నా భర్తను అన్యాయంగా చంపేసిన్రు

మక్తల్, వెలుగు: తన భర్త పోలీసులపై తిరగబడలేదని, వాళ్లు కావాలనే తన భర్తను అన్యాయంగా కాల్చి చంపారని ‘దిశ’ కేసులో నిందితుడు చింతకుంట చెన్నకేశవులు భార్య రేణుక ఆరోపించారు. కనీసం చివరి చూపు కూడా దక్కనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పసిపిల్లలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసిన వాళ్లెందరో జైళ్లలో ఉన్నారని, వాళ్లనెందుకు కాల్చి చంపలేదని నిలదీశారు. శనివారం చెన్నకేశవులు భార్య రేణుక, తల్లి జయమ్మ, బంధువులు ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లా గుడిగండ్లలో అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. చెన్నకేశవులు తప్పు చేసి ఉంటే చట్టప్రకారం ఏ శిక్ష వేసినా సమ్మతమేనని, కానీ ఇట్లా కాల్చి చంపడం ఏమిటని నిలదీశారు.

ఇప్పుడు నాకెవరు దిక్కు?

తన భర్తను పోలీసులు అన్యాయంగా చంపేశారని రేణుక ఆరోపించారు. తన భర్తను వారం రోజుల కింద తీసుకెళ్లారని, ఏమీ చేయమని కూడా చెప్పారని.. కానీ కడసారి చూపు కూడా దక్కకుండా చంపేశారని కన్నీళ్లు పెట్టారు. ‘‘ఏడాది కిందనే చెన్నకేశవులు, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నం. ఇప్పుడు నేను ఆరు నెలల గర్భవతిని. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతలేదు. భర్త లేకపోతే నేనెట్లా బతకాలె.. నేను కూడా సచ్చిపోతా. తప్పు చేసినోళ్లకు కోర్టు ఎట్లాంటి శిక్ష వేసినా సరే. అట్లా కాకుండ ఇట్ల పోలీసులు కాల్చి చంపడం ఏంటి. ఇది ఎంతవరకు సమంజసం. నా భర్తను పోలీసులు కాల్చి చంపడంతో కుటుంబం దిక్కులేనిదైంది.” అంటూ రోదించారు. పసిపిల్లలపై, మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని, వారందరినీ ఇట్లా చంపేయగలరా అని నిలదీశారు. తన భర్త పోలీసులపై తిరగబడలేదని, పోలీసులు వారిని కావాలనే చంపారని ఆరోపించారు. కాగా చెన్నకేశవులు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు.

Latest Updates