దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు: జుడిషియల్ కమిషన్ సభ్యుల ప్రొఫైల్

దిశ ఎన్‌కౌంటర్ కేసులో జుడిషియల్ ఎంక్వైరీకి త్రిసభ్య కమిషన్‌ను నియమించింది సుప్రీం కోర్టు. కమిషన్‌కు సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికాస్ శ్రీధర్ సిర్పూర్కర్ నేతృత్వం వహిస్తారు. బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు.

ఎర్రకోటపై దాడి కేసులో టెర్రరిస్టుకు ఉరేసిన జడ్జి

వికాస్ శ్రీధర్ సిర్పూర్కర్.. ప్రస్తుతం దిశ నిందితుల ఎన్ కౌంటర్ జ్యూడీషియల్ కమిటీని లీడ్ చేస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు జడ్జీగా పనిచేశారు. 1992లో బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా నియామకం జరిగింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టులోనూ పనిచేశారు. 2004లో ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు. అక్కడి నుంచి కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. 2007లో సుప్రీంకోర్టు జడ్జీగా సిర్పూర్కర్ నియమితులయ్యారు. నాలుగున్నరేళ్లు సుప్రీం జడ్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011, జనవరి 12న రిటైర్డ్ అయ్యారు. ఎర్రకోటపై దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాది మహమ్మద్ ఆరీఫ్ కు ఉరిశిక్షను ఖరారు చేశారు జస్టిస్ సిర్పూర్కర్. 2009 డిసెంబరులో ఒక పరువు హత్య కేసులో చెల్లెల్ని చంపిన అన్నకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా తగ్గించారు.  ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కార్యాలయం అందించే సేవలు.. 1986  వినియోగదారుల రక్షణ చట్టం కింద సేవ పరిధిలోకే వస్తాయని, ఈ చట్టం ప్రకారం పిఎఫ్ చందాదారుడు కూడా వినియోగదారుడేనని తీర్పు ఇచ్చారు జస్టిస్ సిర్పూర్కర్.

కర్ణాటక వాసి.. బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా ప్రకాశ్

జస్టిస్ రేఖా ప్రకాశ్ సొందూర్ బల్డోట.. కర్ణాటకలోని హుబ్లీలో జన్మించారు. 1980లో లీగల్ ప్రాక్టిస్ మొదలుపెట్టారు. 1992లో బాంబే సిటీ సివిల్ జడ్జీగా నియామకం జరిగింది. నాగ్ పూర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జీగా పనిచేశారు. అదే హోదాలో జల్గావ్, పుణేలో కూడా పనిచేశారు. 2007లో బాంబే హైకోర్టు OSDగా రిక్రూట్ అయ్యారు. 2007లో బాంబే హైకోర్టు రిజిస్ట్రర్ జనరల్‌గా, 2008లో అడిషనల్ జడ్జీగా బాంబే హైకోర్టులో నియమితులయ్యారు రేఖ ప్రకాశ్.

రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తు చేసిన ఆఫీసర్

కార్తికేయన్.. తమిళనాడుకి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. పూర్తిపేరు దేవరాయపురం రామసామి కార్తికేయన్. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసుని దర్యాప్తు చేసిన సీబీఐ బృందాన్ని లీడ్ చేశారు. రిటైర్ అయిన తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి డైరెక్టర్ జనరల్‌గానూ సేవలందించారు కార్తికేయన్. CRPFకు స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా విధులు కూడా నిర్వర్తించారు కార్తికేయన్.

Latest Updates