సర్కార్ తప్పులు.. ఆఫీసర్లకు శిక్షలు

కరోనాపై ఫెయిల్యూర్స్ ను కప్పిపుచ్చేందుకే ఐఏఎస్ ల బలి
మొన్నటి వరకు హెల్త్ శాఖకు సీఎం ప్రశంసలు
ఇప్పుడేమో సీనియర్ ఆఫీసర్ల ట్రాన్స్ ఫర్

హైదరాబాద్, వెలుగు: కరోనా కట్టడిలో తన ఫెయిల్యూర్స్ ను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ లను బదిలీ చేసిందనే చర్చ జోరుగా నడుస్తోంది. దాదాపు మూడేండ్లుగా హెల్త్ డిపార్ట్ మెంట్ బాధ్యతలు చూసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు శాంతికుమారి, యోగితారాణాను తప్పించడం వెనుక ఉద్దేశం ఇదేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. లాక్ డౌన్ పెట్టిన కొత్తలో.. హెల్త్ శాఖ ఆఫీసర్లు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. మరి ఇప్పుడు అదే ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేయడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత 20 రోజులుగా కరోనాపై సీఎం ఎలాంటి రివ్యూలు నిర్వహించడం లేదు. కనీసం ఆ విషయాన్ని ప్రస్తావించేందుకు కూడా చొరవ చూపడం లేదు. చివరకు ఆఫీసర్లను దోషులుగా ప్రభుత్వం చిత్రీకరించిందన్న అభిప్రాయం ఐఏఎస్ వర్గాల్లో ఉంది. ఆఫీసర్లను బదిలీ చేసినంత మాత్రన సమస్యకు పరిష్కారం దొరకదని ఆ వర్గాలు అంటున్నాయి. కరోనా కట్టడిలో సర్కారు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఐఏఎస్ లను బలి పశువులుగా చేస్తున్నారని ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు. వైరస్ కట్టడి విషయంలో ప్రభుత్వం మొదట్నించి జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకే పరిస్థితి చేయి దాటిందని ఆయన పేర్కొన్నారు.

హెల్త్ శాఖ సూచనలు బుట్టదాఖలు?
లాక్ డౌన్ సడలింపుల తర్వాత కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్త్ శాఖ ఇచ్చిన సూచలను సీఎం ఆఫీస్ పట్టించుకోవడం లేదన్న చర్చ ఆఫీసర్లలో ఉంది. పెద్ద ఎత్తున టెస్టులు చేయాలని చెప్పినా వినలేదని వాళ్లు అంటున్నారు. ఎక్కువ టెస్టులు చేస్తే ఎక్కువ కేసులు వస్తాయని, దీంతో తన ఇమేజ్ కు డ్యామేజీ వస్తుందని భావించి ప్రభుత్వం అడ్డుచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో కరోనా ఉధృతంగా ఉందని, కనీసం 15 రోజులు లాక్డౌన్ పెడితే పరిస్థితి అదుపులోకి వస్తుందని హెల్త్డి డిపార్ట్మెంట్ సూచించగా.. ఈ విషయం స్వయంగా కేసీఆరే అప్పట్లో ప్రకటించారు. కానీ.. ఆ సూచనను కూడా ప్రభుత్వం పక్కన పడేసింది. టెస్టులు పెంచాలని కోర్టు, విపక్షాలు, గవర్నర్ పదే పదే చెప్పడంతో చివరికి ర్యాపిడ్ టెస్టులకు ఒప్పుకున్నట్టు సమాచారం.

ప్రభుత్వం ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో..!
కేసీఆర్ ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్లకు ఎప్పుడు ఏ రకమైన ట్రీట్మెంట్ లభిస్తుందో అంచనా వేయడం కష్టమని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు అత్యంత నమ్మకస్తులైన ఆఫీసర్లను సీఎంవోలో నియమించుకున్నారు. అందులో ఐఏఎస్ శాంతికుమారి ఒకరు. తొలి ప్రభుత్వంలో ఆమె సీఎం సెక్రటరీగా కీలకమైన రెవెన్యూ, పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖలను పర్యవేక్షించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శాంతికుమారిని సీఎంవో సెక్రటరీగా కొనసాగిస్తూనే.. అదనంగా హెల్త్ శాఖ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. దాదాపు మూడేండ్లుగా శాంతికుమారి హెల్త్ శాఖ సెక్రటరీగా ఉన్నారు. కరోనా నియంత్రణ విషయంలో తీసుకోవాల్సిన
చర్యల గురించి సీఎం కేసీఆర్ నేరుగా ఆమెతోనే మాట్లాడేవారని తెలిసింది. కానీ ఉన్నఫళంగా బుధవారం ఆమెను బదిలీ చేశారు. అదేవిధంగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితారాణాను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇలా హెల్త్డి డిపార్ట్ మెంట్లోని ఇద్దరు సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. కరోనా విషయంలో ప్రభుత్వం చేసిన తప్పులకు ఆఫీసర్లు శిక్షలు అనుభవించాల్సి వస్తోందని హెల్త్డి డిపార్ట్మెంట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఐఏఎస్లకు నో పవర్స్?
రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్ లు నిమిత్త మాత్రులనే టాక్ ఉంది. ప్రతి విషయంలో ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్లాలో ప్రగతిభవన్ నుంచే ఆదేశాలు వస్తుంటాయని ఆఫీసర్లు అంటున్నారు. సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ అసలు ఉండదని చెప్తున్నారు. ఒకవేళ ధైర్యం చేసి ఏ నిర్ణయమైన తీసుకుంటే మరుక్షణంలో హెచ్చరికలు వస్తాయని అంటున్నారు. అనుమానం ఉన్న ఐఏఎస్ ల కదలికలపై ప్రత్యేక నిఘా కూడా ఉంటుందని చెప్తున్నారు. తమకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కొన్నాళ్ల క్రితం కొందరు సీనియర్ ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు.

For More News..

ఆక్స్‌ఫర్డ్ టీకాతో డబుల్ ప్రొటెక్షన్

లక్షలు పెడతామన్నా బెడ్లు లేవ్

Latest Updates