కేవలం తన అందంతో ఓవర్ నైట్ లో సెలబ్రిటీగా మారాడు

రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ గా గుర్తింపు

అందం అతని పాలిట వరమైంది. రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌‌గా గుర్తింపు తెచ్చిపెట్టింది. సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్స్‌‌లో, టీవీల్లో.. ఎక్కడ
చూసినా ఇప్పుడు అతని గురించే చర్చ.  ఈ ఫేమ్‌‌తో టూరిస్ట్‌‌ బ్రాండ్‌‌ అంబాసిడర్‌‌గా ఊరికి పట్టిన ‘మచ్చ’ను చెరిపేయాలనుకున్నాడు.  ఇంతలో మరో అనుకోని అవకాశం అతని ఇంటి తలుపు తట్టింది. అది అతని జీవితాన్ని ఎలా మార్చేస్తుందో? అనే ఆందోళన ఇప్పుడు ఇంటర్నెట్‌‌లో మరో చర్చకు దారితీసింది.

డింగ్‌‌ హెన్‌‌..  వయసు 20 ఏళ్లు. పెద్దగా చదువుకోలేదు. కానీ, తన అందంతో ఇంటర్నెట్‌‌ సెలబ్రిటీగా గుర్తింపు దక్కించుకున్నాడు.  సిచువాన్‌‌ ప్రావిన్స్‌‌ని ఆనుకుని ఉన్న ఖామ్ రీజియన్‌‌(టిబెట్‌‌)లోని లిటాంగ్‌‌ అనే పల్లెటూరిలో పుట్టి, పెరిగాడు డింగ్‌‌.  అతని కుటుంబానిది కంపా తెగ. సాధారణంగా ఈ తెగవాళ్లు వ్యవసాయం మాత్రమే చేయాలి.  కానీ, అందుకు భిన్నంగా డింగ్ కుటుంబం పశువులు మేపుతూ జీవనం కొనసాగిస్తోంది.  స్థానికులు మాత్రం ఇతన్ని ముద్దుగా ‘హార్స్‌‌ ప్రిన్స్‌‌’

అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఊళ్లలో ఎక్కడ గుర్రపు పందేలు నిర్వహించినా..  డింగ్‌‌ గుర్రం మాత్రమే గెలుస్తుంది. కొన్నాళ్ల క్రితం ఓ ఫొటోగ్రాఫర్‌‌ సరదాగా డింగ్‌‌ ఫోటోలు తీయడం.. అవి ఇంటర్నెట్‌‌లో వైరల్ కావడంతో ఈ కుర్రాడు ఫేమస్‌‌ అయ్యాడు.

మిలియన్ల ఫాలోవర్లు

 

డింగ్‌‌ ఫేస్‌‌లోని హ్యాండ్సమ్‌‌ ఫీచర్స్‌‌, అమాయకపు చిరునవ్వుకి లక్షల మంది ఇంప్రెస్ అయ్యారు.  ముఖ్యంగా ఆడవాళ్లు అతని ట్రెడిషనల్‌‌ లుక్‌‌కి ఫిదా అయ్యి..  అతని గురించి ఆరాతీయడం మొదలుపెట్టారు.  అక్కడి నుంచి డింగ్‌‌ టిక్‌‌టాక్‌‌ వెర్షన్‌‌ ‘డౌయిన్‌‌’లో షార్ట్ వీడియోల్ని పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు.  వైబో(చైనా సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌)లో అతని ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.  డింగ్‌‌ది పేద కుటుంబం కావడంతో కొందరు డబ్బు, మరికొందరు గిఫ్ట్‌‌లు పంపించారు.  సిచువాన్‌‌ ప్రావిన్స్‌‌ కల్చరల్ డిపార్ట్‌‌మెంట్ ఈ కుర్రాడి ఫేమ్‌‌ని వాడుకోవాలనుకుంది. ‘డింగ్ హెన్స్‌‌ వరల్డ్’ పేరుతో  నవంబర్‌‌ 25న ఒక వీడియో రిలీజ్ చేసింది.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  టీవీ ఛానెల్స్‌‌ డింగ్‌‌ని ఇంటర్వ్యూలు చేశాయి.  సోషల్ మీడియాలో ఇతనికి 2 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ దాటారు.  అయితే లిటాంగ్‌‌కి ‘ రక్తం తాగే వ్యాంపైర్లు’ ఉన్న ఊరిగా పేరుంది. దీంతో ఆ ఊరికి టూరిస్టులు ఎవరూ రారు. అందుకే తన ఫేమ్‌‌తో ఊరికి కొత్త కళ తీసుకురావాలి అనుకున్నాడు. టూరిస్ట్ బ్రాండ్ అంబాసిడర్‌‌గా పని చేశాడు.  ఇంతలో చైనా ప్రభుత్వం తరపు నుంచి ఒక కంపెనీ అతనికి జాబ్ ఆఫర్‌‌ చేసింది. ఇక్కడి నుంచి అసలు వ్యవహారం మొదలైంది.

అతన్ని వదిలేయండి

డింగ్‌‌కి ప్రస్తుతం జాబ్‌‌ ట్రైనింగ్ నడుస్తోంది. కానీ, అది ఏం ఉద్యోగం అనేది క్లారిటీ లేదు. మాండరిన్ భాషను నేర్పిస్తున్నారు. అతనితో షార్ట్ వీడియోస్ చేయిస్తున్నారు. అంతేకాదు ఓ మినీ మ్యూజియంకి అతను ట్రావెల్ కామెంటేటర్‌‌గా ఉన్నాడు. కానీ, ఇవన్నీ అతని జీవితాన్ని మార్చేస్తాయని కొందరు వాదిస్తున్నారు. ఇ–సెలబ్రిటీలకు పేరురావడం మాట అటుంచి.. ఆ ఫేమ్‌‌ వల్ల వాళ్ల సోషల్‌‌, పర్సనల్ లైఫ్‌‌లు డిస్టర్బ్‌‌ అయిన ఇన్సిడెంట్‌‌లు ఎన్నో. అందుకే డింగ్‌‌తో డబ్బులు సంపాదించాలనే ప్రయత్నాలు ఆపేయాలని ఆ కంపెనీని కోరుతున్నారు. ఇంకోవైపు ఆ పల్లెటూరి పిలగాడిని అతని మానాన వదిలేయాలంటూ వైబోలో క్యాంపెయిన్ నడుస్తోంది. అయితే అధికారులు మాత్రం అలాంటిదేం జరగబోదని హామీ ఇస్తున్నారు.

 

Latest Updates