సారు.. కారు.. 9: ఎందుకిలా..?

తెలంగాణలో లోక్ సభ ఫలితాలపై చాలా రకాలైన విశ్లేషణలు కొనసాగుతున్నాయి. కారు సారూ పదహార్ స్లోగన్ ఎదురుతిరిగింది. గెలుస్తామన్న పదహారులో కారు సగానికి పడిపోయింది.  బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు, ఎమ్ఐఎమ్ ఒక స్థానాలు కాగా.. ఓవరాల్ గా తొమ్మిది సీట్లల్లో పాగా వేయబోతోంది టీఆర్ఎస్.

ఈ ఫలితాల్ని పోస్ట్ మార్టమ్ చేస్తే.. కేసీఆర్ కు పెద్ద షాక్ గా భావిస్తున్నారు విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికల్లో  గెలుపు తర్వాత కేబినెట్ జోలికి పోకపోవడం ఓ మైనస్ అంటున్నారు. దాదాపు 40 రోజుల తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. గతంలో లాగానే ఈసారి కూడా కేబినెట్ లో మహిళలకు బెర్త్ దొరకలేదు.

పార్టీలకతీతంగా పరోక్షంగా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదార్లు భారీ స్థాయిలో గెలిచినప్పటికీ..స్థానిక ఎమ్మెల్సీ ఫలితాలు  టీఆర్ఎస్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాయి. రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు ఓడిపోయారు. గ్రాడ్యూయేషన్ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ బలపరిచిన జీవన్ రెడ్డి గెలిచారు. జగిత్యాలలో ఎమ్మెల్యే రేసులో ఓడిపోయిన జీవన్ రెడ్డి…ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటారు. ఇప్పుడు లోక్ సభ ఫలితాలు కూడా…ఎమ్మెల్సీ ఫలితాల్నే రిపీట్ చేశాయి.

అంతేకాదు పార్టీపరంగా జరుగుతున్న పరిషత్ పోరులోనూ టీఆర్ఎస్ కు దెబ్బ తగులుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎదురుగాలిని ముందే ఊహించి.. లోక్ సభ ఫలితాలకంటే ముందే పరిషత్ ఎన్నికలు పెట్టించినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ లో టీఆర్ఎస్ ఓటమికి కూడా అనేక కారణాలను చెబుతున్నారు విశ్లేషకులు. అది కవిత ఓటమి కాదు.. కేసీఆర్ ఓటమి అంటున్నారు.

Latest Updates