కస్టమర్లకు తలనొప్పిగా మారిన ఆన్ లైన్ పేమెంట్స్

ట్రాన్సాక్షన్ చేస్తుండగానే స్ట్రక్ 

డబ్బులు కట్ అయితయ్‌..వెనక్కి రావు

దిక్కుతోచని కస్టమర్లు

బ్యాంక్‌ల ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌పై డౌట్స్‌

రెగ్యులేటరీ ఆర్‌‌బీఐ కూడా సీరియస్

బిజినెస్ డెస్క్, వెలుగు: ఇండియన్ బ్యాంక్‌‌లలో టెక్నికల్ సమస్యలు కస్టమర్లకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ఒకవైపు డిజిటల్ పేమెంట్లను ప్రమోట్ చేయాలని కేంద్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ.. దానికి తగ్గట్టు ఐటీ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ లేక బ్యాంక్‌‌లు లావాదేవీల్లో ఫెయిల్ అవుతున్నాయి. ఈ మధ్యన ఈ సమస్యలు మరీ ఎక్కువయ్యాయి. యూపీఐ పేమెంట్లు స్ట్రక్ అవుతున్నాయి. ట్రాన్సాక్షన్ చేస్తుండగానే యాప్ స్ట్రక్ అయ్యో లేదా మరే ఇతర కారణాల వల్లనో పేమెంట్ జరగడం లేదు. కానీ డబ్బులు మాత్రం అకౌంట్ నుంచి కట్ అవుతున్నాయి. అసలెందుకు ఇలా జరిగిందో అర్థం కాక కస్టమర్లు తలపట్టుకుంటున్నారు. ఫోన్ నెట్‌‌వర్క్ సమస్యనా లేదా యాప్‌‌ ఇష్యూనా, కాకపోతే సర్వర్‌‌ ప్రాబ్లమా అనేది చాలామందికి అర్థం కావడం లేదు.

మరోవైపు ఏటీఎంలు కూడా అలానే సతాయిస్తున్నాయి. నవంబర్‌‌‌‌లో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ డిజిటల్ సర్వీసులు నాలుగు గంటల పాటు ఆగిపోయాయి. డేటా సెంటర్లలో పవర్ సమస్యతో తమ డిజిటల్ సర్వీసులు పనిచేయలేదని చెప్పి హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ చేతులు దులిపేసుకుంది. ఇలా పదేపదే డిజిటల్ సేవల్లో అంతరాయాలు తలెత్తుతుండటంతో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌పై ఆర్‌‌‌‌బీఐ ఇటీవల చర్యలు కూడా తీసుకుంది. కొత్త క్రెడిట్ కార్డులు, కొత్త డిజిటల్ సర్వీసు ప్రొడక్ట్‌‌లు లాంచ్ చేయొద్దని చెప్పింది. అలాగే ఎస్‌‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ యోనోలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి.

ఈ ప్రాబ్లమ్స్‌‌ను చూస్తుంటే.. ఇండియాలో పెద్ద బ్యాంక్‌‌ల ఐటీ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్‌‌లు ఐటీ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను మెరుగుపర్చుకోవాలని ఆర్‌‌‌‌బీఐ పదేపదే సూచిస్తూనే ఉంది. బ్యాంక్‌‌ల డేటా సెంటర్లను థర్డ్ పార్టీలు మేనేజ్‌‌ చేస్తున్నారు. పదే పదే పవర్‌‌‌‌ ఫెయిల్యూర్స్‌‌తో డిజిటల్ సర్వీస్‌‌లలో ఇష్యూస్‌‌ వస్తున్నాయని బ్యాంక్‌‌లు చెబుతున్నాయి. కానీ సర్వీసు ప్రొవైడర్‌‌‌‌గా బ్యాంక్‌‌లు ఆ ప్రాబ్లమ్స్‌‌ రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నాయో, లేదో మాత్రం చెప్పడం లేదు. గత రెండేళ్లలో హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌లో ఇలాంటి సమస్య నెలకొనడం ఇది మూడో సారి. ముఖ్యంగా శాలరీలు పడే సమయంలోనే ఇలా జరుగుతుంది. రెండేళ్ల క్రితం హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌ కొత్త డిజిటల్ బ్యాంకింగ్ యాప్ కూడా ఫెయిల్ అయ్యింది.

యూపీఐ ప్లాట్‌‌ఫామ్‌‌పై ఫెయిల్ అవుతోన్న ట్రాన్సాక్షన్స్‌‌ ప్రతి ఒక్క బ్యాంక్‌‌వి ఐదింతలు పెరిగాయి. పీర్–టూ–పీర్ ట్రాన్సాక్షన్స్, పర్సన్–టూ–మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నింట్లో ఈ ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి. టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ గార్టనర్ అంచనా ప్రకారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌‌ల ఐటీ ఖర్చు, డేటా సెంటర్లపై ఎక్స్‌‌పెండించర్ 2020లో 2 శాతం తగ్గింది.

కరోనా తర్వాత పెరిగిన డిజిటల్ యూజర్లు..

కరోనా మహమ్మారి సమయంలో చాలా బ్యాంక్‌‌లకు డిజిటల్ కస్టమర్లు పెరిగారు. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌‌ల కస్టమర్లలో 50 శాతం మంది డిజిటల్‌‌గా వచ్చారు. కానీ ఇటీవల హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌పై ఆర్‌‌‌‌బీఐ కొత్త డిజిటల్ సర్వీసులు తేవొద్దని ఆంక్షలు విధించడంతో.. ఈ బ్యాంక్‌‌కు కాస్త ఇబ్బందికరంగానే మారింది. ప్రతి నెలా 3 లక్షల మంది కొత్త క్రెడిట్ కార్డు కస్టమర్లను ఇది కోల్పోతుంది. టెక్నాలజీ ఫెయిల్యూర్స్‌‌ ఆర్థికంగా బలంగా ఉన్న బ్యాంక్‌‌ల ఎకోసిస్టమ్‌‌ను అయినా దెబ్బతీస్తాయని ఈ విషయంలో తెలుస్తోంది. హెచ్‌‌డీఎఫ్​సీ బ్యాంక్ దీనిపై సీరియస్‌‌గా నిర్ణయం తీసుకోవాలని అనలిస్ట్‌‌లు సూచిస్తున్నారు. మరోవైపు బ్యాంక్‌‌లు పబ్లిక్ టెండరింగ్ ప్రాసెస్‌‌లో తక్కువ కోట్ చేసిన ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌‌‌‌నే ఎంచుకుంటున్నాయని, దీంతో సెక్యూరిటీ సమస్యలు వస్తున్నాయని బ్యాంక్‌‌లకు చెందిన సీనియర్ అధికారులు అంటున్నారు.

వ్యాపారాల పరంగా పుంజుకున్న హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్…

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ హెచ్‌‌డీఎఫ్‌‌సీ. బ్యాంక్ నికర లాభం 2020 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెండింతలు పెరిగి రూ.26 వేల కోట్లుగా ఉంది. గత ఆరేళ్లలో బ్యాంక్ షేరు ధర మూడింతలు పెరిగింది. ఫైనాన్షియల్‌‌గా ఇంత బలంగా ఉన్నప్పటికీ హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌లో ఎందుకు ఈ సమస్యలు తలెత్తుతున్నాయి? అంటే ప్రశ్నార్థకమే. ‘ఎకానమీని డిజిటైజ్ చేయడం ద్వారా డిజిటల్ పేమెంట్లను సరికొత్త స్థాయికి తీసుకెళ్లవచ్చు. కానీ దీనివల్ల బ్యాంకింగ్ సిస్టమ్‌‌పై  ఒత్తిడి పెరుగుతోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం చాలా చేయాల్సి ఉంటుంది. హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌లో  పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డులు, ఇతర రిటైల్ లోన్స్ వంటివి పెరుగుతున్నాయి’ అని హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ బోర్డు మెంబర్, ఖోస్లా ల్యాబ్స్ సీఈవో శ్రీకాంత్ నందముని చెప్పారు. ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ పర్సనల్, ఆటోమొబైల్ లోన్స్, క్రెడిట్ కార్డులు బాగా పెరిగిపోయాయి.

గ్లోబల్ బ్యాంక్‌‌‌‌లలో ఐటీ వర్క్‌‌‌‌ఫోర్స్ ఎక్కువ..

హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌లో ఇటీవల చోటు చేసుకున్న అంతరాయాలు డేటా సెంటర్లకు చెందినవి అయినా..  బ్యాంకు మళ్లీ ఎంత త్వరగా సేవలందించగలిగిందనే దానిపైనే  సమర్థత ఆధారపడి ఉంటుందని ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌లంటున్నారు. 2018లో హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌ ఎక్కువ మందిపై తమ అప్లికేషన్‌‌‌‌ను టెస్ట్ చేయకుండానే వాడకానికి  తేవడంతో, ఆ యాప్‌‌‌‌ ఫెయిల్ అయిందన్నారు. ప్రపంచంలో మోస్ట్ వాల్యుబుల్ బ్యాంక్‌‌‌‌లలో ఒకటిగా చెప్పుకునే హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్.. పెరుగుతున్న కస్టమర్లకు తగ్గట్టు ఐటీ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌పై ఖర్చు పెడుతోందా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జేపీ మోర్గాన్ ఛేజ్, సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో వంటి నాలుగు గ్లోబల్ బ్యాంక్‌‌‌‌లు తమ ఐటీ ఇన్‌‌‌‌ఫ్రాపై ఏడాదికి 10 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నాయి. అమెరికన్ బ్యాంక్‌‌‌‌లలో టెక్నాలజీ వర్క్‌‌‌‌ఫోర్స్ ఎక్కువగా ఉంటోంది. టెక్నాలజీ ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌లో చాలామంది మన  వారే. కానీ ఇండియన్ బ్యాంక్‌‌‌‌లలో పరిస్థితి తారుమారుగా ఉంటోంది. అన్ని బ్యాంక్‌‌‌‌లు కూడా 30 ఏళ్ల నుంచి వాడుతోన్న డేటా బేస్ టెక్నాలజీనే ఇంకా వాడుతున్నాయి. కొత్త డిజిటల్ ఛానల్స్‌‌‌‌తో ఇంటిగ్రేట్ అయ్యే విషయంలో కూడా బ్యాంక్‌‌‌‌లు ఫెయిల్ అవుతున్నాయి. బ్యాంక్‌‌‌‌లు టెక్నాలజీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను పెంచాల్సి ఉందని నిపుణులంటున్నారు. ఎప్పటికప్పుడు  వచ్చే కొత్త టెక్నాలజీలను తప్పనిసరిగా అందుబాటులోకి బ్యాంకులు తెచ్చుకోవల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. చాలా బ్యాంకులు క్లౌడ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ను అందిపుచ్చుకోవడానికి అంతగా ఇష్టపడటం లేదు.

 

Latest Updates