మైండ్ డైట్​తో మెదడు సేఫ్

మనకు రకరకాల డైట్‌‌‌‌ల గురించి తెలుసు కానీ రెండు డైట్‌‌ల కాంబినేషన్‌‌తో ఒక డైట్ ఉందని తెలుసా?

ఎప్పటినుంచో పాపులర్ డైట్స్ అయిన మెడిటర్రేనియన్ డైట్, డాష్ డైట్‌‌ల కాంబినేషన్‌‌లో ‘మైండ్’ అనే కొత్తరకం డైట్ ఉంది. మైండ్ డైట్ అంటే ‘మెడిటర్రేనియన్ డాష్ డైట్’ అని అర్థం. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటి?

మైండ్ డైట్ ముఖ్యంగా వయసు పైబడుతున్నవాళ్లకు బాగా ఉపయోగపడుతుంది. వయసు పైబడిన తర్వాత అల్జీమర్స్ లేదా డిమెన్షియా లాంటి వ్యాధులు వస్తే.. ఆలోచనా శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. రోజువారీ పనులు కూడా సరిగ్గా చేసుకోలేరు. ఈ వ్యాధులు మరీ ముదిరితే చివరికి తమను తాము మర్చిపోయే ప్రమాదముంది. అయితే మైండ్ డైట్.. అల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉండేందుకు బాగా సాయపడుతుంది. ఒక రీసెర్చ్ ప్రకారం మైండ్ డైట్.. అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని 53 శాతం వరకు తగ్గిస్తుందని తేలింది. అలాగే మైండ్ డైట్ పాటించేవాళ్లలో అల్జీమర్స్ వ్యాధి తీవ్రత మూడో వంతుకు తగ్గిపోయినట్లు కూడా డాక్టర్ల పరిశోధనల్లో వెల్లడైంది.

రెండూ కలిస్తే..

మెడిటర్రేనియన్ డైట్, డాష్ డైట్‌‌ను కలిపితే మైండ్ డైట్ అంటారు. మెడిటర్రేనియన్ డైట్‌‌లో బాగా ఉడికించడం, డీప్ ఫ్రై చేయడం, నూనెల్లో బాగా వేగించడం, కొవ్వు పదార్థాలు ఉపయోగించడం లాంటివి ఉండవు. మెడిటర్రేనియన్ ఫుడ్‌‌లో పప్పు ధాన్యాల వాడకం ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ కొలెస్టరాల్‌‌కు దారితీసే శాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌‌కు బదులు మోనో అన్‌‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, ఫిష్, లీన్ మీట్, ఆలివ్ ఆయిల్, ఫైబర్ రిచ్ ఇంగ్రెడియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్​ను ఈ డైట్‌‌లో వాడతారు.

డాష్ డైట్ అంటే ‘‘డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్‌‌‌‌టెన్షన్’’. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ డైట్ లిస్ట్‌‌లో లోఫ్యాట్ డెయిరీ ప్రొడక్ట్స్, గ్రీన్ వెజిటబుల్స్, తాజా పండ్లు, హెల్దీ నట్స్- వంటివి గుండె ఆరోగ్యానికి మాత్రమే కాదు, బరువును కూడా తగ్గిస్తాయి. ఈ రెండు డైట్‌‌లు కలిస్తే వచ్చిందే మైండ్ డైట్. ఈ డైట్‌‌లో న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. స్ట్రెస్, డిప్రెషన్ నుంచి బయటపడడానికి, ముఖ్యంగా డిమెన్షియా, వయసుతో పాటు వచ్చే మెదడు సంబంధిత సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఈ డైట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ డైట్‌‌లో కూడా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. ఏవి తినాలో, ఏవి తినకూడదో తెలుసుకుని డైట్ పాటించాలి.

తినాల్సినవి ఇవే..

పచ్చని ఆకు కూరలు:

పచ్చని ఆకు కూరలలో ఫోలేట్, విటమిన్ బి9 ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు శక్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిలో విటమిన్–ఎ, విటమిన్–సి లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని వారానికి కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి.

క్రూసిఫెరస్ కూరగాయలు:

కాలీఫ్లవర్, బ్రొకొలీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ వంటి కూరగాయలలో ఫోలేట్, హోమోసిస్టిన్ స్థాయిని తగ్గించే కెరోటినాయిడ్లు ఉంటాయి. హోమోసిస్టిన్ అనే అమైనో యాసిడ్ జ్ఞాపక శక్తి బలహీనపడకుండా కాపాడుతుంది.

డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్.. మైండ్ డైట్‌‌లో ఉన్నప్పుడు తినాల్సిన చిరుతిళ్లు లాంటివి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌‌ను తగ్గించి, గుండె సమస్యలను తగ్గిస్తాయి. మైండ్ డైట్‌‌లో వారానికి కనీసం ఐదుసార్లైనా వీటిని తినాలి.

బెర్రీస్:

మెదడుకు హాని కలిగించే ఫ్రీరాడికల్స్ నుంచి బెర్రీస్ కాపాడతాయి. బెర్రీస్‌‌లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్–ఎ, విటమిన్–సి లు కూడా ఉంటాయి.

మైండ్ డైట్‌‌లో ఉన్నప్పుడు తినాల్సిన బెస్ట్ ఫ్రూట్స్ ఇవి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, చెర్రీస్‌‌కు మెదడును కాపాడే శక్తి ఉంటుంది. అందుకే వీటిని కనీసం వారానికి రెండుసార్లు తినాలి.

బీన్స్:

పీచుపదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే బీన్స్‌‌ను మైండ్‌‌డైట్‌‌లో తప్పనిసరిగా తీసుకోవాలి. బీన్స్‌‌లో ఉండే తక్కువ క్యాలరీలు, కొవ్వులు మెదడు పదునుగా ఉండటాన్ని ప్రోత్సహిస్తాయి. అల్జీమర్స్​ని నివారించాలంటే వీటిని కనీసం వారానికి మూడుసార్లు తినాలి.

తృణధాన్యాలు:

గోధుమలు, ఓట్స్, వరి లాంటివి మైండ్ డైట్‌‌లో ముఖ్యమైనవి. ఇవి తినడంవల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సమస్యలు, షుగర్ సమస్యలు తగ్గుతాయి.

కాఫీ,చాక్లెట్:

కాఫీ, చాక్లెట్లను అల్జీమర్స్ నివారణలో ఉపయోగించొచ్చని రీసెంట్ సర్వేలు చెప్తున్నాయి.

కాఫీ, కోకో పౌడర్‌‌‌‌ను దాల్చినచెక్క , ఆలివ్ ఆయిల్‌‌తో కలిపి తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి. వయసుతో పాటు వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే మైండ్ డైట్‌‌లో బట్టర్, చీజ్, రెడ్ మీట్, ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, పేస్ట్రీస్, కేక్స్, స్వీట్స్ లాంటివి అస్సలు తినకూడదు.

Latest Updates