అధికారుల నిర్లక్ష్యంతో అంగవైకల్యం.. పెన్షన్ కోసం బాధితుడి ధర్నా

  • కాలు, చేయి కోల్పోయి నాలుగేండ్లు
  • పెన్షన్ మంజూరు చేయాలంటూ అధికారులకు మొర
  • షాద్ నగర్ ఎంపిడివో కార్యాలయం ముందు ధర్నా

కరెంట్ అధికారుల నిర్లక్ష్యానికి కాలు చెయ్యి పోగొట్టుకున్న ఓ వికలాంగుడి కుటుంబం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎంపిడిఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే ఫరూక్ నగర్ మండలంలోని చౌలపల్లి గ్రామానికి చెందిన సాయిలు గత నాలుగు సంవత్సరాల క్రితం గ్రామంలో కరెంట్ సమస్య తలెత్తడంతో కరెంట్ అధికారులు కొందరు, గ్రామ ప్రజా ప్రతినిధులు అతన్ని విద్యుత్ స్థంభం ఎక్కించారు. స్థంభంపై ఎక్కి కరెంట్ వైర్లు సరి చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కరెంట్ సప్లై కావడంతో స్థంభంపై నుంచి పడి ఒక కాలు ఒక చెయ్యి పోగొట్టుకున్నాడు. ఆ ప్రమాదం తరువాత అతన్ని ఎవరూ పట్టించుకోలేదు.

ముగ్గురు ఆడపిల్లల సంతానం ఉన్న సాయిలును.. ఏ అవ‌స‌ర‌మొచ్చినా వారే ఓ చిన్నపాటి టీవీఎస్ వాహనంపై అత‌న్ని తీసుకెళ్తారు. ఆ క్ర‌మంలోనే ఆసరా పెన్షన్ కోసం నాలుగు సంవత్సరాల నుండి ఎంపిడిఓ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు తిరిగినా.. ఫలితం లేకపోయింది. గతంలో మీడియాను ఆశ్రయించడంతో అప్పటికప్పుడు స్పందించిన అధికారులు తన పేరును లిస్ట్ లో పెట్టారు. కానీ పెన్షన్ మాత్రం నేటికి రావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు పెన్షన్ మంజురు చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఆసరా పెన్షన్ కు సంబంధించి అధికారులను అరా తియ్యగా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలలో సుమారు 2వేల మంది లబ్ధిదారులు మూడు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు లబ్ధిదారులకు పెన్షన్లు రావడం లేదు. దరఖాస్తులో వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, గితకార్మికులు ఉన్నారు.

Latest Updates