటి పండగలకి భంగ్ తాగేవాళ్లం. అది పెద్ద నష్టం ఏమి కాదు. తర్వాత ఆల్కహాల్ మానేసే ప్రయత్నంలో దీనికి చిక్కాను. ఒకటీ రెండు సార్లు పోలీసులదాకా వెళ్లబోయి తప్పించుకున్నా. ఇంట్లో వాళ్లు దూరంగా ఉండటం వల్ల వాళ్లకి తెలియకుండా మేనేజ్ చేయగలిగాను. కానీ నాకే ఇది సరైంది కాదనిపించింది. నాకు నేను గానే మానెయ్యగలిగాను.– దీపక్ మెహతా (పేరు మార్చాం)  (డాక్టర్)

Latest Updates