సొసైటీకి ‘పలాస 1978’ లాంటి మూవీస్ అవసరం

తమిళ డైరెక్టర్ పా.రంజిత్ ప్రశంసలు
చెన్నై: ప్రేక్షకులను మెప్పించడమే ధ్యేయంగా తెలుసు సినిమాలు తెరకెక్కుతుంటాయి. యూత్, మాస్ ను ఆకట్టుకోవడానికి కమర్షియల్ మూవీస్ ను తీయడానికే మన డైరెక్టర్స్, హీరోలు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అందుకే టాలీవుడ్ మూవీస్ కు కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ క్రిటిక్స్ నుంచి పొగడ్తలు మాత్రం చాలా తక్కువ సార్లు వస్తుంటాయి. అయితే ఈ ఏడాది విడుదలైన పలాస 1978 ఫిల్మ్ కు మాత్రం చాలా మంది అప్రిషియేషన్ వచ్చింది. ముఖ్యంగా ఆడియన్స్ తోపాటు విమర్శకులు కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామంలో కుల వివక్ష నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ‘చదివించు, తిరగబడు, నిర్వహించు’ అనే నినాదంతో తెరకెక్కిన ఈ సినిమాలో మన సొసైటీలోని కొన్ని విషయాలపై చాలా బాగా ఫోకస్ చేశారు.

తమిళ డైరెక్టర్ పా.రంజిత్ (కబాళీ, కాలా ఫేమ్) తీసిన పరియేరుమ్ పెరుమాల్ మూవీలో ప్రస్తావించిన అంశాలు పలాస సినిమాకు కాస్త దగ్గరగా ఉంటాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కబాలీ, కాలా లాంటి మూవీస్ తో తెలుగు ఆడియన్స్ కు పా.రంజిత్ దగ్గరయ్యాడు. ఆయన రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో పలాస 1978 మూవీని చూశారు. ఆ సినిమా గురించి తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా ఆయన పంచుకున్నారు.

‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముఖ్యమైన ఫిల్మ్స్ లో పలాస 1978 ఒకటి. చాలా ధైర్యంగా, దళిత దృక్పథం గురించి విస్పష్టంగా చర్చించిన సినిమా ఇది. ఆ మూవీని అభినందిస్తున్నా. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు వస్తాయని ఆశిద్దాం. డైరెక్టర్ కరుణ కుమార్ కు కంగ్రాట్స్’ అని పా. రంజిత్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను చూశాక పా.రంజిత్ కు కరుణ కుమార్ థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే.

Latest Updates