చటాన్‌పల్లికి నిందితుల కుటుంబ సభ్యులు

దిశ నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత డెడ్‌బాడీలను అప్పగించేందుకు నిందితుల కుటుంబ సభ్యులను చటాన్ పల్లికి తీసుకువస్తున్నారు. జొల్లు నవీన్ తల్లిదండ్రులు మాత్రం పోలీసులతో రావడానికి ఒప్పుకోవడం లేదు. దిశ నిందితలను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. సీన్ రీకనస్ట్రక్షన్ కోసం నిన్న నిందితులను చటాన్ పల్లిలోని ఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. చేసేది ఏంలేక పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. మొదట్లో వారి మృతదేహాలకు స్పాట్‌లోనే పోస్టుమార్టం నిర్వహించాలని భావించారు. అందుకోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి నుంచి అయిదుగురు డాక్టర్ల బృందం బయలుదేరింది. అయితే పోస్టుమార్టం అక్కడే కాకుండా మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఇందుకోసం నిందితుల కుటుంబసభ్యులను చటాన్ పల్లికి తీసుకురావడానికి పోలీసులు నిందితుల స్వగ్రామాలకు వెళ్లారు. ఆరిఫ్, శివ, చెన్నకేశవులు కుటుంబ సభ్యులు పోలీసులతో రావడానికి అంగీకరించారు. కానీ, జొల్లు నవీన్ తల్లిదండ్రులు మాత్రం పోలీసులతో రావడానికి ఒప్పుకోవడం లేదు.