ఇక్కడ ఎండ – అక్కడ వాన|గజిబిజి కాలం-బతుకులు ఆగం

అటు: పార్కులు మునిగిపోతున్నయ్​. మూగజీవాలు రోడ్డెక్కి జనావాసాల్లోకి దూసుకొస్తున్నయ్​. లక్షలాది మంది వేరే ప్రాంతాలకు తరలిపోతున్నరు. వరదల్లోచచ్చిపోతున్నరు. ఇదీ ఇప్పుడు ఈశాన్య, ఉత్తర భారతంలో పరిస్థితి. కారణం, కాలం, వాతావరణంలో మార్పులు. అవి, మనిషి బతుకును గందరగోళంలోకి నెట్టేస్తున్నయ్​. నీలి నీడలు కమ్మేలా చేస్తున్నయ్​.

ఇటు: మొన్నమొన్నటిదాకా బయటికెళ్తే చాలు ఎండలు మంట పుట్టించాయి. గొంతెండి జనం గోస పడ్డరు. కిలోమీటర్ల దూరం వెళ్లినా బిందె నీళ్లు దొరకడమే గగనమైంది. ఆఫీసులకు రావొద్దు.. ఇంటి కాడినుంచే డ్యూటీ చెయ్యండన్న రూల్సూ ఆఫీసుల్లో పాసయ్యాయి. రైళ్లలో నీటిని పంపించాల్సి వచ్చింది​. ఇప్పటికీ అదే పరిస్థితి దక్షిణ భారతంలో.

ఒక్క ఇండియాలోనే కాదు, ప్రస్తుతం దక్షిణాసియా మొత్తం ఇదే దుస్థితి ఉంది. ఇప్పటికే వరద ధాటికి నేపాల్​, ఇండియా, బంగ్లాదేశ్​లలో 60 లక్షల మందికిపైగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్నటిదాకా ఇండియా మొత్తం కరువు బీభత్సం సృష్టించింది. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా ఉండాలంటే మరో ఐదేళ్లలో దానికి పరిష్కారం ఆలోచించాల్సిందేనని నిపుణులు సూచించారు. లేదంటే 10 కోట్ల మంది జనం నీళ్లు దొరక్క అల్లాడిపోతారని చెప్పారు. ఆఫ్గనిస్థాన్​లోనూ అదే పరిస్థితి. కరువు వల్ల పంట పొలాలు దారుణంగా దెబ్బతిన్నాయి. లక్షలాది మంది వలస వెళ్లిపోయారు.
ఆకలితో అలమటించారు. ఇప్పుడేమో ఈశాన్య భారతం సహా నేపాల్​, బంగ్లాదేశ్​లలో వరదలు ముంచెత్తుతున్నాయి. బ్రహ్మపుత్ర వంటి జీవనదులు పొంగిపొర్లుతుండడంతో ఆయా దేశాల్లో వరదలు చుట్టుముట్టేశాయి. ప్రధాన రోడ్లన్నింటినీ బ్లాక్​ చేసేశాయి. దీంతో మయన్మార్​, బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో దుర్భేద్యమైన పరిస్థితుల్లో ఉన్న రొహింగ్యాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అంతేకాదు, మున్ముందు మరింత దారుణంగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

వ్యవసాయం నాశనం

దక్షిణాసియాలో వ్యవసాయం వర్షాధారం. వర్షాలు లేటుగా వచ్చినా, తక్కువ వర్షాలు పడినా దాని ప్రభావం పంటలపై పడుతుంది. ఈ ఏడాది దక్షిణాసియాలో అదే పరిస్థితి రాజ్యమేలుతోంది. అయితే, నైరుతి రుతుపవనాల రాక, వర్షాల అంచనాపై కొత్త పద్ధతులను అనుసరించాల్సిందిగా ప్రభుత్వ సంస్థలు, సైంటిస్టులు 19వ శతాబ్దం చివరి నుంచి చెబుతూ వస్తున్నారు. తద్వారా వర్షాల కోసం ఎదురు చూసే 200 కోట్ల మందికి ఆసరాగా నిలవాలని భావించారు. కానీ, మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎన్ని పద్ధతులను తీసుకొచ్చినా ఫలితం మాత్రం కనిపించట్లేదు.
హిందూ మహాసముద్రం వేడెక్కుతుండడం, తరచూ ఎల్​నినో పరిస్థితులు కనిపిస్తుండడం, వాయు కాలుష్యం, భూ వినియోగ మార్పిడి వంటి కారణాలతో ఇండియాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతేగాకుండా నైరుతి రుతుపవనాల రాకలోనూ తేడాలొస్తున్నాయి. దీంతో ఎన్ని కొత్త మోడళ్లు తీసుకొచ్చినా వాటి రాకను కచ్చితత్వంతో అంచనా వేయడం కష్టమవుతోంది. ఒకవేళ లేట్​గా వచ్చినా ఒక్కోసారి తక్కువ వర్షపాతం నమోదవుతోంది. కరువు పరిస్థితులకు బాటలు వేస్తోంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలు పడుతున్నాయి.
అంటే అతివృష్టి. దాని వల్ల వరదలు వస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. 1950 నుంచి 2015 మధ్య కాలంలో మధ్యభారతంలో అతివృష్టి సందర్భాలు కోకొల్లలని ద నేచర్​ స్టడీలో వెల్లడైంది. దాని వల్ల జన జీవనం అస్తవ్యస్తమైన సందర్భాలూ అనేకం. ఆస్తి నష్టం, పంట నష్టం, ప్రాణ నష్టం ఒక్కటేమిటి, చాలా అనర్థాలు వెలుగు చూశాయి.
ఇలాంటి వైరుధ్యాలే  ఇప్పుడు, దేశంలోని చాలా ప్రాంతాలు మనిషి బతకడానికి వీలుగా ఉంటాయా అన్న ప్రశ్నను లేవనెత్తేలా చేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేడెక్కువవుతది

వాతావరణ మార్పులు ఇక భవిష్యత్​ కానే కాదని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇప్పటికే పెట్టుకున్న 1.5 డిగ్రీల పరిమితిని చేరిపోయామంటున్నారు. వేగంగా 2 డిగ్రీల వైపు అడుగులు వేస్తున్నామంటున్నారు. ప్రపంచం మొత్తం మీద ఆ ప్రభావం పడినా సమానంగా ఉండదని, ఒకే టైంలో పడదని హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల పెరిగే వేడిని మేనేజ్​ చేయగలిగినా, ఇంకొన్ని ప్రదేశాల్లో మాత్రం ఏర్పడే తీవ్రమైన కరువులు, వడగాడ్పులు, వరదలు, విపరీత వాతావరణ పరిస్థితులు ఎదుర్కోవడం కష్టమని చెబుతున్నారు. సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. దాని వల్ల లక్షలాది మంది జీవనోపాధిపై ప్రభావం పడుతుందంటున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం వచ్చే పదేళ్లలో 12 కోట్ల మందికిపైగా కడు పేదరికంలోకి దిగజారి ఆకలితో అలమటిస్తూ వలసబాట పడతారు. దాని వల్ల పేద దేశాలు మరింత పేదరికంలోకి కూరుకుపోతాయని చెబుతున్నారు. ఏసీలుండి, తుఫాన్​ ప్రూఫ్​ సిటీలు మాత్రం ఈ ప్రభావం నుంచి తప్పించుకుంటాయని, తద్వారా ప్రపంచంలో అసమానత్వం రాజ్యమేలుతుందని చెబుతున్నారు.

వరదలు ఇంకా పెరుగుతయ్​​

ఎండ వేడి పెరుగుతున్న కొద్దీ 2071–2100 మధ్య ఇండియాలో తరచూ వరద పరిస్థితులు పెరుగుతాయని క్లైమేట్​ చేంజ్​ అండ్​ ఇండియా 2030 రిపోర్టు హెచ్చరించింది. 2030 నాటికి హిమాలయాల వద్ద సగటు ఉష్ణోగ్రతలు 2.6 డిగ్రీలు పెరుగుతాయని, దాని తీవ్రత 2 నుంచి 12 శాతం పెరుగుతుందని పేర్కొంది. దాని వల్ల వరదలు పెరిగిపోతాయని, తరచూ కొండచరియలు విరిగిపడతాయని హెచ్చరించింది. పంటల సాగు తగ్గిపోయి ఆహార భద్రతపై పెను విపత్తు చుట్టుముడుతుందని హెచ్చరించింది. వందేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా వర్షం కురిసే రోజులు తగ్గుతున్నా, కొద్ది రోజుల్లోనే ఎక్కువ వర్షాలు కురుస్తున్న పరిస్థితులు పెరుగుతున్నాయి. అంటే కుంభ వృష్టి కురుస్తున్నాయి. అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షాలు కురిసి జనజీవనాన్ని కకావికలం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం 11 రోజుల్లోనే 50 శాతం వర్షాలు కురవడమే అందుకు ఉదాహరణ.

 

వాతావరణ శరణార్థులు

ఎక్కడో ఓ చోట, వలస వెళుతూ పిల్లలు, పెద్దలు చనిపోతున్నారన్న వార్తలు చదువుతూనే ఉన్నాం. ఈ మధ్య మెక్సికో సరిహద్దుల్లో ఓ ఇండియన్​ చిన్నారి చనిపోయింది. అది ఎంత చర్చకు దారితీసిందో తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే తండ్రికొడుకులు నది దాటబోతూ ప్రాణం వదిలిన ఫొటో ఎందరినో కలిచివేసింది. ఇక, మున్ముందు అవి సర్వసాధారణం అయిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాసియాలో ఏటా 2.6 కోట్ల మంది పొట్ట చేతపట్టుకుని దేశాల సరిహద్దులు దాటుతున్నారని నార్వియన్​ రెఫ్యుజీ కౌన్సిల్​ అంచనా వేసింది. అంటే సెకనుకు ఒకరు చొప్పున బోర్డర్​ దాటేస్తున్నారట. కరువు పరిస్థితులు 2045 నాటికి ఆ సంఖ్య 13.5 కోట్లకు పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అందులో చాలా మంది సొంత దేశంలోనే వేరే ప్రాంతాలకు వలస వెళతారని పేర్కొంది. దాంతో పాటే దేశాల సరిహద్దులు దాటే వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతుందని చెప్పింది. ఇప్పటికే ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా రికార్డు సంఖ్యలో 7 కోట్ల మంది వలస వెళ్లారు. రాబోయే రోజుల్లో ఒక్క ఆస్ట్రేలియాలోనే వలస శరణార్థుల సంఖ్య 10 కోట్లకు చేరే అవకాశాలున్నాయట. ఇండో–పసిఫిక్​ ప్రాంతంలో సముద్ర మట్టాలు పెరిగిపోతాయట. అది చాలదన్నట్టు శరణార్థులకు అంతర్జాతీయ చట్టాలు రక్షణ కల్పించలేవని ఐక్యరాజ్యసమితి రెఫ్యుజీ కన్వెన్షన్​ చెబుతోంది.

Latest Updates