వంశాన్ని నిలబెట్టింది.. రిటైర్​ అయింది

ఈ తాబేలు పేరు డయిగో. వయసు వందేళ్లు. నిజానికైతే ఓ తాబేలు గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కానీ, డయిగో గురించి మాత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే అంతరించిపోతుందనుకున్న తన వంశాన్ని (జాతిని) నిలబెట్టింది మరి. ఒకప్పుడు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్న తన జాతిని, వందల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ‘అలసిపోయి’ తన డ్యూటీకి బైబై చెప్పేస్తోంది. హాయిగా రిటైర్​ అయ్యి తన సొంత గూటికి వెళ్లేందుకు రెడీ అయింది.

800 తాబేళ్లకు నాన్న

డయిగో.. షెలోనోయిడిస్​ హుడెన్సిస్​ అనే జాతికి చెందిన తాబేలు.ఈక్వెడార్​లోని అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ఉండే ఎస్పనోలా దీవులు వాటి సొంతిల్లు. కొన్నేళ్ల క్రితం వాటి సంఖ్య కేవలం 14. అందులో రెండు (డయిగోతో కలిపి) మగవి. మిగతా 12 ఆడవి.  అంతరించిపోయే దశలో ఉన్న ఆ తాబేళ్ల జాతిని ఎలాగైనా కాపాడాలన్న ఉద్దేశంతో 1930లో కాలిఫోర్నియాలోని శాన్​ డయిగో జూకు వాటిని తీసుకొచ్చారు.  ఆ తర్వాత బ్రీడింగ్​ ప్రోగ్రామ్​లో భాగంగా కాలిఫోర్నియా తీరంలోని శాంటాక్రూజ్​ ఐలాండ్​కు డయిగోతో పాటు వేరే జాతులకు చెందిన మరో 13 తాబేళ్లను తీసుకెళ్లారు. 1960లో మొదలైన బ్రీడింగ్​ ప్రోగ్రామ్​ ద్వారా 2 వేల పిల్లలు పుట్టాయి. అందులో 800 పిల్లలు ఒక్క డయిగో ద్వారానే పుట్టాయి. వందలకొద్దీ తాబేళ్లతో అది మేటింగ్​లో పాల్గొందని, అందుకే అన్ని వందల్లో పిల్లలు పుట్టాయని గాలపాగోస్​ నేషనల్​ పార్క్​ అధికారులు చెబుతున్నారు. ఇక, మార్చిలో దానిని మళ్లీ తన సొంతగూటికి పంపుతున్నామని పార్క్​ డైరెక్టర్​ జార్జ్​ కారియన్​ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాటి సంఖ్య 5 వేలకు చేరువలో ఉందంటున్నారు.

Latest Updates