క్రమశిక్షణే..రోహిత్‌ సక్సెస్‌ మంత్ర

కొన్నేళ్లుగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది ముగ్గురే ముగ్గురి పేర్లు. కోహ్లీ, రోహిత్‌‌, ధవన్‌‌. ఒకరు విఫలమైనా మరొకరు అదుకుంటూ ఇండియాకు తిరుగులేని విజయాలు అందించారు. ఈ వరల్డ్‌‌కప్‌‌లోనూ అది కొనసాగింది. కానీ  గాయంతో ధవన్‌‌ నిష్క్రమించడంతో ఇప్పుడు జట్టు భారం మొత్తం రోహిత్‌‌, కోహ్లీపైనే పడింది. ముఖ్యంగా ఓపెనింగ్‌‌లో రోహిత్‌‌ పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఓ పక్క రాహుల్‌‌ను నడిపిస్తూ మరోపక్క తాను ఆడుతూ.. విరాట్‌‌సేనకు అదిరిపోయే ఆరంభాలు ఇస్తున్నాడు. అసలు హిట్‌‌మ్యాన్‌‌ ఇంతలా చెలరేగిపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం!

అసలే వరల్డ్‌‌కప్‌‌.. ఆపై ఫాస్ట్‌‌ పిచ్‌‌లు… కఠినమైన వాతావరణం… షార్ట్‌‌, బౌన్స్‌‌, పేస్‌‌తో ఇబ్బందిపెట్టే ప్రత్యర్థులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌‌ గడ్డపై మాములుగా అయితే కోహ్లీ బాగా ఆడతాడని అనుకున్నాం. ఐసీసీ టోర్నీలు అంటే వీరోచితంగా చెలరేగే ధవన్‌‌ రెండో స్థానంలో ఉంటాడని భావించాం. కానీ ఈ ఇద్దర్ని వెనక్కి నెట్టి ఇప్పుడు ఇండియా మొత్తం రోహిత్‌‌ జపం చేస్తున్నది. మిగతా జట్లన్నీ కూడా ఈ ముంబైకర్‌‌ను ఎలా ఔట్‌‌ చేయాలని కొత్త కొత్త వ్యూహాల కోసం వేట మొదలుపెట్టాయి. అసలు రోహిత్‌‌ ఇంగ్లిష్‌‌ పిచ్‌‌లపై ఇంతలా సక్సెస్‌‌ కావడానికి కారణం కేవలం… క్రమశిక్షణ, నియంత్రణ. ఈ రెండు అంశాలతోనే అతను వరల్డ్‌‌కప్‌‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ‘క్రమశిక్షణతో కూడిన ఆట. నియంత్రణతో కూడిన బ్యాటింగ్‌‌. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండింటిని నేను అలవాటు చేసుకున్నా. అవే ఇప్పుడు నాకు అద్భుత ఫలితాలను తెచ్చిపెడుతున్నాయి. మామూలుగా అయితే పాతవాటిని ఎక్కువగా గుర్తు చేసుకుంటాం. కానీ నా వరకైతే గతం.. గతః. క్రికెట్‌‌లో ప్రతి రోజు కొత్తదే. ప్రతి రోజును నేను కొత్తగా మొదలుపెడతా. ఇంతవరకు వన్డేలు ఆడలేదు… ఈ టోర్నీలో సెంచరీలు కొట్టలేదు అనే ఆలోచనతోనే ఆట మొదలుపెడతా. ఈ దృక్పథంతోనే బ్యాటింగ్‌‌కు దిగుతా. అవసరమైనప్పుడల్లా గుర్తు చేసుకుంటా. దానివల్ల బ్యాటింగ్‌‌పై ఏకాగ్రత కుదురుతుంది’ అని రోహిత్‌‌ వెల్లడించాడు.

జట్టు గెలుపు ముఖ్యం

వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు గెలవడమే తనకు ఎక్కువ  సంతోషాన్ని ఇస్తుందని రోహిత్‌‌ చెబుతున్నాడు.  ‘టీమిండియాను గెలిపించడం నా జాబ్‌‌. ఐదు సెంచరీలు చేశామా లేక ఇంకేదైనా సాధించామా అన్నది ముఖ్యం కాదు. వ్యక్తిగత మైలురాళ్ల కంటే నేను ఆడటం వల్ల  టీమ్‌‌ గెలిచిందంటే ఎక్కువగా ఆనందిస్తా. మనం బాగా ఆడామంటే మిగతా మైల్‌‌స్టోన్స్‌‌ వాటంతట అవే వస్తాయి. చాలా మంది సెంచరీల గురించి మాట్లాడుకున్నా.. స్పోర్ట్స్‌‌ పర్సన్‌‌గా వాటిని సాధించడం ఎంత కష్టమో నాకు తెలుసు’ అని ఈ ముంబైకర్‌‌ వ్యాఖ్యానించాడు. ఆటతోనే కాకుండా ఈ హిట్‌‌మ్యాన్‌‌ రికార్డుల పరంగానూ దూసుకెళ్తున్నాడు. గత ప్రపంచకప్‌‌లో సంగక్కర 4 సెంచరీలు కొడితే… ఈ సారి లీగ్‌‌ దశలోనే రోహిత్‌‌ 5 బాదేశాడు. అది కూడా 8 ఇన్నింగ్స్‌‌ల్లోనే. మామూలుగా  విరాట్‌‌ ఇలాంటి అరుదైన ఫీట్లను నమోదు చేయడం చూస్తుంటాం. కానీ ఈసారి రోహిత్‌‌ పరుగుల దాహంతో ఉరకలేస్తున్నాడు. ఇప్పటికే ఒకే ఏడాదిలో (2018 జులై– 2019 జులై) అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాళ్లలో రోహిత్‌‌ (2063) మూడో స్థానంలో నిలిచాడు. మార్చి 1999 –2000 మధ్య కాలంలో గంగూలీ 2200 రన్స్‌‌ చేస్తే, డిసెంబర్‌‌ 1998–1999 కాలంలో సచిన్‌‌ 2077 పరుగులు చేసి టాప్‌‌–2లో ఉన్నారు. ఒకవేళ కివీస్‌‌తో జరగాల్సిన లీగ్‌‌ మ్యాచ్‌‌ వర్షం వల్ల రద్దు కాకపోతే రోహిత్‌‌ ఖాతాలో మరికొన్ని పరుగులు జతయ్యేవి. తద్వారా వరల్డ్‌‌కప్‌‌లో అత్యధిక పరుగుల సచిన్‌‌ (673) రికార్డును ఈపాటికే బద్దలుకొట్టే వాడేమో. ప్రస్తుతం సచిన్‌‌, రోహిత్‌‌కు మధ్య తేడా 26 పరుగులే కాబట్టి కచ్చితంగా ఈ రికార్డును కూడా అధిగమిస్తాడని అందరూ భావిస్తున్నారు. ఆరు ప్రపంచకప్‌‌లు ఆడిన సచిన్‌‌ 44 ఇన్నింగ్స్‌‌ల్లో  6 సెంచరీలతో ఈ రికార్డును నెలకొల్పితే..  కేవలం రెండో వరల్డ్‌‌కప్‌‌ ఆడుతున్న రోహిత్‌‌ 16 ఇన్నింగ్స్‌‌ల్లోనే దాని చేరువకు రావడమంటే ఈ హిట్‌‌మ్యాన్‌‌ పరుగుల ప్రవాహం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

Latest Updates