అదే తరహాలో 9 హత్యలు చేసిన దిశ నిందితులు?

దర్యాప్తులో వెలుగుచూస్తున్నభయంకర నిజాలు
దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినా వారి గురించి మాత్రం ఇంకా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిశ నిందితులు ఇప్పటివరకు 9 హత్యలు చేసి మృతదేహాలను కాల్చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైవేల పక్కన జరిగిన హత్యలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల డీఎన్ఏతో మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా ఆరీఫ్ అలి 6, చెన్నకేశవులు 3 హత్యలు చేసినట్లు విచారణలో చెప్పారని పోలీసులు అంటున్నారు. హైవేల పక్కన దిశ తరహాలో దాదాపు 15 హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలన్నీ లైంగిక దాడి చేసిన తర్వాతే హత్యచేసి కాల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన వారి డీఎన్ఏలను కూడా నిందితుల డీఎన్ఏలతో పోల్చి చూస్తున్నారు.

రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైద్రాబాద్, కర్ణాటక, బీహార్ హైవేలపై వీరు ఈ దారుణాలకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలపై దర్యాప్తు చేయడానికి నాలుగు బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు సమాచారం. పోలీసులు దిశ కేసుపై చార్జీషీట్ త్వరలోనే వేయనున్నారు. దానికి ముందుగానే ఈ 15 కేసులను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. చటాన్ పల్లి ఎన్‌కౌంటర్ సమయంలోనే సీపీ సజ్జనార్ నిందితులకు పలు హత్యలతో సంబంధమున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఈ తరహా ఘటనల్లో దిశ నిందితుల పాత్ర ఉందేమో తేల్చాలని సీపీ అన్నారు. దిశ నిందితుల డీఎన్ఏలు పలు హత్య కేసులతో మ్యాచ్ అవుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

For More News..

కళాకారులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి 50 వేల ఆర్థికసాయం

Latest Updates