కొండను తవ్విన్రు.. ఎలుకల్ని పడుతున్రు?

బొమ్మకల్ భూముల్లో నోటీసులు పేదలకేనా? 

అక్రమణలకు పాల్పడిన పెద్దలకియ్యలే

బోర్డులు పెట్టిన్రు .. కొలతలు, ఫెన్సింగుల్లేవ్

కబ్జాకు గురైంది 7ఎకరాలేనట?

కరీంనగర్. వెలుగు:  కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ లో భూ ఆక్రమణదారులపై కాకుండా పేదలపైనే అధికారులు ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.  రెవెన్యూ అధికారులతో  పాటు సర్వేయర్లు, జడ్పీ సీఈవో లతో కూడిన కమిటీ  విచారణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. కానీ  ఆశించిన స్థాయిలో  ఫలితాలు వచ్చినట్లు కనిపించడం లేదు. ఇందులో బడా నాయకులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు అయినా  వారెవ్వరికి  నోటీసులు ఇవ్వకుండా.. గుడిసెలు వేసుకున్న పేదలకు గ్రామపంచాయతీ నోటీసులు ఇవ్వడం విశేషం. దీంతో పెద్దలకు ఓ న్యాయం, పేదలకు మరో న్యాయం అమలయ్యేలా ఉంది.

కమిటీతో చేసిందేమిటి?

బొమ్మకల్ గ్రామంలో 32 సర్వే నంబర్లలో సుమారుగా 168 ఎకరాలకు వరకు  శిఖం, పరంపోగు, బంచరాయి భూములున్నాయి. ఇవి దాదాపుగా ఆక్రమణకు గురయ్యాయి.  ఇవన్నీ బయటపడడంతో  సర్పంచ్​తో పాటు  అతడి అనుచరులు  అరెస్టు కావడం, కమిటీ వేయడం  చకచకా జరిగిపోయాయి.  ప్రభుత్వ భూములు ఉన్న స్థలాల్లో  బోర్డులు  పెట్టారు.  అయితే  ప్రభుత్వ భూములను పూర్తిగా సర్వే చేసి ఎక్కడా హద్దులు పెట్టలేదు.  ఫెన్సింగ్ కూడా వేయలేదు. కేవలం ఈ భూమి విస్తీర్ణం.. ఇంత.. దీని సర్వే నంబర్ ఇది అని  తెలిపే బోర్డులు మాత్రమే పెట్టారు.    ఒకటి రెండు చోట్ల మాత్రమే కట్టడాలను కూల్చివేయడం మినహా  చేసిందేమీ లేదు.  శిఖం భూములు, పరంపోగు భూముల్లో చేపట్టిన నిర్మాణాలను  ఒక్కరివి కూడా ముట్టుకోలేదు.

పెద్దోళ్లకు నోటీసులియ్యరా?

అధికారులు ఇటీవల చేపట్టిన సర్వేలో కొన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినట్లు గుర్తించారు. అయితే అవేవో పలుకుబడి ఉన్న వారివి, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలవి అనుకుంటే పొరపాటే.  సుమారుగా 30 ఏండ్ల కిందట  బతకడానికి వచ్చి గుడిసెలు వేసుకున్న వారిపైనే కాన్సంట్రేషన్ చేశారు.  వీరి ఇంటి నంబర్లు రద్దు చేయాలంటూ  నోటీసులు ఇష్యూ చేశారు.  వారం రోజుల గడువులోగా ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని  నోటీసుల్లో పేర్కొన్నారు.  గ్రామంలో చాలా ప్రభుత్వ  భూమి  అన్యాక్రాంతమైంది.  32 సర్వే నంబర్లలో సుమారుగా 42 రిజిస్ట్రేషన్  డాక్యుమెంట్లు ఉన్నాయి.   28, 105, 108, 96, 728, 679/10, 697, 74 సర్వే నంబర్లలో  విలువైన భూములు ఉన్నాయి. వీటిలో చాలా వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.  ఇందులో ఉన్న వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు . కనీసం  వీరిలో ఎవరికీ కూడా  గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు ఇవ్వలేదు.  ఎమ్మెల్యే దాసరి మనోహార్ రెడ్డి, విట్స్ కాలేజీ , కొందరు అధికార పార్టీ  కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, సర్పంచ్ లాంటి పెద్ద వాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ వీరికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదో చెప్పడం లేదు.

ఏడెకరాలేనా…

బొమ్మకల్  భూ వివాదాల మీద వేసిన  కమిటీల్లో కీలకం రెవెన్యూ విభాగమే.  సుమారుగా 168 ఎకరాల ప్రభుత్వ భూమి గ్రామంలో ఉండగా అధికారులు  చేపట్టిన సర్వే, విచారణలో మాత్రం తేలింది కేవలం ఏడెకరాలు మాత్రమే అని అంటున్నారు.  అంత మంది ఆఫీసర్లు సుమారుగా రెండు మూడు వారాలు ఫీల్డ్ లెవెల్లో విచారణ చేపట్టి ఏడెనిమిది ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి అని తేల్చడంపై  అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి.   మరో విషయం ఏమిటంటే.. ఓ వైపు విచారణ కొనసాగుతుండగానే రూరల్ తహసీల్దార్  గడ్డం సుధాకర్ ను అర్బన్ మండలానికి, అర్బన్ తహసీల్దార్ వెంకట్ రెడ్డిని రూరల్ కు బదిలీ చేశారు. ఇలాంటి  పరిస్థితిలో  కొత్తగా వచ్చిన తహసీల్దార్​కు ఈ విషయాలపై ఎలాంటి అవగాహన ఉంటుందనే సందేహాలు వస్తున్నాయి.

ఆక్రమణల్లో ఆ అధికారులకు సంబంధం ఉంది -కరీంనగర్ కలెక్టర్ కె శశాంక

శాఖలు వేరైనా పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు సంయుక్తంగా పనిచేసి ప్రభుత్వ భూములు కాపాడాలని కలెక్టర్ కె.శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో సీపీ కమలాసన్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భూముల్లో ఏమైనా నిర్మాణాలు ఉంటే తొలగించాలన్నారు. పంచాతీరాజ్ కు సంబంధించి 2010– 11 తర్వాత బొమ్మకల్ లో జరిగిన వివిధ రకాల పనులను చెక్ చేశామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ లో 17 వందలు కొత్త ట్యాక్స్ ప్రకారం కట్టినట్టు ఉందని, కలెక్షన్ పరంగా మాత్రం 14 వందలే ఉందన్నారు. 250 పర్మిషన్లు ఇవ్వకుండానే డైరెక్టుగా ఇంటి నెంబర్లు ఇచ్చారన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకోవడంలో కొందరు పంచాయతీ సెక్రెటరీలు , ఎంపీఓలకు సంబంధం ఉందని, వీరి పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్ క్రోచ్ అయిన భూమి వెనక్కి తీసుకొవాలని, గుర్తించిన అన్ని భూములలో బోర్డులు పెట్టాలన్నారు. రాళ్లతో బౌండరీలు పెట్టి కలర్ వేసి జియో ట్యాగిం గ్ చేయాలన్నారు. సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ బొమ్మకల్ లో భూములను ఆక్రమించిన వారిని గుర్తించడానికి 2 పోలీస్ టీంలను ఏర్పాటు చేసి 17 మందిపై కేసులు పెట్టామన్నారు.

 

Latest Updates